రేవంత్ రెడ్డీ ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరు

 


రాష్ట్రంలో ఫోన్ టాపింగ్ వ్యవహారంతో పాటు కవిత అరెస్ట్ పార్టి నేతల జంప్ తదితర అనేక రాజకీయపరమైన చిక్కులు చుట్టుముట్టినా బిఆర్ఎస్ పార్టి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తగ్గేదేలే  అంటూ సిఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు.

రేవంత్ రెడ్డీ ఇక్కడ భయపడేవాళ్లు ఎవరూ లేరు… వెంట్రుక కూడా పీకలేవ్ అంటూ  కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కూడ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  

మంగళవారం సికింద్రాబాద్ లోక్ సభ పరిధి ముఖ్య నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ…

రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా? బీజేపీ ప్రభుత్వమా? అని అర్థం కావడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 

ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి పోయే మొదటి నేత రేవంత్ రెడ్డేనని కేటీఆర్ ఆరోపించారు. జీవితాంతం కాంగ్రెస్​‌లో ఉంటా అని రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్​రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయచేతగాక ఫోన్ ట్యాపింగ్ అని లీకులు ఇస్తున్నారని మండిపడ్డారు. దీనిపై విచారణ చేసి తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, భయపడే వాళ్లు లేరని కేటీఆర్ అన్నారు. సామంత రాజులా ఢిల్లీకి 2500 కోట్లు కప్పం కట్టారని, ఇందుకోసం అందరినీ బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.


 కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై విమర్శలు చేస్తూ  అయిదేళ్ల కాలంలో కిష‌న్ రెడ్డి ఏ ఒక్క అభివృద్ధి ప‌ని చేయ‌లేద‌న్నారు. కిస్మ‌త్ బాగుండి కేంద్రమంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్‌పేట నుంచి కాలేరు వెంకటేశ్‌ను ప్రజలు గెలిపించారన్నారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచి.. కిస్మత్ బాగుండి కేంద్రమంత్రి అయ్యారన్నారు. 2023లో కిషన్ రెడ్డి తాను పోటీ చేయకుండా వేరొకరిని నిలబెట్టారని విమర్శించారు.


కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి చేసిన గొప్ప పనులు మూడంటే మూడు చేశారని విమర్శించారు. కరోనా వస్తే చాలామంది అన్నదానాలు, అంబులెన్స్ ఇస్తే, కిషన్ రెడ్డి మాత్రం కుర్‌కురేలు పంచారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తే, కిషన్ రెడ్డి సీతాఫల్‌మండి రైల్వే స్టేషన్‌లో రెండు లిఫ్ట్‌లు ప్రారంభించారని, నాంపల్లిలో సింటెక్స్ ట్యాంకులు ప్రారంభించారని ఎద్దేవా చేశారు. మూసీకి వరద వస్తే కిషన్ రెడ్డి రూపాయి తేలేదని విమర్శించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు