ఆలస్యంగానైనా అర్హునికి దక్కిన భారత రత్న
1992 లో పీవీ నరసింహారావు ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. అప్పుడు దేశం అప్పులు విపరీతంగా ఉండి దేశానికి అత్యంత ముఖ్యమైనటువంటి ముడి చమురు దినుసులు కొనేందుకు కావాల్సిన విదేశీ మారక ద్రవ్యం ఒక రెండు వారాలు కూడా సరిపోనీ దౌర్భాగ్య పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఎంత మంచి నాయకుడికైనా బాధ్యత స్వీకరించాలంటే వెనక ముందు ఆడాల్సి ఉంటుంది అందుకే ఉత్తర భారతదేశం నుండి మహామహులైన ఏ నాయకులు కూడా ప్రధాని బాధ్యతలు స్వీకరించేందుకు సంసిద్ధత చూపలేదు. కానీ పీవీ సహజంగా స్థితప్రజ్ఞు డు, దైర్యస్తుడు. భారతదేశ వ్యవస్థ యొక్క పరిస్థితులను శక్తి బలహీనతలను మొదటినుండి కూలంకషంగా అవగాహన ఉండటంవలన చాలా ధైర్యసాహసాలతో ఆత్మవిశ్వాసంతో ప్రధాని బాధ్యతలు చేపట్టి కేవలం 45 రోజులలో దేశ ఆర్థిక సామర్థ్యాన్ని పటిష్టం చేస్తూ అంతర్జాతీయ విఫణిలో దేశ గౌరవాన్ని మర్యాదను నిలబెట్ట కలిగాడు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు పీవీ నరసింహారావు గారు తీసుకున్నటువంటి చర్యలే ఆర్థిక సంస్కరణలు. ఈ ఆర్థిక సంస్కరణల మూలంగా గత 25 సంవత్సరాలలో మన దేశీయ బడ్జెట్ 19 అంతలు మరియు దేశ స్థూల జాతీయ ఆదాయం 9 అంతలు పెరిగాయి అంతేకాకుండా ద్రవ్యోల్బణం 1991లో 16.7 శాతం నుండి ప్రస్తుతం 5 శాతం కి పడిపోవడం ఆర్థిక సంస్కరణలు చేపట్టిన పుణ్యమే. 1970 నుండి 1980 వరకు మన ఆర్థిక వ్యవస్థ 4.4 శాతం పెరిగితే, ఆ తదుపరి దశాబ్దాల్లో ఒక శాతం పెరిగితే, ఆర్థిక సంస్కరణల తర్వాత 25 సంవత్సరాలలో సగటున 7 నుంచి 8 శాతం పెరిగింది. తద్వారా 27 కోట్ల జనాభా దారిద్య్ర రేఖ నుండి పైకి లాగడం జరిగింది. అనగా ఇంతమంది ప్రజలు అత్యంత పేదరికం నుండి భరోసాగా జీవితం గడిపే పరిస్థితి చేరుకొన్నారు. ఇప్పుడు ద్రవ్యలోటు మూడు దాటితే గగ్గోలు పెడుతున్నారు కానీ 1991లో ద్రవ్యలోటు 8.4 శాతం ఉండేది. దీనికి కారణం మళ్లీ పి వి చేపట్టిన ఆర్థిక సంస్కరణలే.ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఆర్థిక సంస్కరణల ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ సంబంధాలు లోతుగా పెట్టుకున్నప్పటికీ కూడా ప్రపంచ మాంద్యం 2008లో ఏర్పడినప్పుడు మనదేశం ఇలాంటి సంస్కరణలు చేపట్టినా మిగతా దేశాల లాగా ఎక్కువగా నష్టపో లేదు. దీనికి కారణం అవసరం ఉన్నప్పుడు కొంత కిందికి దిగి వచ్చినా మన ఆర్థిక మూల వ్యవస్థల్ని బలహీన పరచకుండా ఆర్థిక సంస్కరణలను అమలుపరచడం అనే చతురత పి వి కే దక్కింది
ఈ సంస్కరణల మూలంగా ఉత్పత్తి రంగం సగటున 7.7 శాతం పెరిగితే సేవారంగం 41 శాతం నుండి 63% 2009 వరకే పెరగడం అత్యంత సంతోషకరమైన విషయం. అయితే మన దేశంలో చాలా మంది ఆధారా పడి బ్రత్కే వ్యవసాయ రంగం మాత్రం అంతగా అభివృద్ధి చెందలేదు. అభివృద్ధి రేటు తక్కువ కూడా అవుతూ వచ్చింది. ఈ రంగంలో పెట్టుబడి అత్యంత దయనీయ స్థితిలో ఉంది. దీనికి కారణం వ్యవసాయరంగ ఉత్పత్తుల ధరలు అతి తక్కువగా ఉండడం మరియు వ్యవసాయ రంగంలో పెట్టుబడుల విలువ తో పోలిస్తే తక్కువ లాభాలు రావడం వల్ల పెట్టుబడులు ఈ రంగానికి చాలా తక్కువగా వచ్చాయి .కానీ ఇతర రంగాల్లో సాధించిన అభివృద్ధి వలన ఆదాయాలు పెరిగి ప్రభుత్వాలకు టాక్స్ ల రూపంలో ఆదాయం విపరీతంగా పెరగడం వల్ల రైతులకు సబ్సిడీల రూపంలో, తక్కువ వడ్డీకి అప్పుల రూపంలో, మరియు ఇంకా మద్దతు ధర ల రూపంలో ఎన్నోరకాలుగా సహాయం అందించడం జరిగింది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలలో వర్షేతర కాలాల్లో ఉపాధి అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి అలాంటి సమయాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం రూపకల్పన చేయడం జరిగింది. అయితే ఈ పథకానికి కావాల్సిన వేల కోట్ల రూపాయలు మాత్రం ఆర్థిక సంస్కరణల వల్ల ప్రభుత్వాలకు పెరిగిన ఆదాయం ద్వారానే చే కూరాయి అనేది నిర్వివాదాంశం. కాబట్టి ఒక రకంగా వ్యవసాయ రంగం ఆర్థిక సంస్కరణల ద్వారా పరోక్షంగా లాభం పొందిందని చెప్పవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్థిక సంస్కరణల వల్ల అన్ని రంగాలు కూడా అత్యధికంగా లాభపడ్డాయి.
ఈ సంస్కరణల వల్ల ఒక సేవా రంగంలో ఎక్కువగా కొంతవరకు ఉత్పత్తి రంగంలో విపరీతంగా పెరిగిన సంస్థల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మొదటి తరం విద్యార్థులు కూడా ఎన్నో ఉద్యోగాలు దొరకడమే కాకుండా ఆ ప్రాంతాల్లో ముఖ్యంగా కొన్ని వెనుకబడిన ప్రాంతాల్లో ఎక్కడైతే వ్యవసాయ పనులు సరిగా లేవు అక్కడి ప్రజలు నగరాల్లో కి వచ్చి సంస్కరణల వల్ల ఏర్పడిన ఇటువంటి అనేక అనేక సంస్థలలో అభివృద్ధి కార్యక్రమాల్లో వారికి ఉపాధి దొరకింది. అలాంటి ఉపాధి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నడూ ఎరుగనంత ఆదాయం కూడా లభించింది. పివి గారి హయాంలో ఆర్థిక సెక్రటరీగా పనిచేసిన montek singh ahluwalia గారు ఒక వ్యాసంలో రాసినట్టు సాధారణంగా మెతకగా కనబడే పివి గారు ఒక నెలలో అత్యంత ధైర్య సాహసాలతో రాజకీయ వ్యతిరేకతను ఎదుర్కొంటూ తీసుకున్నటువంటి నిర్ణయాల ఆరోజు భారతదేశాన్ని అవమానాల నుండి కాపాడటమే కాకుండా భావితరాల భవిష్యత్కు చక్కటి బాట వేశారు. ఈ విషయాన్ని ఈ మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి గారు రాసిన రీసెట్ పుస్తకంలో కూడా ధృవీకరించారు.
వ్యాపార రంగాల్లో ఆర్థిక సంస్కరణల మూలంగా కనీ వినీ ఎరుగని మార్పులు చోటు చేసుకున్నాయి. ఈరోజు నగరాల్లో చిన్న చిన్న పట్టణాలలో కూడా మాల్స్, అపార్ట్మెంట్ బిల్డింగ్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, మొబైల్ షాప్ లు, బ్యూటీ పార్లర్ లు, ఆర్గానిక్ ఫుడ్ సెంటర్లు, కార్లు మరియు బైక్ షోరూమ్స్, మొబైల్ రిపేర్ షాప్ లు, డిజిటల్ ఎల్ఈడి, ఎల్సిడి, ప్లాస్మా టీవీ లు అత్యాధునిక గృహ పరికరములు నమ్మే షాపులు, ఫ్లెక్సీలు తయారుచేసే షాపులు, మినరల్ వాటర్ షాప్లు,ఆన్లైన్ అనేకానేక మైనటువంటి నూతన వ్యాపార సంస్థలు వెలిశాయి. వీటి ద్వారా లక్షల మందికి ఉపాధి దొరికింది.అంతే కాకుండా మానవ జీవితాన్ని సుఖమయం, సౌకర్యవంతం చేసి,వారి ఉత్పాదకత తద్వారా ఆదాయం పెంచేందుకు దోహదం చేసే చాలా వస్తువులు, సేవలు ఈ రోజు ప్రజలకు సంస్కరణల మూలంగానే లభ్య మయ్యాయి. పైన పేర్కొనబడిన వ్యాపారాలు కానీ అవి అందించిన సౌకర్యాలు కానీ సంస్కరణల ముందు లేవు అంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇన్ని వందల విధాలుగా మనిషి జీవితాన్ని సౌకర్యవంతంగా ఆనందమయం సరళం చేయడానికి సంస్కరణలే మూలం. వాటికి మూలం పీవీ నరసింహారావు గారి తెగువే కారణం అని చెప్పుకోక తప్పదు.
ఆర్థిక సంస్కరణల ముందు ఇప్పుడు మనం అనుభవించే అన్ని సాంకేతిక సౌకర్యాలు అమెరికాలో మరియు ఐరోపా లో ఉండేవి. కానీ అవి మనకు ఇవ్వలేదు.దానికి రెండు కారణాలు. ఒకటి మనం కమ్యూనిస్టు దేశమైన రష్యా చెప్పుచేతల్లో ఉండడం, రెండవది మన దేశ సరకులు సేవలు మరియు పెట్టుబడుల మార్కెట్లను ఆ దేశాలకు తెరిచేందుకు సిద్ధంగా లేకపోవడం. అయితే ఆర్థిక సంస్కరణల కాలానికి ముందు యూఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అయి రష్యా గా మారడం, అమెరికా గెలిచి ఆత్మవిశ్వాసంతో ఉండడం జరిగింది. అప్పుడు మన ఆర్థిక సంస్కరణలు చేపట్టడం వల్ల అమెరికా చెప్పుచేతల్లో ఉన్నటువంటి ఐ.ఎం.ఎఫ్ మరియు వరల్డ్ బ్యాంక్ ఆదేశాలనుసారం మన మార్కెట్లను తెరిచి ఉంచడం వల్ల, ఈ సాంకేతికత లన్నింటినీ కూడా మనకు ఇచ్చేందుకు యూరోప్ మరియు ముఖ్యంగా అమెరికా సిద్ధమైంది.పరిస్థితులను సరిగా అవగాహన చేసుకున్న పీవీ నరసింహారావు గారు వాటినుండి సాంకేతికతలను పెట్టుబడులను ఆహ్వానించు కుంటూ సమతుల్యం పాటిస్తూ తదనుగుణంగా దేశ ఆత్మగౌరవానికి ఎలాంటి భంగం కలగకుండా ఆర్థిక వ్యవస్థలో మార్పులు ఆర్థిక సంస్కరణలు చేపట్టారు
ఈ సంస్కరణల ద్వారా నష్టం కన్నా లాభం ఎక్కువ జరిగిందనే విషయంలో రెండవ అభిప్రాయానికి తావులేదు.ఈ సాంకేతికతల ద్వారా మన దేశానికి అత్యంత నైపుణ్యం కలిగిన 50లక్షల విద్యార్థులకు ఎక్కువ ఆదాయం ఇచ్చే ఉపాధి దొరికింది.వీటి ద్వారా పరోక్షంగా ఇతర వ్యాపారులు వెలుగు చూశాయి. ఈ సాంకేతికతల ప్రభావంతో ప్రభుత్వ నిర్వహణ పద్ధతులు, ఉత్పత్తి సామర్థ్యాలు కూడా పెరిగాయి.మన కంప్యూటర్ సాంకేతిక ఎగుమతులు మొత్తం ఎగుమతుల్లో 25 శాతానికి పెరిగినవి. బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ రంగాల్లో అభివృద్ధి జరిగి లక్షల ఉద్యోగాల కల్పన జరగడమే కాకుండా నాణ్యత పెరిగింది. యువత ఎన్నడూ లేని విధంగా ఇబ్బడిముబ్బడిగా నూతన వ్యాపార సంస్థలు ఆవిష్కరించారు. ముఖ్యంగా బైజు, రెడ్ బస్సు, పేటీఎం, బిల్డేస్క్ ఈ విధంగా ఎన్నో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సంస్థలు ఏర్పడి లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అంతే కాకుండా ఈ సంస్థలు ఇటువంటి సేవలు ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాయి. ఈ సాంకేతికతలకు అనుగుణంగా విద్యాసంస్థలు పెరిగి తద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని పొంది విదేశాల్లో కూడా ఎన్నో విధాలుగా ఉద్యోగాలు మరియు వ్యాపారాలు చేస్తూ ఉండటం చూస్తున్నాం. విదేశాల్లో మన సాంకేతిక నిపుణులు సాధించిన ఆవిష్కరణలు చూసి ఒకసారి బిల్క్లింటన్ స్వయంగా" సిలికాన్ వ్యాలీ సగం భారతీయులదే కదా" అని అన్నారు. అంటే ఈ సంస్కరణల ప్రభావం ఎంత ఉందో ఊహించవచ్చు.
ఏడున్నర కోట్ల రూపాయల పైచిలుకు ఆదాయం ఉన్న నూతన సంస్థలని( స్టార్ట్ అప్స్) యూనికార్న్ అంటారు. అలాంటి 21 సంస్థలతో మనం ప్రపంచ దేశాలలో అన్నిటికన్నా ముందు ఉన్నాం.
ఈ సాంకేతికతల ఆధారంగా ఎన్నో కొత్త సాంకేతిక విద్యా సంస్థలు నెలకొల్పబడి అత్యంత నాణ్యమైన సాంకేతిక విద్యను అందజేస్తున్నాయి. అంతే కాకుండా ఎన్నో ప్రత్యేక కంప్యూటర్ ఎలక్ట్రానిక్స్ రంగాలలో ఉన్నత స్థాయి శిక్షణ ఇచ్చే సంస్థలు కూడా రావడం జరిగింది వీటన్నిటిలో చదివినవిద్యార్థులు విదేశాలలో మన దేశంలో కూడా అద్భుతమైనటువంటి అభివృద్ధి సంస్థలను స్థాపించడం జరిగింది.వీరు మైక్రోసాఫ్ట్ గూగుల్ వంటి ప్రపంచంలో అత్యంత పెద్ద సంస్థలకు అధిపతులుగా నియమించబడ్డారు. ఇది నిజంగా ఆర్థిక సంస్కరణలు యొక్క ప్రభావం కాదా! ఆర్థిక సంస్కరణలను చేపట్టక పోయేదున్టే ఈ విధంగా విద్యాసంస్థల్లో గాని సాంకేతిక శాస్త్ర విజ్ఞానంలో గాని ఈ స్థాయికి ఎదిగే వాళ్ళం కాదు.
ఈ నూతన సాంకేతికత ల కారణంగా భారతీయుల జీవితాల్లో సౌఖ్యవంతమైనయి.
సాధారణంగా ఏ సంస్కరణ అయినా ఒక దేశ జనాభాలో ఒక వర్గానికి ఒక రంగానికే పరిమితం అవుతుంది. కానీ మొట్టమొదటిసారి పి.వి.నరసింహారావు చేపట్టిన ఈ ఆర్థిక సంస్కరణల వల్ల అన్ని వర్గాల భారతీయులపై ప్రభావం చూపి వారి జీవితంలో ఎంతో కొంత ఎదుగుదలకు దోహదపడింది. అసలు గత వేల సంవత్సరాల్లో మన భారతీయులలో జీవన విధానంలో జరిగిన వికాసం కన్నా ఈ గత 25 సంవత్సరాల్లో ఆర్థిక సంస్కరణల మూలంగానే సంభవించిందని వికాసం ఎన్నో రెట్లు అని చెప్పక తప్పదు. విద్య లో గాని, వైద్యం లో గాని, వ్యాపారాల్లో గాని, రవాణాలో గాని, ప్రయాణాల్లో గాని, వినోదం, సమాచార రంగాల్లో, సంగీత సాహిత్యాల్లో, చలన చిత్ర రంగంలో ఏ రంగంలో చూసుకున్నా కూడా మనకు ఉన్నతస్థాయి మార్పులన్నీ కూడా ఆర్థిక సంస్కరణల తదనంతరం వచ్చినవే అని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు.
ఇంకో విషయం ఏమిటంటే ఆర్థిక సంస్కరణల తర్వాత వచ్చిన ప్రతి సంస్కరణ కూడా వాటి యొక్క మూలాలు ఆ సంస్కరణల కొనసాగింపుగానే వున్నాయి. అంతకన్నా మించి నూతనత్వం మనకు ఏ కోణంలో చూసినా కనబడదు.
ఇవన్నీ మనం గ్రహించక పోయినా సింగపూర్ దేశాధినేత గమనించి తదుపరి ఎలక్షన్ లో పీవీ నరసింహారావును ప్రజలు ఎందుకు ఓడించారు అని ఆశ్చర్యం వ్యక్తం చేశారట.
ఒంటి చేతితో సింగపూర్ని దరిద్రం నుండి అత్యంత ధనిక దేశంగా మార్చిన లే యియన్ కూ పీవీ నరసింహారావ రెండవసారి గెలిపించకపోవడం భారతదేశ ప్రజల తప్పిదం అని నిర్మొహమాటంగా చెప్పాడు.
పీవీ గారు ఇంకొక రెండు సార్లు దేశ ప్రధానిగా పరిపాలించ గలిగి ఉంటే, ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి మెరుగైన జీవన విధానం చాలా ముందే రావడమే కాకుండా, ఇప్పుడు మనం చూస్తున్న సాంఘిక మత పరమైన వికారాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సమాన లాభాన్ని చేకూరుస్తూ మన దేశం తప్పకుండా ఆర్థిక పరంగా కాకపోయినా స్థూల ఆనంద సూచిక లో ఇప్పుడున్న 95 స్థానంలో కాకుండా చాలా పైన ఉండేది అని చెప్పేందుకు నేను వెనక ముందు ఆడటం లేదు.
డాక్టర్ మండువ హనుమంతు ప్రసాదరావు
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box