పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ ఒకటి, రెండు స్థానాలకే పరిమితం -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

 కేటీఆర్, హరీష్ రావు వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యం

కరెంట్ బిల్లులు సోనియాకు పంపాలనడం సరికాదు

పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ ఒకటి, రెండు స్థానాలకే పరిమితం

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు



బీఆర్ఎస్ నాయకులు ఎన్నికలలో ఓడిన నాలుగైదు రోజుల నుండే మతిబ్రమించి శాపనార్థాలు పెడుతూ ప్రజా తీర్పుకు విరుద్ధంగా మాట్లాడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆదివారం హనుమకొండలోని హరిత హోటల్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో  ఆయన మాట్లాడారు. ఒక వైపు రాష్ట్రంలో రోజుకో శాఖ నుండి శ్వేత పత్రం బయటికి వస్తుంటే అబద్దాలు, వంచనతో ప్రజాస్వామ్య బద్దంగా గెలిచిన ప్రభుత్వాన్ని ఎలా దించేయాలా అని చూస్తున్నారని విమర్శించారు. కరెంట్ బిల్లులు కట్ట వద్దని, సోనియాకు పంపాలని మాజీమంత్రి కేటీఆర్ చెప్పడం సరికాదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం 46 రోజులే కావస్తున్నదని, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు వంద రోజుల వరకు వేచి చూడలేరా అని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన దళితునికే ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాల భూమి, కేజీ టూ పీజీ విద్య, డబుల్ బెడ్రూం, దళిత బందు, నిరుద్యోగ బృతి లాంటి హామీలను నెర వేర్చారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం,సీతారామ ప్రాజెక్టులలో భారీ అవినీతి చోటు చేసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నదని అన్నారు. ఎన్నికలలో ఓడినా బీఆర్ఎస్ నాయకుల అహంభావం, నియంతృత్వ పోకడలు తగ్గ లేదని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నుండి కొందరినీ లాక్కుని ప్రజా తీర్పు ను అగౌరవ పరచాలని చూస్తున్నదని, అది ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కలిగించడమే నని అన్నారు. ఇటీవల జరిగిన సింగరేణి ఎన్నికలలోనూ కార్మికులు ఓట్లను గంపగుత్తగా ఏఐటీయూసికే వేశారని, రానున్న పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ కు రాష్ట్రంలో ఒకటి, రెండు స్థానాల కంటే ఎక్కువ సీట్లు రావని అన్నారు. సింగరేణితో పాటు ఆర్టీసీ, బ్యాంకులు, అంగనవాడీ, మెడికల్ తదితర అన్ని రంగాలలో ఎర్రజెండా అభిమానులే ఉన్నారని, ప్రజల తరుపున ప్రశ్నించాలంటే చట్టసభల్లో కమ్యూనిస్టులు ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. 

ఒక పార్లమెంటు స్థానాన్ని కోరుతున్నాం

పార్లమెంటు ఎన్నికలలోనూ కాంగ్రెస్ స్నేహ ధర్మాన్ని పాటిస్తుందని భావిస్తున్నామని, రాష్ట్రంలోని ఒక పార్లమెంటు స్థానాన్ని కోరుతున్నామని కూనంనేని సాంబశివరావు తెలిపారు. తాము కోరుతున్న ఐదు స్థానాలలో వరంగల్ పార్లమెంటు స్థానం కూడా ఉందని, అందుకే ఇక్కడే తొలి సమావేశాన్ని నిర్వహించి సిపిఐ పార్లమెంటు కమిటీని వేసుకుంటున్నామని తెలిపారు. కమ్యూనిస్టులు కలిస్తేనే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ లది దొంగాట అని, రేపు తెలంగాణలో బీఆర్ఎస్ ఒకటి, రెండు ఎంపీలు గెలిస్తే ఇండియా కూటమికి మద్దతు తెలుపుతారా చెప్పాలని ప్రశ్నించారు. 

బీజేపీ ది రామజపం కాదు మోడీ జపం

బీజేపీ ది రామజపం కాదని, మోడీ జపం అని, ప్రజలలో హిందూత్వ సెంటిమెంట్ రెచ్చగొట్టి తిరిగి అధికారంలోకి రావాలని చూస్తున్నారని కూనంనేని సాంబశివరావు తెలిపారు. రాముడు అందిరి దేవుడైనా బీజేపీ రాముని పేరుతో ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నదన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు, మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేదునూరి జ్యోతి, సిపిఐ జిల్లా కార్యదర్శులు సి హెచ్ రాజారెడ్డి, బి. విజయ సారథి, కర్రె బిక్షపతి, మేకల రవి, కె. రాజ్ కుమార్, రాష్ట్ర, జిల్లా నాయకులు పంజాల రమేష్, మండ సదాలక్ష్మి, మారుపాక అనిల్, ఆదరి శ్రీనివాస్ వలీ ఉల్లాఖాద్రి, షేక్ బాష్ మియా, తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు