నా మీద నిర్బంధం, ఎన్ఐఎ దాడి – మిత్రులకు నివేదిక

 


నా మీద నిర్బంధం, ఎన్ఐఎ దాడి – మిత్రులకు నివేదిక 


నిన్న ఉదయం అన్ని ఉదయాల లాంటిది కాదు. 


ఎనిమిది మంది అపరిచితులు, అందులో ఇద్దరు ఏకే 47, ఎస్ఎల్ఆర్ లాంటి అత్యాధునిక ఆయుధాలు పట్టుకున్నవారు, నా ఇంటిని ఆక్రమించిన ఉదయం. నాలుగు గంటల పాటు నా ఇంట్లో నేను బందీగా ఉండిపోవలసి వచ్చిన ఉదయం. నా సొంత వస్తువులు మరెవరో చెల్లాచెదరు చేస్తుంటే మౌనసాక్షిగా చూడవలసి వచ్చిన ఉదయం. నా ఫోన్ మరెవరో ఎత్తుకుపోతుంటే, ఎంత వాదించినా, చివరికి మౌనంగా అంగీకరించవలసి వచ్చిన ఉదయం. పాల ప్యాకెట్ తీసుకుని పొరుగింటివారు వచ్చి తలుపు కొడితే, నా ఇంటి తలుపు నేను తీయడానికి మరెవరినో అనుమతి అడగవలసి వచ్చిన ఉదయం. కాసేపు ఆందోళనతో, కాసేపు కోపంతో వాదించి, కాసేపు విషయాలు వివరించడానికి ప్రయత్నించి, కాసేపు నిర్లిప్తంగా కూచుని, కాసేపు వార్తాపత్రికలు చదువుకోవడంలో మునిగిపోయి... అనేక ఉద్వేగాలు ముప్పిరి గొన్న నాలుగు గంటల కాలం. 


నిన్న, ఫిబ్రవరి 8 గురువారం, ఉదయం ఐదు గంటలకు నా తలుపు మోగింది. తెరిచి చూస్తే గ్రిల్ అవతల సాయుధ పోలీసులతో సహా ఏడెనిమిది మంది గుంపు కనబడింది. గ్రిల్ తాళం తీసి లోపలికి రమ్మన్నాను. గుమ్మంలో నిలబడే, మర్యాదగా “మీ మీద సర్చ్ వారంట్ ఉంది, ఇల్లు సర్చ్ చేస్తాం” అన్నారు. “మేం మీ ఇంట్లోకి రాకముందే మమ్మల్ని చెక్ చేసుకోండి, మేమేమైనా తెచ్చి మీ ఇంట్లో పెట్టి తర్వాత అవి దొరికాయని చెప్పే అవకాశం లేకుండా” అన్నారు. అదేమీ అక్కర్లేదనీ, పోలీసులు తప్పుడు సాక్ష్యాధారాలు సృష్టించిన కేసులు వందలాది చూశానని, కనుక చెకింగ్ లేకుండానే లోపలికి రావచ్చుననీ అన్నాను. 


సర్చ్ వారంట్ చూపించమన్నాను. అది చదవడానికే ఇస్తాం గాని, మీరు ఉంచుకోవడానికి కాదు అన్నారు. “అట్లా ఉండదే” అంటూనే ఆ కాగితం తీసుకున్నాను. 


తెలంగాణ పోలీసులు సెప్టెంబర్ 2023లో నమోదు చేసిన కేసును ఎన్ఐఎ తీసుకుందనీ, ఆ కేసులో నిందితుడిగా నా ఇల్లు సోదా చేయడానికి అనుమతిస్తున్నామనీ, ఉన్నతాధికారులు రాసిన కాగితం అది. 


తెలంగాణ ప్రభుత్వం చేసిన అనేక దుర్మార్గాలలో ఆ కేసు ఒకటి. అప్పటి ప్రభుత్వం దిగిపోవడానికి రెండు నెలల ముందు తయారుచేసిన ఆ అబద్ధపు కేసులో నా పేరూ, మరెన్నో పేర్లూ ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా ఇరికించారు. ఆ కేసు పెట్టగానే చంద్రశేఖర రావును ఉద్దేశించి నేను రాసిన బహిరంగలేఖ అప్పుడే ఆంధ్రజ్యోతిలో అచ్చయింది (మళ్లీ ఒకసారి మీకు గుర్తు చెయ్యడానికి అది కూడా ఇక్కడ ఇస్తున్నాను). 


ఈ కేసు ఒక్కటి మాత్రమే కాదు, టిఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులకు ఇచ్చిన బారాఖూన్ మాఫ్ తో విప్లవకారుల మీద, సానుభూతి పరుల మీద, ఆదివాసుల మీద డజన్ల అబద్ధపు కేసులు పెట్టారు. పదమూడు పద్నాలుగు కేసులలో బహిరంగ ప్రజా జీవితంలో పనిచేస్తున్న, మాట్లాడుతున్న, రాస్తున్న బుద్ధిజీవుల పేర్లు ఇరికించారు. ప్రొ. హరగోపాల్, ప్రొ. పద్మజా షాల వంటి వారి పేర్లు, జస్టిస్ సురేష్, నర్సన్న వంటి మరణించిన వారి పేర్లు, ఒకే పేరు రెండు మూడు సార్లు ఉండడం వంటి అవకతవకల కేసులవి. నా పేరు ఈ కేసుతో పాటు మూడు కేసుల్లో ఇరికించారు. తెలంగాణ పోలీసులు చేసిన దుర్మార్గం ఏమిటంటే ఈ అన్ని కేసుల్లో యుఎపిఎ కింద ఆరోపణలు చేశారు. ఒక కేసు యుఎపిఎ కింద నమోదు చేయడమంటే, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా కేంద్ర ప్రభుత్వపు ఎన్ఐఎ తీసుకోవడానికి అవకాశం ఇవ్వడం. రాజ్యాంగం తనకు ఇచ్చిన అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం తనంతట తానే కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టడం. ఎన్ఐఎ చట్టంలో ఉన్న సమాఖ్య స్వభావానికి భిన్నమైన, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాలరాసే, చట్ట వ్యతిరేకమైన, దుర్మార్గమైన నిబంధన అది. ఆ పని టిఆర్ఎస్ ప్రభుత్వం విచ్చలవిడిగా చేసింది. ఆ కేసులను ఉపసంహరించకపోతే, ఇప్పటికైనా యుఎపిఎ పెట్టగూడదని పోలీసులను ఆదేశించకపోతే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇలా ఎన్ని కేసుల్లో చొరబడుతుందో తెలియదు. 


సరే, అలా సెప్టెంబర్ 15న తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ఈ కేసును జనవరి మొదటివారంలో ఎన్ఐఎ తీసుకుందట. చంద్రశేఖర రావు వెళ్లిపోతూ నాకు ఇచ్చిన ఆఖరి కానుక అన్నమాట ఇది! 


నేను ఆ సర్చ్ వారంట్ చదువుతుండగానే, “మీ ఫోన్ ఇవ్వండి సార్” అన్నారు బి గణేష్ బాబు అని పరిచయం చేసుకున్న ఎన్ఐఎ ఇనస్పెక్టర్, ఈ కేసు విచారణాధికారి. 


అసలట్లా లోపల అడుగు పెట్టగానే ఫోన్ ఇమ్మని మర్యాదగా అడగడం గాని, దురుసుగా లాక్కోవడం గాని చట్టం ఆమోదించిన పనులు కావని, ఏ చట్టం కింద అడుగుతున్నారని ప్రశ్నించాను. అప్పుడు కాస్త బీపీ కూడా పెరిగినట్టుంది. ఎలక్ట్రానిక్ డివైజెస్ సీజ్ చేయడానికి గైడ్ లైన్స్ ఏమిటి అని ఇప్పుడు సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్నదని, ఇంకా గైడ్ లైన్సే తయారు కాలేదని, అటువంటప్పుడు ఫోన్ ఇమ్మని ఏ చట్టం ప్రకారం అడుగుతారని ప్రశ్నించాను. అలాగే, ఆర్ణబ్ గోస్వామిని అరెస్టు చేసిన సందర్భంలో ఆయన కుటుంబ సభ్యులు ఇద్దరు సెల్ ఫోన్లు వాడినట్టు కనబడిందని, ఒకరు ఆ అరెస్టు ఘటనను చిత్రీకరించారని, మరొకరు అప్పుడే న్యాయవాదికి ఫోన్ చేస్తున్నారని, అంటే పోలీసులు వచ్చినప్పుడు కూడా సొంత సెల్ ఫోన్ వాడగూడదనే నియమం, వెంటనే అది పోలీసులకు ఇచ్చేయాలనే నియమం లేదని కదా అని వాదించాను. ఒక జర్నలిస్టుకు ఒక నియమం, మరొక జర్నలిస్టుకు మరొక నియమం ఉంటాయా అని వాదించాను. 


నా వాదనలన్నీ ఆయన మౌనంగా విని, వాటికి నేనేమీ చెప్పలేను గాని, ఫోన్ ఇవ్వవలసిందే అన్నారు. అప్పుడు నేను నా సర్చ్ వారంట్ మీద నా నిరసన రాసినాక మాత్రమే ఫోన్ ఇస్తానన్నాను. పోలీసులతో సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ గురించి వాదించానని, నిరసనతోనే నా ఫోన్ ఇస్తున్నానని రాశాను. నేనా సంతకం చేస్తుండగా, ‘అరెస్టా’ అని అడిగింది వనజ. ‘కాదు మేడమ్, సర్చ్ వారంట్ మాత్రమే. అరెస్టయితే చెపుతాం గదా’ అన్నారు. 


అప్పుడు వనజ “ఒక ఇండిపెండెంట్ జర్నలిస్టుగా, ఫిల్మ్ మేకర్ గా, యూట్యూబర్ గా నా ఫోన్, నా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కూడా ఇంట్లో ఉంటాయి. మీరు సర్చ్ వారంట్ తెచ్చినది తన పేరు మీద గనుక నా గాడ్జెట్స్ మీరు ముట్టుకోవడానికి వీలులేదు” అంది. “అయ్యో, మీవేమీ తీసుకుపోం మేడమ్. అయితే మీరు మేం ఉన్నంత సేపు బైటికి ఫోన్లు చేయగూడదు. గాడ్జెట్స్ మీవే అని రుజువు చేయాలి” అన్నారు. 


ఇక నేను హాలులోనే కూచుని ఉండగా, వనజను వెంట పెట్టుకుని ఒక్కొక్క గదీ సోదా చేయడానికి బయల్దేరారు. మొదట వనజ ఎడిటింగ్ టేబుల్, మాక్ మిషన్, ఆ ఫిల్ములు, యూట్యూబ్ వీడియోలు ఉన్న హార్డ్ డిస్కులు తెరిపించి ఒక్కొక్కటీ చూశారు. ఆ గదిలో ఉన్న గ్రీన్ మ్యాట్, ఫోకస్ లైట్, కెమెరా ట్రైపాడ్, కెమెరాలు అన్నీ ఏమిటేమిటో, ఎట్లా పని చేస్తాయో అడిగారు. “మీదగ్గర లైసెన్స్డ్ రివాల్వర్ ఉందా” అని తనను అడిగారు. నవ్వుకున్నాం.  


అలా తన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు చూడడం అయిపోయాక, నా పుస్తకాలవైపు వెళ్లారు. నేనక్కడ లేను గనుక ఏమేమి చూశారో, చేశారో తర్వాత తెలిసింది గాని అప్పటికైతే మాటలే వినబడ్డాయి. ‘అవి మేం జర్మనీ వెళ్లినప్పుడు వేణు రాసుకున్న నోట్స్’, ‘అవి జ్వాలా నరసింహారావు గారు ఇచ్చిన పుస్తకాలు’, ‘అవి వేణు వ్యాసాల ఫైళ్లు’, ‘దేశంలో దొరకని, ఖరీదైన ఇంగ్లిష్ పుస్తకాల జిరాక్స్ కాపీలు పెట్టుకునాడు, ఆ స్పైరల్ బౌండ్లు అవి’ అంటూ వనజ చెపుతున్న మాటలు వినబడ్డాయి. 


వాళ్ల దృష్టి మొట్టమొదట ఒక పెద్ద పుస్తకాల సంచి మీద పడిందట. అది వనం జ్వాలానరసింహా రావు గారు రాసిన రామాయణ, భాగవత పుస్తకాలు. మా బాపు దగ్గర వావిలికొలను సుబ్బారావు రామాయణం అన్ని కాండలూ ఉండేవని ఎప్పుడో చెప్పానని, జ్వాల గారు నాకు ఆ సెట్ అంతా పంపించారు. అవి చదువుతున్నాను గనుక పైన ఉన్నాయి. బహుశా పోలీసు అధికారి ఆశ్చర్యపోయి ఉంటారు. ఏదో మావోయిస్టు, నిషిద్ధ సాహిత్యం దొరుకుతుందని వస్తే మొదటి అడుగు రామాయణంలో పడిందని! 


కాకపోతే ఆ పక్క బీరువాలో వివి పుస్తకాలు మొత్తం, ఆళ్వార్ స్వామి, శ్రీశ్రీ, కుటుంబరావు, చెరబండరాజు, బాలగోపాల్ ల పుస్తకాల నుంచి ఎంతో సాహిత్యం ఉంది. చరిత్ర, రాజకీయార్థశాస్త్రం, సాహిత్య విమర్శ పుస్తకాలున్నాయి. పైన చుట్టూ గోడలకు కథ, నవల, అనువాద కథ, నవల ఉన్నాయి. అవన్నీ చూశాక, కింద ఖానాల్లో నా రచనల ఫైళ్లున్నాయి. అచ్చు కాగానే కటింగ్ తీసుకుని జాగ్రత్త పెట్టుకోక, సంపాదించలేక, పోయినవన్నీ పోగా, 1980ల నుంచి దొరికిన రచనలే ఐదారు ఫైళ్ళు, బహుశా కొన్ని వందల వ్యాసాలున్నాయి. ఈ ఇరవై ఏళ్లలోనైతే కంప్యూటర్ మీద రాయడం అలవాటయింది గనుక అచ్చయిన పత్రికల కటింగ్స్ కాక, కంప్యూటర్ ప్రింటవుట్లు ఉన్నాయి. అవి చూసీ చూసీ వెతికీ వెతికీ పాపం ఆ అధికారులకు విసుగు వచ్చినట్టుంది. ఆ ఫైళ్లలోనే నేను వ్యాసాలు రాయడానికి సేకరించుకున్న సమాచారం, ముందుగా రాసిపెట్టుకున్న నోట్స్ కూడా ఉన్నాయి. వాటిలో ఆ అధికారికి ఒక కాగితం దొరికింది. అది పట్టుకుని నా దగ్గరికి వచ్చి ఇదేమిటి సార్ అని అడిగారు. బహుశా ఆయన నన్ను అడిగిన ప్రశ్న అది ఒక్కటే!


అది ‘సిపిఐ ఎం ఎల్ రాష్ట్రకమిటీ’ అని ఎర్ర అచ్చులో పేరు ఉన్న ఒక లెటర్ హెడ్. దాని మీద చేతిరాతతో వరలక్ష్మిని సంబోధిస్తూ, ‘సభ పెడదామనుకుంటున్నావు గదమ్మా, సభ పెడితే ఆ సభలోనే నిన్ను ముక్కలుగా నరికేస్తాం, గంటి ప్రసాదం మీద సభ పెడుతున్నావు గదా, ప్రసాదానికి పట్టిన గతే నీకు కూడా పడుతుంది’ అని హత్య బెదిరింపు రాసి, కింద ‘కోమలి, ఛత్తీస్ గడ్ చిరుతలు, ప్రొద్దుటూరు ఏరియా కమిటీ’ అని సంతకం, 2013 డేట్ ఉన్నాయి. ఆ బెదిరింపు లేఖ ప్రభుత్వ, పోలీసుల సృష్టేనని విరసం, ఇతర రచయితలు ఇచ్చిన ఖండన ప్రకటన, ఏదో పత్రికలో అచ్చయినది కూడా దానికి పిన్ చేసి ఉంది. అప్పటి ప్రభుత్వాలు, పోలీసులు నయీమ్ ముఠాతో విప్లవకారుల మీద దాడులు, హత్యలు చేయించాయని, గంటి ప్రసాదం గారిని హత్య చేశాక, ఎవరూ సంస్మరణ సభలు కూడ పెట్టగూడదని ఇటువంటి బెదిరింపు ఉత్తరాలు చాలా మందికి రాశారని, పైన పేపర్ కటింగ్ చూస్తే ఆ వివరాలు తెలుస్తాయని చెప్పాను. ‘ఇది మీదగ్గర ఎందుకు ఉంది’ అని అడిగారాయన. ‘నాకిప్పుడు సరిగా గుర్తు లేదు గాని, బహుశా ఈ బెదిరింపు లేఖల మీద నేను వ్యాసం రాసి ఉంటాను, ఆ వ్యాసం కోసం సమాచార సేకరణలో నాదగ్గరికి చేరి ఉంటుంది’ అన్నాను. సరే అని అది పక్కన పెట్టేశారు. 


ఆ తర్వాత విభాత గదిలోకి వెళ్లి వాడి పుస్తకాలు, ఫోన్ చూశారు. ఆ ఫోన్ ఓపెన్ చేసి వాడిదేనా కాదా చూపించమన్నారు. మా బెడ్ రూమ్ లోకి వెళ్లి అక్కడ నా సొంత ఫైళ్లు, అక్కడ కూడా ఉన్న పుస్తకాలు చూస్తూ మరొక గంట గడిపారు. కిచెన్ లోకి, బాత్ రూంల లోకీ తొంగి చూశారు.  


అప్పటికి మూడు, మూడున్నర గంటలు అయింది. ఇక పంచనామా రిపోర్టు రాయడానికి కూచున్నారు. అప్పటికి జప్తు చేసినది ఒక్క ఫోన్ మాత్రమే గనుక అలాగే పంచనామా రిపోర్టు రాసేశారు. దాని మీద సాక్షుల సంతకాలు, అధికారుల సంతకాలు అయి, నా సంతకం కోసం ఇచ్చారు. ‘జర్నలిస్టుగా నా సెల్ ఫోన్ నా జీవనాధారం. దాన్ని నిరసనతోనే ఇస్తున్నాను” అని రాసి సంతకం చేశాను. 


అప్పుడు ఇనస్పెక్టర్ కు ఒక ఫోన్ వచ్చింది. అవతలి నుంచి మాట్లాడుతున్నవారికి సెల్ ఫోన్ ఒక్కటే సీజ్ చేశామని ఈయన చెపుతున్నారు. అవతలి నుంచి ‘ఇంకా ఏమీ దొరకలేదా’ అని అడిగినట్టున్నారు. ‘ఒక సిపిఐ ఎం ఎల్ లెటర్ హెడ్ మీద చేతిరాత ఉత్తరం ఉంది మేడమ్’ అంటూ నేను వినకుండా ఉండడానికి బైటికి కారిడార్ లోకి వెళ్లారు. ఐదు నిమిషాల తర్వాత వచ్చి, ‘ఈ కాగితం కూడా సీజ్ చేస్తాం సార్’ అన్నారు. ‘అది మీరో, మీరు సృష్టించిన హంతక ముఠాలో తయారు చేసిన ఉత్తరం, అది తీసుకువెళ్లి కేసులో పెడితే మీకేం ఉపయోగం, మీ ఇష్టం తీసుకువెళ్లండి’ అన్నాను. అప్పుడు పంచనామా రిపోర్టులో మొదటి పేజీ చింపేసి, మళ్లీ కొత్తగా ఒక వస్తువు బదులు రెండు వస్తువులు సీజ్ చేసినట్టు రాసి మళ్లీ సంతకాల తతంగమంతా ముగించి వెళ్లిపోయారు.


ఈ మధ్యలో వివి మీద 1973 నుంచీ పెట్టిన 25 అబద్ధపు కేసులు వీగిపోవడం గురించి, పోలీసులకు అలవాటైన  అబద్ధపు కేసుల పద్ధతి గురించి, న్యాయవ్యవస్థ మౌలిక సూత్రాల గురించి చెప్పాను. వ్యక్తులుగా వారి మీద ఎటువంటి కోపమూ లేదని, ఉద్యోగులుగా వారి పని వారు చేస్తున్నారని, కాని వారిని నడుపుతున్న వ్యవస్థ ఎంత దుర్మార్గంగా ఉందో తెలుసుకోవాలని, అమిత్ షా ఈ ఎన్ఐఎ అనే పనిముట్టును ఉపయోగించుకుని దేశాన్ని ఎలా చీకటికొట్టంగా మారుస్తున్నాడో పౌరులుగా వాళ్లు కూడా ఆలోచించాలని వారికి ఉపన్యాసాలు ఇచ్చాను, పాపం! కాప్టివ్ ఆడియెన్స్!  


ఈ తతంగం జరుగుతున్నంతసేపు, మా అపార్ట్ మెంట్ ముందర నాలుగైదు పోలీసు వాహనాలు, సాయుధ, మఫ్టీ పోలీసులు భయానక వాతావరణం సృష్టించారు. ఏదో పెద్ద నేరస్తుడి ఇంటి మీద దాడికి వచ్చినట్టు ఒక హంగామా చేశారు. 


మాకు బైటి ప్రపంచంతో సంబంధం తెగిపోయిన, తెగగొట్టబడిన నాలుగు గంటలు, మా గేటు బైట ఇరవై ముప్పై మంది మీడియా మిత్రులు పోగయ్యారట. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ, దేశవ్యాప్తంగానూ ఎందరో ఆందోళన పడ్డారట. చాలా మంది తమ ఆందోళనను తమకు వీలైన రూపాలలో ప్రకటించారట. ఎన్ఐఎ వెళ్లిపోయినప్పటి నుంచీ ఎందరో మిత్రులు ఇంటికి వచ్చి పలకరిస్తున్నారు, ఫోన్ లో మాట్లాడి తమ సంఘీభావం తెలుపుతున్నారు. పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు. (ఈ దాడి సమయంలో విభాత లేత మనసు ఎట్లా తట్టుకుందని చాలామంది అడుగుతున్నారు. అదృష్టవశాత్తూ ఈ దాడి సమయంలో విభాత వాళ్ల స్కూల్ నుంచి ఎక్స్ కర్షన్ కు వెళ్లి ఉండడంతో ఆ మానసిక ఆందోళన తప్పించుకోగలిగాడు). ఈ నిర్బంధ సమయంలో మాకు తోడు నిలిచిన అందరికీ వనజా నేనూ ఇద్దరమూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 


ప్రజల పక్షాన నిలబడాలనీ, పాలకవర్గ దుర్మార్గాలను ఎదిరించడంలో బుద్ధిజీవులుగా మా పాత్ర నిర్వహించాలనీ మా దృఢ సంకల్పాన్ని ఇటువంటి దాడులు దెబ్బతీయలేవు సరిగదా, మరింత బలోపేతం చేస్తాయి.

(ఎన్.వేణుగోపాల్ ఫేస్ బుక్ వాల్ పై రాసిన స్పందన)



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు