చట్టసభల్లో వాటా కోసం కొనసాగుతున్న బి.సి మహా పాదయాత్ర
వంద కిలోమీటర్లు పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్న ఆల్ ఇండియా ఒబిసి పాదయాత్ర బృందానికి ఘన సన్మానం
ఊరూరులో స్వాగతం పలుకుతున్న సామాజిక, ప్రగతిశీల సంఘాల నాయకులు
చాలా గొప్ప ఉద్యమమని కీర్తిస్తున్న ప్రజా సంఘాల నాయకులు
పాదయాత్రకు నాయకత్వం వహిస్తున్న సాయిని నరేందర్, మేకపోతుల నరేందర్, బత్తుల సిద్ధేశ్వర్లకు పలువురి అభినందనలు
స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు దాటినా భారతదేశంలో బి.సి లకు జనగణన లేక, చట్టసభల్లో సముచిత స్థానం లేకుండా ఆత్మగౌరవం లేకుండా జీవిస్తున్న వారికి సకల సామాజిక రంగాల్లో మేమంతమందిమో మాకంత వాటా రావాలని ప్రధానంగా చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం వాటా కావాలని 86 సంఘాలతో ఏర్పడిన ఆల్ ఇండియా ఒబిసి జాక్ నాయకత్వంలో ఈ నెల ఒకటి నుండి మహా వీరుడు పండుగ సాయన్న స్వగ్రామం మహబూబ్ నగర్ జిల్లా మిరుగోన్ పల్లి నుండి ఈ నెల ఒకటిన ప్రారంభమైన బి.సి మహా పాదయాత్రకు ప్రతి గ్రామంలో ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతూ మధ్యాహ్న విరామానికి, రాత్రి బసకు ఆశ్రయమిచ్చి మద్దతు తెలుపుతున్నారు.
పాదయాత్ర ప్రారంభ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన విముక్త చిరుతల కక్షి పార్టీ తెలంగాణ రాష్ట్ర అద్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్ మాట్లాడుతూ చట్టసభల్లో బి.సి వాటా సాధన కోసం ఆల్ ఇండియా ఒబిసి జాక్ నాయకత్వంలో సాయిని నరేందర్, బత్తుల సిద్దేశ్వర్లు, మేకపోతుల నరేందర్ గౌడ్ లు చేస్తున్న పోరాట దేశంలోనే చారిత్రకంగా నిలిచిపోతుందని అన్నారు. చరిత్రలో బి.సి ల త్యాగం, ప్రస్తుత బి.సి ల అనచివేస్తున్న తీరు, బి.సి ల ఐక్యత గూర్చి ఇచ్చిన చైతన్యపూరిత సందేశం ప్రజలను ఆలోచింపజేసింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం జె.పి దర్గా లో సబ్బండ కులాల రచ్చబండ రాష్ట్ర అద్యక్షులు బూస జంగయ్య స్వాగతం పలికి బోజనము ఏర్పాటు చేశారు. ఇన్ముల్ నర్వా గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న ప్రజా సంఘాల నాయకులు రాజారాం యాదవ్, వాసు కె యాదవ్, జక్కని సంజయ్, మట్ట జయంతి అంబేద్కర్ కు నివాళులు అర్పించి పాదయాత్రలో భాగమై తరువాతి గ్రామం వరకు నడిచి సంఘీభావం తెలిపారు. 4వ రోజు పాదయాత్రలో మహేశ్వరం మండలంలో ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి నాగారం గ్రామంలో తెలంగాణ అమరుడు సిరిపురం యాదయ్య సమాధి వద్ద ఆయనకు నివాళులు అర్పించి యాదయ్య లాంటి అమరుల స్పూర్తితో తెలంగాణ సాధించుకున్నామని, అదే స్పూర్తితో మహా పాదయాత్ర జయప్రదం చేసి చట్టసభల్లో బి.సి వాటా సాధిస్తామని నినదించారు. 5వ రోజు ఖిస్మత్ పూర్ చేరుకున్న పాదయాత్ర బృందానికి తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ ఘన స్వాగతం పలికి మాట్లాడారు. దేశంలో జరిగిన ఎన్నో పోరాటాల్లో బి.సి లు కీలకపాత్ర పోషించారని దేశాన్ని ఏలిన చరిత్ర కలిగిన బి.సి లు చట్టసభల్లో న్యాయమైన వాటా కోసం చేస్తున్న పోరాటం జయప్రదం కావడం కోసం నేను పూర్తి అండగా ఉంటానని అన్నారు. మెహిధిపట్నం చేరుకున్న పాదయాత్ర బృందానికి బి.సి యునైటెడ్ ఫ్రంట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పాలూరి రామకృష్ణయ్య దంపతులు ఘన స్వాగతం పలికి చైతన్యపూరిత సందేశం ఇచ్చారు.
100 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకొని గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకున్న బృందానికి వివిధ ప్రజా సంఘాలు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర బృందానికి పూలమాలలు వేసి సత్కరించారు. పాదయాత్ర బృందం అమరవీరుల స్థూపానికి పూలు వేసి అమరవీరులకు నివాళులు అర్పించారు. అమరవీరుల స్పూర్తితో చట్టసభల్లో బి.సి వాటా సాధిస్తామని నినదించారు. జలదృష్యం కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్దకు చేరుకొని ఆయనకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బి.సి రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్, నూర్ బాషా సంఘం షేక్ సత్తార్ లు మాట్లాడారు. బాపూజీ గొప్పదనం గూర్చి వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి, త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని చట్టసభల్లో బి.సి వాటా సాధించాలని పిలుపునిచ్చారు. టాంక్ బండ్ పై మాజీ కేంద్ర మంత్రి, మాజీ గవర్నర్, బి.సి హక్కుల కోసం న్యాయపరమైన సేవలు అందించిన పుంజాల శివశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి ఆయన స్పూర్తితో బి.సి హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేస్తామని అన్నారు. శివశంకర్ విగ్రహాన్ని టాంక్ బండ్ పై ప్రతిస్టాపించి ఆయనకు సముచిత గౌరవం ఇవ్వాలని ఆల్ ఇండియా ఒబిసి నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సర్ధార్ పుట్టం పురుషోత్తం, నాయకులు ఏటిగడ్డ అరుణ పటేల్ పాల్గొని మాట్లాడారు. ఉత్పత్తి, శ్రమలో కీలకపాత్ర పోషిస్తున్న బి.సి లకు చట్టసభల్లో వాటా కోసం కొనసాగుతున్న మహా పాదయాత్రకు అడుగడుగునా అండగా ఉంటానని అన్నారు.
పాదయాత్ర బృందాన్ని తన ఇంటికి స్వాగతించిన రాజ్యసభ సభ్యుడు, జాతీయ బి.సి సంక్షేమ సంఘం అధ్యక్షులు పాదయాత్ర బృందాన్ని సత్కరించి మాట్లాడారు. బి.సి లకు సముచిత స్థానం కోసం, విద్య ఉద్యోగాల్లో అవకాశాల కోసం, హాస్టళ్లు కోసం, చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం ఎన్నో ఏండ్లుగా పోరాటాలు చేస్తున్నప్పటికీ, మండల్ కమీషన్ లాంటివి ఎన్ని వచ్చినా ఆచరణకు నోచుకోక బి.సి లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. చట్టసభల్లో వాటా కోసం పాదయాత్ర చేయడం గొప్ప విషయమని, ఈ పాదయాత్రకు నాయకత్వం వహిస్తున్న సాయిని నరేందర్, మేకపోతుల నరేందర్ గౌడ్, బత్తుల సిద్దేశ్వర్, పటేల్ వనజ, వెలుగు వనితలకు అభినందనలు తెలిపారు. ఈ పాదయాత్ర వల్ల చెల్లాచెదురైన బి.సి లలో ఐక్యత పెరిగి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని అన్నారు. చట్టసభల్లో వాటా సాధన కోసం పాదయాత్ర చేస్తున్న వారికి పూర్తి మద్దతుగా ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ పాల్గొని సంఘీభావం తెలియజేసి ఉద్యమానికి అండగా ఉంటానని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి చేరుకున్న పాదయాత్ర బృందానికి యూనివర్సిటీ విద్యార్థి నాయకులు పాలడుగు శ్రీనివాస్ నాయకత్వంలో ఘనస్వాగతం పలికి పూలే, అంబేద్కర్ చిత్ర పటాలకు పూలమాల వేసి పాదయాత్ర బృందాన్ని సత్కరించారు. మహనీయుల స్పూర్తితో చట్టసభల్లో బి.సి వాటా సాధిస్తామని నాయకులు ప్రసంగించారు.
ఈ పాదయాత్రలో మహిళలు, విద్యార్థులు నిర్విరామంగా పాల్గొనడం విశేషం. విద్యార్థి వెలుగు వనిత మహిళలు విమల, సింగారపు అరుణ, సద్గుణ, స్వరూప, ఏటిగడ్డ అరుణ పటేల్, సూరారపు రమారెడ్డి, స్వాతిలతో పాటు విశ్వపతి, చెన్న శ్రావణ్ కుమార్, న్యాయవాది రంజిత్ గౌడ్, కొంగర నరహరి, రామ్ ప్రసాద్, కె విజయ్ కుమార్, పర్వత సతీష్, చింతలగారి వెంకటస్వామి, బత్తుల రాంనర్సయ్య, ఎర్రమల్ల శ్రీను, బుచ్చిబాబు, బాలస్వామి, సాయిరాం, బిక్షపతి, శ్రీహరి, అజయ్ పటేల్, చాపర్తి కుమార్ గాడ్గే, ఆంజనేయులు తదితరులు పాల్గొనగా వివిధ సంఘాల నాయకులు నాగేందర్ గౌడ్, ఆవుల రామారావు, బెక్కం వెంకట్, న్యాయవాది బత్తుల కార్తీక్ నవయాన్, నగిరి ప్రవీణ్, రోజా నేత, బోర సుభాష్, రామన్ గౌడ్, బొల్లం లింగమూర్తి, తౌటం సత్యం, మట్ట రాజు యాదవ్, ప్రొఫెసర్ కొంగ వీరాస్వామి, చింతకింది కుమారస్వామి, డాక్టర్ స్వప్నిల్, భాస్కర్, కొత్త వినయ్ బాబు తదతరులు పాల్గొన్నారు
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box