బైస్కోపుల వెనక రాజకీయ తోపులు..!

 


బైస్కోపుల వెనక

రాజకీయ తోపులు..!


వెండి తెరపై మొండి మరక..!!


సినిమా అంటే వినోద సాధనం..

కొన్ని సందర్భాల్లో సినిమా ద్వారా సందేశం కూడా ఇచ్చే సంప్రదాయం కూడా ఉంది.

ఎందుకంటే మామూలుగా చెప్పే కంటే దృశ్యం ద్వారా వివరిస్తే తొందరగా ప్రజల్లోకి చొచ్చుకుపోతుంది గనక.. అలా సినిమాకి పవర్ ఫుల్ మీడియా అనే పేరు కూడా వచ్చింది.ఆ కోవలోనే నాటి రోజుల్లో వందేమాతరం..

మాలపిల్ల..పెద్దమనుషులు..కన్యాశుల్కం..మనదేశం..

పిచ్చిపుల్లయ్య..

సుడిగుండాలు..

మరోప్రపంచం..ఈనాడు...వంటి సినిమాలు తయారై సమాజానికి ఎంతో కొంత సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాయి.తర్వాత తర్వాత రాజకీయాలు కూడా సినిమాల్లో చూపించడం..

విమర్శలు.. తత్సంబంధ పాత్రలు సినిమాల్లో చోటు చేసుకోవడం మొదలైంది.

కొన్ని సినిమాలు రాజకీయమే ప్రధానాంశంగా తీస్తే మరికొన్ని సినిమాల్లో

రాజకీయాన్ని ప్రత్యక్షంగానో..

పరోక్షంగానో స్పృశిస్తూ డైలాగులు ఉండేవి.

ఇప్పుడు ఆ కోణాన్ని కూడా దాటి రాజకీయాన్నే సినిమాగా తీయడం మొదలైపోయింది.

రాను రాను అది ముదిరి రాజకీయ నాయకులకు అనుకూలంగా సినిమా కథలు తయారవుతున్నాయి.

వాటిలో కొన్ని ప్రతికూలమైనవి కూడా ఉంటున్నాయి.

వీటి వెనక కొందరు ప్రముఖ రాజకీయ నాయకుల ప్రమేయం..పెట్టుబడులు ప్రత్యక్షంగానే ఉంటున్నాయి.

బయోపిక్ లనే ముసుగులో

రాజకీయ నాయకుల

ఇమేజీలను అనూహ్యంగా పెంచే ప్రయత్నం చేస్తూ సినిమాలు పరంపరగా వచ్చేస్తున్నాయి. ఆయా నాయకుల కథను యథాతథంగా తీయకుండా

అతగాడిలోని నెగెటివ్ కోణాలను పక్కన బెట్టేసి

కొన్నిటిని గొప్ప కార్యాలుగా..

వారు అధికార పీఠాన్ని అధిష్టించిన వైనాన్ని

ఘనవిజయంగా చూపిస్తూ 

సినిమాలు చకచకా తయారై పోతున్నాయి.పనిలో పనిగా ప్రత్యర్ధులను

నీచులుగా చూపించే ప్రయత్నాలు కూడా విస్తృతంగా ఉంటాయి ఆయా బయోపిక్ బయస్కోపుల్లో..

ఇలాంటి సినిమాల నిర్మాతలు అంతకు ముందు సినిమా రంగంతో సంబంధం ఉన్నవారే కానక్కర్లేదు.

అకస్మాత్తుగా నిర్మాతల రూపంలో అవతరిస్తారు.

వారికి అంతటి సినిమాలు తియ్యడానికి సొమ్ములు ఎక్కడి నుంచి వస్తాయనేది

ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అలాంటి సినిమాల్లో పెద్దపెద్ద నటులు..

వారు తెలుగు వారు కాకపోయినప్పటికీ ప్రధాన పాత్ర పోషించడానికి అంగీకరిస్తారు.ఎవరి ప్రమేయం వల్లన అనే సంగతి

బహిరంగ రహస్యమే.

మళ్లీ వాటికి కొనసాగింపులు కూడా సరిగ్గా ఎన్నికలకి ముందు వచ్చేస్తాయి.


తాజాగా 2024 ఎన్నికల నేపథ్యంలో అలాంటి సినిమాల హవా మన రాష్ట్రంలో పరాకాష్టకు చేరిపోయింది.వర్తమాన పరిస్థితులను నేపథ్యంగా తీసుకుని సినిమాలు పరంపరగా విడుదలై పోతున్నాయి.వాటిలో పాత్రలు రోజూ మన కళ్ళ ముందు తిరుగాడుతున్నవే.

అచ్చంగా అలాగే కనబడేట్లు మ్యాకప్ గుద్దేసి అవే పేర్లతో

తెరపై చూపిస్తూ ఒకరిని మహాత్ముడిగా.. 

మహానేతగా..మరొకరిని

నీచుడుగా..పరమ దుర్మార్గుడిగా..అతగాడు చేసినవన్నీ అత్యంత హేయమైన పనులుగా చిత్రీకరిస్తూ సినిమాలు సిద్ధమైపోతున్నాయి.వీటికి కథలు రాయడం అంత కష్టమైన పనేమీ కాదు.జరుగుతున్న సంఘటనలనే ఆయా పార్టీలు..వ్యక్తులకు 

అనుకూలంగా మార్చి రాసేస్తే

కథ సిద్ధమైపోయినట్టే. డైలాగులూ అంతే. ప్రజాధనంతో అమలు చేసే కార్యక్రమాలు ఆయా నాయకుల దయాభిక్షతో 

జరుపుతున్నట్టు బిల్డప్పులు ఇస్తూ పొగడ్తలు ఉంటాయి.

ముందే చెప్పుకున్నట్లు అలాంటి సినిమాలకు పెట్టుబడులు అస్సలు సమస్యే కాదు.కోట్ల మీద సమకూరిపోతాయి.ఒక్కో సినిమాకైతే రాజకీయ నాయకుల సభలకు తరలించుకు వచ్చిన పద్ధతిలోనే జనాలను థియేటర్లకు రప్పించే ఎపిసోడ్లు కూడా చోటు చేసుకుంటున్నాయి.


సినిమాకి ఇదంతా అవసరమా..ఇప్పటికే మితిమీరిన హింస..శృంగార సన్నివేశాల కారణంగా మసకబారుతున్న వెండితెర

ఈ తరహా అవాంఛనీయ పోకడల వల్ల మరింతగా

కలుషితం అయిపోవడం లేదూ.ఈ తరహా సినిమాలు యువతను ఎక్కడికి తీసుకువెళతాయి.ఆల్రెడీ

యువత ఏదో ఒక రాజకీయ పార్టీని పట్టుకుని నాయకుల వెంట తిరుగుతూ వారు పెట్టే బిర్యానీలకు..పోసే మందుకు అలవాటు పడిపోయి ఆయా నేతల ఇంటి సేవకులుగా మారిపోయి వారినే గాక వారి కొడుకులను..కూతుళ్లను.. అల్లుళ్ళను కూడా భుజానికి ఎత్తుకుని ఇల్లు..చదువు..

తమ భవిష్యత్తు పట్టకుండా తిరుగుతున్న దుర్దినాలు దాపురించి ఉన్నాయి.ఇప్పుడు సినిమాలు..అవి యువతని మరింతగా పెడత్రోవ పట్టించే విధంగా ఉంటున్నాయి.

ఈ పోకడ ఇక్కడితో ఆగదు.

ఇప్పటికే మీడియా భ్రష్టు పట్టిపోయి ఉంది. ప్రతి మీడియా సంస్థ ఏదో ఒక పార్టీకో.. నేతకో కొమ్ము కాస్తూ గౌరవాన్ని కోల్పోయే దిశగా సాగుతోంది.అది కూడా శ్రుతి మించి రాజకీయ నాయకులు పెట్టుబడులు పెట్టడం అనే దశను దాటి

తామే సొంతంగా పత్రికలు..చానళ్లు పెట్టి

ఇష్టారాజ్యంగా రాసి రంపాన

పెడుతూ..చూపి చిరాకు పెడుతూ నడుస్తున్నాయి.

ఈ తరహా పోకడలు చాలవన్నట్టు ఇప్పుడు ఆయా శక్తులు మరింత ముందుకు వచ్చి తమకు

నచ్చిన రీతిలో సినిమాలు తీయించుకుంటూ ఈ రంగాన్ని కూడా దుష్ట..నికృష్ట కదనరంగంగా మార్చేస్తున్నాయి.బాలీవుడ్ లో కొన్ని సినిమాల వెనక మాఫియా ప్రమేయం బలంగా ఉంటుంది.ఇప్పుడు మన ఈ రాజకీయ ప్రవేశం తెలుగు సినిమాకి తెగులు పుట్టిస్తూ

ఎక్కడికి తీసుకుపోతుందో.

అయ్యో..హెచ్ఎంరెడ్డి.. బిఎన్ రెడ్డి.. కెవి రెడ్డి.. నాగయ్య వంటి మహనీయుల ఆత్మలు ఎంత ఘోషిస్తున్నాయో..!


    సురేష్..జర్నలిస్ట్

          9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు