అంతరంగమున ఆత్మారాముడు..!
ట్విస్టులు లేవు..
భాగవతంలో వలె శ్రీకృష్ణుని లీలలు లేవు..
ఇంకా ఎన్నో పురాణాలు..
కథలు..చరిత్రలు..
వీటిలో ఉన్నట్టు పెద్ద కథలు.. మాయలు మంత్రాలు..
బహు పాత్రలు..
ఇవేవీ లేవు..
ఉన్నదల్లా రాముని కధ..
సీత వ్యధ..
దశరధుని బాధ..
హనుమంతుని భక్తి..
లక్ష్మణుడి సేవ..
భరతుని త్యాగం..
ఆపై..రావణాసురుని
పాత్ర.. రాక్షసుడే..కానీ మహాభక్తుడు..
కాముకుడేనేమో..
అయితే తన చెరలో ఏడాది పాటు బందీగా ఉన్న సీతను
కనీసం తాకనైనా తాకని గుణం..సాక్షాత్తు తనపైనే యుద్ధానికి వస్తున్న ప్రత్యర్థి
విజయానికి ముహూర్తం పెట్టిన ధర్మవేత్త..!
ఇంతకీ రామాయణంలో ఏమిటంత గొప్ప..
అది ఎందుకు అంత మహాకావ్యంగా విరాజిల్లుతోంది.మరే కావ్యంలోనూ లేనంత మహత్తు రామాయణంలో ఏముంది..
ఆది రాముని పాత్ర..
ఇంకా చెప్పాలంటే రామా అనే పేరు..నారాయణ మంత్రంలో రా జీవము..
శివ పంచాక్షరి మంత్రంలో
మా జీవము..,కలగలిపిన మహా మంత్రం..సకల వేదాల సారం.. పలికినంతనే సర్వ పాపాలను హరియించే తారక మంత్రం..మానవాళిని
ధర్మ మార్గంలో నడిపే
మహా యంత్రం..!
శ్రీరాముని రూపం
అతి మనోహరం..
ఆయన తత్వం
సుతి మెత్తన..
ఆయన ప్రేమ రసరమ్యం..
ఆయన గుణం
అత్యంత విశేషం..
ఆయన ఏలుబడి..
శతాబ్దాల పలుకుబడి..!
రామ..ఈ రెండు అక్షరాల పిలుపే వేదాలను
మించిన నాదం..
ఎన్ని యుగాలు గడిచినా..
ఎన్నెన్ని తరాలు మారినా
సర్వ జనులకు ఆమోదం..
వినినంతనే అలవికాని ముదం..
అధర్మం పాలిట సింహనాదం..!
ఆ పేరే అయోధ్యకు సిరి..
అదే జగతికి కాపరి..
ఎప్పటి త్రేతాయుగం..
ఇప్పటి కలియుగం..
వందలు.. వేల సంవత్సరాలు గడిచినా చెక్కు చెదరని భక్తి తత్పరత..ఆ పేరు జపిస్తేనే.. వినిపిస్తేనే అంతులేని తాదాత్మ్యత..
ఆయన మోము చూస్తేనే ఒడలు పులకించే ఆత్మీయత..
ఆయన మంత్రం వేయడు..
తంత్రం చేయడు.
అయినా గాని
ఎంతటి కష్టం వచ్చినా
రాముడున్నాడు లే
అనే భరోసా..
ఏంటో ఆ మహత్తు..
ఆ పేరులో ఏంటో
అంతటి మత్తు..!
రామనామ బలమే...
ఆ రాముని మహిమే..
ఆ పేరులోని లయమే
నేటి ఆలయం..
నాటి అయోధ్య
శ్రీరాముని శ్రీరాముని రాజ్యం.
నేటి అయోధ్య అదే రాముని
భక్తి సామ్రాజ్యం..!
సురేష్..9948546286
అంతా రామమయం..!
అయోధ్య మరోసారి
పునీతం అయింది..
ఈ పవిత్ర భూమి
ఇంకోసారి
పులకించింది..
యావత్ భారతజాతి తరించిపోయింది..
వేదభూమి..
ఈ పవిత్ర భరతభూమి సాక్షాత్తు భగవంతుడే మనిషి రూపంలో తిరుగాడిన పుణ్యస్థలి మళ్లీ తన ఆధ్యాత్మిక ఉనికిని అత్యంత ఘనంగా చాటి చెప్పుకుంది.
రాజారాముడు మళ్లీ
తన నిజస్థానంలో
పత్ని అయోనిజతో కలిసి అరుదెంచి తన రాజ్యంలో పునఃప్రతిష్టితుడయ్యాడు
అయోధ్య..
భారతీయ ఆత్మకు వేదిక ..
హిందూ ధర్మానికి పీఠిక..
శ్రీరాముని వాటిక..
ధర్మానికి ఘంటిక..
సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి ప్రభువుగా శ్రీరామరాజ్య స్థాపనకు వేదికగా నిలిచిన
మహా పుణ్యభూమి..
భువిలో
అత్యంత
ధన్యభూమి..!
ఆ గడ్డకు రాముని
పుట్టుక తెలుసు..
ఆ రాముని బుడిబుడి అడుగుల సవ్వడీ ఎరుకే..
బాలరాముని శౌర్యము..
ఆతడి పాండితీ విభవము..
వినయవిధేయత..
ముగ్ధమోహన రూప విశేషము..
మహర్షి విశ్వామిత్రుని వెంట నడిచిన ముక్కుపచ్చలారని
విక్రమము..
జనకుని సభలో శివధనస్సును అవలీలగా విరిచి జానకీ హృదయమును దోచుకుని
స్వయంవర మాలను
అలంకరించుకుని
కల్యాణరాముడై అరుదెంచిన
సమ్మోహనాకారమూ విదితమే...
శ్రీరామచంద్రుని ప్రతి లీల
ఆ మ్రోల..
శ్రీరామరాజ్య రాజధాని.. మర్యాదపురుషుని
కేంద్రస్థానం..
సీతా వియోగ రాజారాముని
విషాద గీతిక..
ఆయన చెంత
స్వర్ణ నాయిక..
అశ్వమేధయాగ భూమిక..
మహాకారుణ్యమూర్తి అవతార పరిసమాప్త
మహాఘట్టాన్నీ వీక్షించి
రామా వెళ్లిపోవద్దయ్యా అని వేడుకుంటూ గుండెలు పగిలేలా రోదించిన భూమిక..
అలాంటి అయోధ్య..
ఎన్నో దాడులు..
ఆక్రమణలు..విధ్వంసాలు..
కల్లోలాలనూ చవిచూసింది.
తన ప్రభువు పుట్టిన పుణ్యస్థలంలో మహనీయుడు కొలువై ఉన్న
ఆలయం కూల్చివేతకు గురవుతుంటే మౌనంగా రోదించింది.ఆ శిధిలాల కింద
తన ప్రభువు దివ్యమంగళ రూపం దాగిపోతుంటే..
అక్కడే బాబర్ అనే వ్యక్తి
మసీదును నిర్మించి వికటాట్టహాసం చేస్తుంటే
నిస్సహాయగా మారి
ఆక్రోశించింది.గత అయిదు వందల ఏళ్లలో
ఎన్నో మార్పులు..
ఎన్నెన్నో చేర్పులు..
ఇంకెన్నో తీర్పులు..
దండయాత్రలు..యాత్రలు..
చేదు మాత్రలు..అన్నీ ముగిసి
ఇప్పుడు మొదలయ్యాయి తీర్థ యాత్రలు..!
అయిదు శతాబ్దాల
సుదీర్ఘ నిరీక్షణ..
పోరాటాల పరంపర.. పిటిషన్ల తామరతుంపర.. న్యాయస్థానాల్లో వాదోపవాదాలు..
మీనమేషాలు..
గొడవలు..వివాదాలు..
త్యాగాలు..కొట్లాటలు..
అంతిమంగా తీర్పు..
చారిత్రక నిర్ణయం..
అనంతరం ఒప్పందం..
ఒక కీలక ఘట్టానికి ముగింపు...
మహా ఘట్టానికి శ్రీకారం..
ఘనచరిత్రకు నుడికారం..!
రాముడు పుట్టిన చోట..
ఆయన నడయాడిన భూమి..
ఆ పురాణ పురుషుని
పద స్పర్శతో అణువణువూ పులకింప చేసుకున్న గడ్డ..
భక్తి వాసనతో
నిండి ఉండే మట్టి..
నాలుగు చెరగులా
ఆధ్యాత్మిక కిరణాలు..
అలాంటి భూమిపై..
మళ్లీ రామ మందిరం..
మహా నిర్మాణం..
ఆ క్షేత్రంలో రాముడికి సంబందించిన ప్రతి జ్ఞాపకం..
ప్రతి విశేషం..ప్రతి అనుభూతి..అన్నిటినీ పునరుద్ధరిస్తూ.,
అంతటి రామయ్య దివ్యమంగళ రూపానికి మరోసారి ప్రాణ ప్రతిష్ట చేస్తూ..ఆ మహా ఆధ్యాత్మిక నగరానికి రామాయణ కాలం నాటి వైభోగాన్ని..వైభవాన్ని
ఆపాదిస్తూ అద్భుత కట్టడాలు..మహోన్నత నిర్మాణాలు.. అత్యద్భుత ఆధ్యాత్మిక శోభ...!
ఔను..అయోధ్య..
భావి భారత అత్యంత విశేష ఆధ్యాత్మిక కేంద్రం..
గొప్ప దర్శనీయ క్షేత్రం..
ప్రపంచం మొత్తం ఇప్పుడు అయోధ్య వైపు చూస్తోంది.
రానున్న రోజుల్లో ప్రపంచంలోనే అతి గొప్ప
తీర్ధస్దలిగా అవతరించే
మహా భూమి..!
ప్రతి భారతీయుడు సందర్శించాలని కలలు కంటున్న కలియుగ వైకుంఠం..రామయ్య సీతాలక్ష్మణ భరత శతృఘ్న
ఆంజనేయ సమేతంగా అక్కడ మళ్లీ కొలువు దీర
వచ్చాడన్నది నిస్సందేహం..
ఔను..రామయ్య ఉనికి లేనిదే అక్కడ అన్ని జరగవు.
ఆయన అడుగు మోపనిదే రామాలయ నిర్మాణ
సంకల్పం నెరవేరదు.
అక్కడి గాలికి అలాంటి పవిత్రత రాదు.
ఆ నిర్మాణాలకు
ఆ శోభ చేకూరదు..!
నిజం..కలియుగం అంతమైనా కూడా శ్రీరామయ్య అక్కడే కొలువై ఉండి మరో అద్భుత ఆరంభానికి అక్కడ నుంచి తానే కర్తగా..ప్రత్యక్ష సాక్షిగా
ఉండి మళ్లీ మరో యుగంలో
శ్రీరామరాజ్య స్థాపనకు ఉద్యుక్తుడు కాబోతున్నాడు.
ఈ అపూర్వ..అద్భుత ఘట్టానికి వేదిక అయోధ్య..
సజీవ సాక్ష్యం అయోధ్య..
ఇది చరిత్ర కాదు..మరో పురాణం..!
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
జర్నలిస్ట్..విజయనగరం
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box