జగతికి నిర్దేశం
భీష్ముని ఉపదేశం..!
సాక్షాత్తు కృష్ణుడే ఆసీనుడై
తన గురించి
తానే చెప్పుకున్నట్టు..
తత్వాన్ని తన కంటే
తాతే బాగా చెప్పగలడని
ప్రబోధించగా అంపశయ్య నుంచి సంధించిన
విష్ణుసహస్రం
జగతిని ఉద్ధరించే శాస్త్రం..
పాపప్రక్షాళనకు తిరుగులేని
బ్రహ్మాస్త్రం..!
ఎన్నాళ్ళు బ్రతికాడో..
ఇంకెన్నాళ్ళు అంపశయ్యపై
ఉన్నాడో..
బాణాలు దేహాన్ని తూట్లు పొడిచినా ప్రాణం విడువక
సర్వం నారాయణం
అంటూ ఉత్తరాయణం కోసం ఎదురుచూసి తన అంత్యదశ
ఏకాదశిగా తానే నిర్ణయించుకుని
ఆధ్యాత్మిక ప్రపంచానికి
ఓ పండగ..భీష్మ ఏకాదశిని
ప్రసాదించిన పితామహుడు
తానుగా ధన్యుడు..
ఎప్పటికీ మాన్యుడు..!
జీవితమంతా
కౌరవుల పంచనే..
చూసిందంతా వంచనే..
కాని తానుగా
విడిచిపెట్టక ధర్మనిరతి
భగవాన్ శ్రీకృష్ణుడి పట్ల
అంతరంగ మందిరంలోనే
చెదరిపోని సేవానిరతి...
మనసే కన్నయ్యకు హారతి!
తానుగా ధర్మపక్షపాతి అయినా కౌరవుల
వెంట నిలిచిన పాపానికి
ద్రౌపదీ వస్త్రాపహరణ వేళ
మౌన ప్రేక్షక పాత్ర..
అంపశయ్యపై ధర్మజునికి
చేస్తుంటే ధర్మబోధ..
ఎదురుగా నిలబడి అంతటి పాంచాలి చేస్తే పరిహాసం..
పరిహారం చేసుకున్నా మనవరాలా..
శరీరంపై మచ్చలు
అమ్మ గంగమ్మతోనే కడుక్కున్నాలే
అని చెప్పక చెప్పిన
గాంగేయుడు..
ద్వాపరంలో పుట్టిన
మరో భగవానుడు..!
స్వచ్చందమరణం..
అందుకూ వాసుదేవుడే శరణం..
ఒంటిచేత్తో యుద్ధాన్ని గెలవగల విక్రమం..
ధర్మాన్ని గెలిపించాలన్న మర్మంతోనే మరణానికి సిద్దం
ఆయన నిష్క్రమణతోనే
ముగిసింది యుద్ధం..
శాంతనవుడు కోరుకున్నది
ధర్మరాజు విజయం కాదు
ధర్మానికి విజయం..
అందుకే..అందుకే..
ఆ మహనీయునికి
జయం జయం..!
భగవానుడి తత్వమే భీష్మతత్వం..
ఆ భగవంతుని స్మరణమే
గాంగేయుని మనస్తత్వం..
విష్ణు సహస్రం
జగతికి అవసరం..
అది కోటిపుణ్యాల సారం..
తన గురించి తాను చెప్పుకోలేని దేవుడు
తన నామపారాయణ భాగ్యం ఇస్తే తాతకి..
పితామహుడు తన భాగ్యాన్ని పంచి ఇచ్చాడు జగతికి..!
భీష్మఏకాదశి సందర్భంగా
ప్రణామాలు అర్పిస్తూ..
🙏🙏🙏🙏🙏🙏🙏
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box