ప్రగతి భవన్ ను ఇకపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రజా పాలనా భవన్ గా మార్చబోతున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. 24 గంటల పాటు సామాన్యల కోసం దాని తలుపులు తెరిచే ఉంటాయన్నారు. అలాగే సామాన్యుల కోసం తెలంగాణ సచివాలయం తలుపులు కూడా తెరవబోతున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణ ప్రజలకు విశ్వాసాన్ని కలిపించి, కాంగ్రెస్ పార్టీలో స్ఫూర్తిని నింపిన రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీకి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో రాజకీయ నేతలుగానే కాకుండా కుటుంబ సభ్యుల్లా వారు కలిసిపోయారని, ప్రజల్లో విశ్వాసం నింపారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. భట్టి, వీహెచ్, జానారెడ్డి, ఉత్తమ్, కోమటిరెడ్డి, దామోదర్ రాజనర్సింహ, మధుయాష్కీ వంటి సీనియర్ నేతల సహకారంతో ఈ విజయం సాధించామన్నారు. తెలంగాణ అమర వీరులకు అంకితం చేస్తున్నామన్నారు. వారి ఆకాంక్షలను నిజం చేయడానికి దీన్ని వినియోగిస్తామన్నారు.
ప్రజాస్వామ్య విలువల పునరుద్దరణకు పాత్రికేయుల సహకారం కావాలన్నారు రేవంత్ రెడ్డి.
తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, ప్రపంచానికే ఉద్యమ స్ఫూర్తిని ఇవ్వడానికి, మానవ హక్కుల్ని కాపడటానికి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. విపక్ష నేత తమ వాదన వినిపించడానికి కాంగ్రెస్ అవకాశం ఇస్తుందని కేసీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ విజయాన్ని అభినందించిన కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియలోనూ ప్రతిపక్షాలు పాల్గొనాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.
డిసెంబర్ 3, 2009లో శ్రీకాంతాచారి అమరుడయ్యాడని, ఇవాళ అదే రోజు 4 కోట్ల తెలంగాణ ప్రజలు విలక్షణ తీర్పు ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంతాచారికి నివాళులు అర్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం ద్వారా సోనియాంధీకి కృతజ్ఞతలు తెలిపే అవకాశం ఇచ్చారన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box