జీవితమే సఫలము!!

 


జీవితమే సఫలము!!


అనార్కలి @ 70

     28.04.1955



ఎలిశెట్టి సురేష్ కుమార్

   9948546286


రాజశేఖరా..

నీపై మోజు తీరలేదురా..

ఔను..ఎన్ని భాషల్లో 

ఎందరు హీరోలు 

చేసినా..

ఇంకెందరు నాయికలు

అభినయించినా..

మన అంజలి..అనార్కలి..

అక్కినేని..సలీం..అంతే!


భాషాభిమానమో..

సెహజాదా సలీం ఎయెన్నార్..

అనార్కలి అంజలి..

అక్బర్ పాదుషా ఎస్వీఆర్..

జోదాభాయి కన్నాంబ..

మాన్ సింగ్ నాగయ్య..

ఆ అయిదుగురి

అభినయ కౌశలమో..

ఆదినారాయణ రావు సంగీతమో..

రాజశేఖరా..నీపై మోజు తీరలేదురా..

అంటూ హృద్యంగా 

సాగిన గీతమో..

అంతకు ముందు 

మదన మనోహర 

సుందర నారీ..

గంభీరమైన ఘంటసాల గళం

మైమరచిన పాదుషా సభ..

ఆ పాటతోనే తెలుగు ప్రేక్షుకుల జీవితమే సఫలము

రాగ సుధా భరితము..

అనార్కలి చరితము..!


మనది కాని కథ..

అనార్కలి వ్యధ..

మొఘలుల కాలం..

వేదాంతం జాలం..

తెలుగునాట 

కలెక్షన్ల కలకలం..

పాటలు అలరిస్తూ కలకాలం!


కలవోలె మన ప్రేమ కరగిపోవునా..

వియోగాలే విలాపాలే

విడని మా ప్రేమ ఫలితాల..

కలిసె నెలరాజు 

కలువ చెలిని..

అనార్కలి ఓ అనార్కలి

ప్రేమకై బ్రతుకు బలి..

మా  కథలే ముగిసెనుగా

ఈ విధి స్మారకమై..

పాటల్లోనే ప్రశ్నలు..

గీతాల్లోనే సమాధానాలు..

ఈ పాటలే అక్బర్ తోటలో

విరిసిన పుష్పాలు..

వింటుంటే ఇప్పటికీ 

కన్నుల నిండుగా 

ఆనంద భాష్పాలు..!


సురభి బాలసరస్వతి 

ఆడ విలనీ..

అనార్..సలీం ప్రేమ కథలోని

పానకంలో పుడక..

అనార్కలి అంటే పడక...

ఈ కథలో ఆమే ప్రమాదం..

ఆమె వల్లనే 

ముగింపు విషాదం..

ఆ విరోధి 

కుట్రల ఫలితమే 

ప్రేమమూర్తి

అనార్ సమాధి...!


అనార్కలి..

కర్కశ 'రాజ' కీయాలకు

బలైన కోమలి..

సలీం..

వలపు తోటలో అనురాగమాలి..

ఆ సినిమా

మధుర గీతాల 

కథాకళి..

ప్రేమ సుమాన్ని

మొగ్గలోనే తుంచేసిన

పాదుషా రాక్షసకేళి..

వేదాంతం అద్భుతంగా ఆవిష్కరించిన విషాదాంతం!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు