మతతత్వ, విద్వేషపూరిత బీజేపీ రాజకీయాలను యువత తిప్పికొట్టాలి


 మతతత్వ, విద్వేషపూరిత బీజేపీ రాజకీయాలను యువత తప్పికొట్టాలి


దేశాభివృద్ధికి యువత భాగస్వామ్యం అవశ్యం


ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు


మతతత్వ రాజకీయాలను యువత తప్పికొట్టాలని, దేశాభివృద్ధికి యువత కీలక భాగస్వామ్యం ఆవశ్యం అని భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు యువతకు పిలుపునిచ్చారు. అఖిల భారత యువజన సమాఖ్య(ఏ ఐ వై ఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హన్మకొండ లోని లాల్ బహదూర్ కళాశాల జయసేన ఆడిటోరియంలో వాయిస్ ఆఫ్ యంగ్ ఇండియా నినాదంతో ఏ ఐ వై ఎఫ్ జాతీయ సమితి పిలుపులో భాగంగా "దేశ పాలకుల విధానాలు - నేటి యువత కర్తవ్యం" అనే అంశంపై రాష్ట్ర సదస్సు  నిర్వహించడం జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిధులుగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఏ ఐ వై ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. తిరుమలై రామన్ హాజరయ్యారు.

ఈ సదస్సుకు ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ధర్మేంద్ర అతిథులను వేదిక పైకి ఆహ్వానించి జాయింట్ డిక్లరేషన్ ప్రవేశపెట్టి అమోదించారు, ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి ఉల్లా ఖాద్రీ రాష్ట్ర సదస్సుకు అధ్యక్షత వహించారు.



ఈ  సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ 77ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతున్నదని వారు ఆవేదన వ్యక్తంచేశారు. యువతకు సరైన నైపుణ్యం శిక్షణ మెరుగైన ఉపాధి కల్పన నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం సమగ్ర యువజన విధానం లేకపోవడంతో సమస్యల వలయంలో నిరుద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ప్రపంచ దేశాల్లో కల్లా ఎక్కువగా భారతదేశంలో యువత 65% ఉన్న యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించి దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని పాలకులను డిమాండ్ చేశారు. స్వాతంత్ర అనంతరం ప్రభుత్వ రంగ సంస్థలు రైల్వే ఎల్లైసీ, బీఎస్ఎన్ఎల్, బీహెచ్ఈఎల్, స్టీల్ కంపెనీలు, ఓడరేవులు, విమానాశ్రయాలు, గ్యాస్ ఆయిల్ బొగ్గు అనేక సంస్థలు ప్రభుత్వ ఆధీనంలో ఉండడంవల్ల గతంలో ఉద్యోగాలు, ఉపాధి కల్పన కొంతమేరకు జరిగిందన్నారు. కేంద్రంలో బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రమక్రమంగా ప్రభుత్వ రంగ సంస్థలను మానిటైజేషన్ పైప్ లైన్ (ప్రభుత్వ ఆస్తుల ద్రవీకరణ) పేరుతో ప్రైవేటీకరణ చేస్తూ కార్పోరేట్లకు దోచిపెట్టారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసింది బీజేపీ అని వారు విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల భర్తీ, విదేశాల్లో దాచి ఉన్న నల్లధనం తిరిగి తెప్పించి ఒక్కొక్కరికి జనధన్ అకౌంట్లలో 15 లక్షలు బ్యాంకు ఖాతాల్లో వేస్తాం, నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పన చేస్తామని యువతకు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదన్నారు.మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశవ్యాప్తంగా 247 ప్రభుత్వ రంగ సంస్థలు మూతపడ్డాయని వారు అన్నారు. నాణ్యమైన విద్య అందుబాటులో లేకపోవడంతో యువ తరాన్ని ఉత్పత్తి లేని కూలీలుగా మారుస్తున్నారని అన్నారు. క్రమంగా, కొత్త అవకాశాలను, వినూత్న ప్రాజెక్టులను సమకూర్చుకునే నైపుణ్యం యువతకు దూరం అవుతుందన్నారు. భవిష్యత్తు గురించి అనిశ్చితి, వేదన యువతలో లోతైన మానసిక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందన్నారు. ఒత్తిడి మెరుగైన ఉపాధిని కనుగొనడం, తక్కువ వేతనాల కోసం అధిక ఒత్తిడితో పనిచేయడం వారిని ఎక్కువగా అమానవీయంగా మార్చడం, మానసిక ఆరోగ్య సమస్యలతో పాటు మత రాజకీయాలు వారిని పూర్తిగా నాశనం చేస్తున్నాయన్నారు. నాడు విభజించి పాలించే రాజకీయాలను బ్రిటిష్ వారు భారతీయ ప్రజల దేశభక్తిని దెబ్బతీయడానికి ఉపయోగించారు, స్వాతంత్ర్యానికి పూర్వం, యువకులు ఎల్లప్పుడూ విభజన శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండేవారన్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో మతతత్వ రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తూ, ద్వేషపూరిత రాజకీయాలతో యువతను తప్పుదోవ పట్టించడమే కాకుండా సమాజంలో వైషమ్యాలను సృష్టిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.ఈ సందర్భంగా ఏ ఐ వై ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. తిరుమలై రామన్ మాట్లాడుతూ 8 దశాబ్దాల స్వాతంత్య్రంలో కేంద్ర ప్రభుత్వం యువత శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేశాయన్నారు. దేశంలో 45 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందని నేషనల్ సర్వే ఆర్గనైజేషన్లు లెక్కలు చెబుతున్నాయని, పాలక ప్రభుత్వాలు అవలంబిస్తున్న వినాశకర ఆర్థిక విధానాల ఫలితంగా చదువుకు తగ్గ ఉద్యోగాలు రావడం లేదన్నారు. డిగ్రీలు, పి.జి.లు, పిహెచ్.డి.లు, బి.టెక్, ఎం.టెక్, ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., లా కోర్సులు చదివినవారు కూడా చివరకు రైల్వే గ్యాంగ్మెన్ ఉద్యోగాలకు,పోలీస్ కానిస్టేబుల్, హెూమ్ గార్డ్ ఉద్యోగాలకు లక్షల్లో పోటీపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగాలులేక, ఉపాధి అవకాశాలులేక వలసలు పోయే వారు కొందరైతే, మరికొంతమంది నిరాశ, నిస్పృహలతో డ్రగ్స్, కొకైన్, హెరాయిన్ లాంటి మత్తుమందులకు బానిసలవుతున్నారన్నారు. దేశానికి గొప్ప సంపదగా నిలవాల్సిన యువశక్తిని ప్రభుత్వాలు నేరస్థులుగా, ఉగ్రవాదులుగా, విచ్ఛిన్నకారులుగా మారుస్తున్నారని, తద్వారా రాజకీయాలపట్ల విముఖత కలిగేటట్లు యువతను తయారుచేస్తూ సంఘవిద్రోహ శక్తులు, అవినీతిపరులు, దోపిడీదారులు రాజకీయాల్లోకి ప్రవేశించి దేశాన్ని, ప్రజలను దోచుకుతింటున్నారని ధ్వజమెత్తారు. మతోన్మాద రాజకీయాలు, కార్పొరేట్ రాజకీయ కబంధ హస్తాల్లో చిక్కుకున్న దేశ భవిష్యత్తును నవయవ్వనంతో తొణికిసలాడే యువత సరికొత్త భారతాన్ని నిర్మించడానికి ముందుకు రావాలని ఏ ఐ వై ఎఫ్ ఈ సదస్సు ద్వారా పిలుపునిస్తున్నదని స్పష్టంచేశారు. గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన విద్య ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు నరేంద్ర మోదీ ప్రభుత్వ కాషాయీకరణను జతచేసి వీటిని వేగంగా అమలుచేయుటకు కేంద్ర ప్రభుత్వం "జాతీయ విద్యా విధానం - 2020” ప్రవేశపెట్టి అమలుచేస్తున్నదని, విద్యార్థుల మెదళ్ళను మొద్దుబార్చి, విద్వేషపు మత్తులో ముంచుటకు అశాస్త్రీయ అంశాలను పాఠ్యాంశాల్లోకి చొప్పించి మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నదని,అందుకే పాఠ్యపుస్తకాలలో శాస్త్రీయ ప్రజాస్వామ్య అంశాలను తొలగిస్తున్నదని ధ్వజమెత్తారు.


అదే విధంగా ఏ ఐ వై వైఫ్ జాతీయ కార్యదర్శి నక్కి లెనిన్ బాబు మాట్లాడుతూ రాజకీయ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ, రాజకీయ పార్టీల పై చేస్తున్న కక్ష సాధింపు చర్యలను దేశ ప్రజలంతా తిప్పికొట్టాలని, విభజించు పాలించు అనే నినాదంతో పబ్బం గడపాలనే మోడీ దుష్ట నీచ రాజకీయాలకు, మత రాజకీయాలకు వ్యతిరేకంగా భారతదేశ యువత ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైనదని వారు అన్నారు.అందుకే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ని ఓడించాలని వారు యువతకు పిలుపునిచ్చారు.


ఈ సదస్సుకు అతిధిలుగా హాజరైన  డీ వై ఎఫ్ ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనగంటి వెంకటేష్ మాట్లాడుతూ ఫాసిస్టు మతతత్వ మోడీ విధానాలకు వ్యతిరేకంగా యువతను చైతన్యపరచడానికి యువజన సంఘాలుగా ఐక్యంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని వారు అభిప్రాయపడ్డారు.మత రాజకీయాలకు రాష్ట్రంలో చోటులేదని వారు ధ్వజమెత్తారు.....పీవైఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామ పాపయ్య మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఇవే చివరి ఎన్నికలని, ప్రజల మధ్య చీలికలు తెచ్చి నిత్యం అల్లర్లు సృష్టించడమే మోడీ విధానమని వారు ధ్వజమెత్తారు.మణిపూర్ లో అల్లర్లను కట్టడి చేయకుండా, మణిపూర్ కు వెళ్ళని ప్రధాన మంత్రి మనకు అవసరమా అని వారు ప్రశ్నించారు. 


ఈ కార్యక్రమంలో సీపీఐ వరంగల్  జిల్లా కార్యదర్శి మేకల రవి....ఏ ఐ వై ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ వెంకటేశ్వర్లు, కునుకుంట్ల శంకర్,లింగం రవి, సత్య ప్రసాద్, శ్రీమాన్, యుగంధర్,నానబాల రామకృష్ణ, పేరబోయిన మహేందర్,చేపూరి కొండల్, ఏ ఐ వై ఎఫ్ వరంగల్ జిల్లా కార్యదర్శి మస్క సుధీర్,నేతలు జగదీష్, రెహ్మత్,... ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శరత్ లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుండి 400మంది ప్రతినిధులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు