రేవంత్ రెడ్డి అను నేను.._
రాత్రికి రాత్రే తెలంగాణ సీఎం అయిపోలేదు..అసలు తెలంగాణ అనే రాష్ట్రానికి సిఎం అవ్వాలని ఎప్పుడూ కలగనలేదు కూడా..జర్నలిస్టుగా ఉంటూ
రాజకీయాలపై ఆసక్తితో అటు వైపు అడుగువేసినా
అందలాలు ఎక్కిపోవాలని..సిఎం.. పిఎం అయిపోవాలన్న పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకోలేదు.
ఎన్టీఆర్ పై అభిమానంతో ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరినా అనతికాలంలోనే చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడిగా
మారి తెలంగాణలో తెలుగుదేశం అంటే రేవంత్ రెడ్డి అనే స్థాయికి ఎదిగారు.
కారణం..ఆయన రూపం..
ఆపై వాక్చాతుర్యం.
తెలుగుదేశం పార్టీలో
ఆయన ప్రస్థానం అద్భుతం అనే రీతిలో సాగిందేమీ కాదు.పైగా..ఆ పార్టీలో ఉండగా ఓటుకు నోటు వివాదం పెనుభూతమై పట్టింది. అది ఇంకా పట్టి పీడిస్తుండగానే తెగించి కాంగ్రెస్ గొడుగు నీడకు చేరారు.నమ్మిన తెలుగుదేశం పార్టీని వీడడానికి
అంత బలమైన కారణాలు కూడా ఏమీ లేవు.
చంద్రబాబుతో వివాదాలు..
విబేధాలు కూడా లేనట్టే.అయినా అలా జరిగిపోయిందంతే.
పోనీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేపాటికి ఆ పార్టీ పరిస్థితి ఏమైనా బాగుందా అంటే ఊహు..ఆ పార్టీ స్థితిగతులు
అందరికీ తెలిసినవే.కొన్ని దశాబ్దాల పాటు దేశాన్ని ఒకే తాటిపై నడిపిన కాంగ్రెస్ ఆ సమయంలో తానే తాడూ బొంగరం లేని స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉంది.కొన్నాళ్ళ పాటు నేల విడిచి సాము చేసిన పార్టీ
ఆ దశలో
పూర్వవైభవం
మాట పక్కనబెడితే కనీసం వెనక్కి రావడానికే తల్లక్రిందులుగా
తపస్సు చేస్తోంది.అలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీలో చేరారు.
అద్భుతాలు సృష్టించాలని కాదు..తన ఉనికిని కాపాడుకోవడానికి..
అయితే ఆరేళ్లు గడిచేపాటికి
అదే రేవంత్ రెడ్డి తన ఉనికిని ఘనంగా చాటడమే కాదు
నిజంగా అద్భుతాన్నే సృష్టించారు.ఈరోజున ఆయన టాక్ ఆఫ్
ఇండియన్ పాలిటిక్స్.. సెన్సేషనల్ హీరో..!
తెలంగాణ వంటి రాష్ట్రంలో
గత పదేళ్లుగా పాతుకు పోయి..తానే తెలంగాణ గొంతు..ఆ తెలంగాణ ఎప్పటికీ తన కుటుంబం వంతు అన్నట్టు వేళ్ళు విస్తరించేసి ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర రావును త్రోసిరాజని అనూహ్యరీతిలో కాంగ్రెస్ పార్టీ
తెలంగాణాలో మళ్లీ
పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడం ఒక చరిత్రే.గతంలో కాంగ్రెస్ ఇలాంటి విజయాలు సాధించినా ఇప్పుడు ఆ పార్టీ
ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ విజయం అపూర్వమే.
కాకపోతే ఇప్పటికీ వికృత..విపరీత ధోరణులు విడిచిపెట్టని కాంగ్రెస్ పార్టీలో
అప్పుడే కొన్ని శక్తులు రఫాడ్డం ప్రారంభించాయి.
కాంగ్రెస్ లో
అలా జరగకపోతే ఆశ్చర్యం గానీ జరిగితే అనుకునేదేముంది.హస్తం పార్టీ అతి పోకడలతో తన చూరుకు తానే నిప్పు పెట్టుకున్న ఉదంతాలు కోకొల్లలు.రేవంత్ రెడ్డి అయితేనేమి..తమ పార్టీ మళ్లీ ఒక కీలక రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అతగాడే కారణమైతేనేమి..
ముఖ్యమంత్రిగా సాక్షాత్తు పార్టీ అధినేత్రి అతడినే నిర్ణయిస్తేనేమి..అతగాడు సమర్థుడుగా ఉంటూ తెలంగాణలోనే కాదు..దక్షిణాది మొత్తం మీద
తమ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తూ ఉండవచ్చుగానేమి..
కాంగ్రెస్ పార్టీలోని విష సంస్కృతి దృష్టిలో అవన్నీ
మామూలు విషయాలే.
వ్యక్తిని ముంచడానికి..
అందుకోసం అవసరమైతే
తల్లి వంటి పార్టీని ముంచెయ్యడానికి వెనుకాడని ఘనాపాటీలకి
పుట్టినిల్లు కాంగ్రెస్.
అలాంటి పార్టీలో ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి నెగ్గుకురావడం రేవంత్ రెడ్డికి కత్తి మీద సామే.ఇటు పార్టీలో శక్తులను ఎదుర్కొంటూ అందరినీ కలుపుకుంటూ..అటు అధిష్టానాన్ని సంతృప్తి పరచుకుంటూ..రాష్త్రం అభివృద్ధిలో వెనకబడి పోకుండా చూసుకుంటూ..
మళ్లీ వెనక్కి వచ్చే అవకాశం కోసం ఎదురుచూసే టీఆరెఎస్ పార్టీని కాచుకుంటూ అడుగులు ముందుకు వేయాల్సి ఉంటుంది.అందులోనూ ఇప్పుడు కారు పార్టీ కేటీఆర్ నేతృత్వంలో పునారాగామనానికి పోరాటం మొదలెడుతుంది.
తారకరామారావుకు చెడ్డపేరు లేదు.ఐటి రంగంలో అతడు సాధించిన అభివృద్ధి ఎన్నదగిందే.వ్యక్తిగతంగా కేటీఆర్ మంచి వక్త కూడా.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం గనక కేంద్రం నుంచి పెద్దగా మద్దతు ఉండదు.
ఇలాంటివన్నీ రేవంత్ ముందున్న సవాళ్లు.
వాటిని ఎదుర్కొంటూ ఆయన ఎలా నెగ్గుకొస్తారో చూడాలి..!
*_సురేష్...జర్నలిస్ట్_*
_9948546286_
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box