రేవంతు..ఎవరి వంతు..!?

 రేవంతు..ఎవరి వంతు..!?



రేవంత్ అంటే గుర్రాలకు

శిక్షణ(అశ్వ శిక్షకుడు) ఇచ్చేవాడు అని అర్థం..

మరి తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

తాను వ్యక్తిగతంగా గెలుపు 

గుర్రమై నిలిచారు.ఇప్పుడు 

ఆ రాష్ట్రంలో అదుపులేని కాంగ్రెస్ గుర్రాలను ఎలా అదుపులోకి తెచ్చి రాష్ట్రాన్ని

ప్రగతిపథంలో తీసుకువెళ్తారో..

పార్లమెంట్ ఎన్నికల నాటికి

రాష్ట్రం నుండి తన పార్టీకి ఎన్ని స్థానాలు ఇవ్వగలుగుతారో..జాతీయ స్థాయిలో కూడా ముక్కి మూలుగుతున్న ఇందిరమ్మ పార్టీకి తన వంతుగా ఎంతమేర జవసత్వాలు

సమకూరుస్తారో..చూడాలి!


ఇప్పుడు అసలు 

కథలోకి వద్దాం..

తెలంగాణ..ఆంధ్ర మధ్య సంబంధాలు ఇకపై ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు మన కథాంశం.

పదేళ్ల క్రిందటి వరకు ఒకటే పేరు.. ఒకటే గొడుగు..

కలిసి అడుగు.. తెలుగువాడంటే పిడుగు..!


సరే..తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్ష ..చిరకాల స్వప్నం నిజమై..ఇటు ఆంధ్ర ప్రజలు కలిసే ఉందామని ఎంతగా మొత్తుకున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీలిపోయి

నవ తెలంగాణ.. నవ్యాంధ్ర అవతరించాయి.

అది ఇప్పుడు చరిత్రే..!


రెండుగా విడివడిన తర్వాత

కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణలో టీఆరెఎస్ అధికారంలోకి వచ్చి

ఆ పార్టీ అధినేత..ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు

తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారురు.ఉమ్మడి రాష్ట్రాన్ని తమ అభీష్టానికి వ్యతిరేకంగా విడగొట్టిన కాంగ్రెస్ పార్టీపై అక్కసుతో

ఆంధ్ర ప్రజలు దశాబ్దాల పాటు భుజాన ఎత్తుకుని మోసిన కాంగ్రెస్ పార్టీని నామరూపాల్లేకుండా తిప్పికొట్టి ఆ పార్టీ కంటే కొంత నయం కదాని తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు.

అలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నాయకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మిగిలిపోతే

నవ తెలంగాణకు కేసీఆర్..

నవ్యాంధ్రకు నారా చంద్రబాబు నాయుడు మొదటి ముఖ్యమంత్రులుగా 

పాలన సాగించారు.ఇద్దరూ ఒక తానులోని ముక్కలే.


తాజాగా తెలంగాణలో మార్పు చోటు చేసుకుంది.

అక్కడ పదేళ్ల పాటు రాజ్యం చేసిన టీఆరెఎస్ మొన్నటి ఎన్నికల్లో పరాజయం పాలుకాగా తెలంగాణ ఆవిర్భావానికి బాటలు వేసిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది.మొన్నటి వరకు

తెలుగుదేశం పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడి హోదాలో తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.తెలంగాణ కాంగ్రెస్ పాతకొత్తల కలయికలా కనిపిస్తున్నా ప్రధానంగా పాతనీటితోనే నిండిపోయి ఉంది.ముఠా రాజకీయాలకు..వెన్నుపోటు వ్యవహారాలకు..

కుమ్ములాటలకు..

ఫిరాయింపులకు పెట్టింది పేరు కాంగ్రెస్. ఎంతటి వ్యక్తినైనా తికమకపెట్టి నాకెందుకురా ఈ పదవి అనుకునే స్థాయికి తీసుకురావడంలో ఘనాపాటీలైన నాయకులకు హస్తం పార్టీలో కొదవ లేదు.

ఆ ఛాయలు 

తెలంగాణలో ఇప్పటికే ద్యోతకమవుతున్నాయి.

మరి అలాంటి బ్యాచీతో పరిపాలనా అనుభవం లేని రేవంత్ రెడ్డి ఎలా నెట్టుకొస్తారో చూడాలి.


ఇక్కడ మరో కీలక అంశం..

అది ఆంధ్రా...తెలంగాణ సంబంధాలు..ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలకు తొలి ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన

కేసీఆర్..చంద్రబాబు నాయుడు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి.నేతల మధ్య విబేధాలు రాష్ట్రాల నడుమ సంబంధాలపై కూడా ప్రభావం చూపాయి.ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును పదేళ్ల వరకు 

వినియోగించుకునే అవకాశం ఉన్నా కేసీఆర్ పంచన ఉండడం ఇష్టం లేకనే చంద్రబాబు తొందరగా నిర్ణయాలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ పాలనను అమరావతికి తెచ్చేసారు.

అలాగే హైకోర్టును కూడా.


మొన్న 2019 ఎన్నికల్లో

ఆంధ్రప్రదేశ్  లో జగన్మోహన రెడ్డి నేతృత్వంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడ్డాక

జగన్..కేసీఆర్ చెలిమి 

ఒక అయోమయ వ్యవహారంగానే

మిగిలింది తప్ప ఉభయ రాష్ట్రాలకు ఆ ఇద్దరి స్నేహం కారణంగా ఒరిగిందేమీ లేదు.


ఇప్పుడు కథ మారింది. తెలంగాణలో పాత సీసాలో కొత్త సారా..అక్కడ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్..ఎన్నో ఢక్కీ మొక్కీలు చూసిన చారిత్రక పార్టీ..ముఖ్యమంత్రి మాత్రం 

తెలుగుదేశం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి..ఆయనకి పాలన అనుభవం లేదు.

సరే..ఆ విషయాన్ని పక్కన బెట్టి రేవంత్ హయాంలో తెలంగాణ..ఆంధ్ర సంబంధాలు ఎలా ఉండబోతాయన్న అంశాన్ని

చర్చిస్తే రేపు 2024 ఎన్నికల్లో

ఆంధ్రలో ఎవరు అధికారంలోకి వస్తారన్నది కీలకం.జగన్ వస్తారు అనుకుంటే ఆయనకి..రేవంత్ రెడ్డికి మధ్య స్నేహం.. సత్సంబంధాలు ఉన్న దాఖలాలు పెద్దగా లేవు.

అలాగే వైరం కూడా లేనట్టే.

ఈ నేపథ్యంలో మళ్లీ జగన్ గెలిస్తే ఆంధ్ర..తెలంగాణ సంబంధాలు ఎలా ఉంటాయో చెప్పడం కష్టమే.

అప్పుడు ఆ అంశం సోనియా వైఖరి మీద కూడా ఆధారపడి ఉంటుంది.

ఇప్పటికైతే సోనియా గాంధీకి జగన్ పట్ల అంత సానుకూల దృక్పథం ఉన్న దాఖలా లేదు.చూడాలి మరి.


చంద్రబాబు అధికారంలోకి వస్తే..రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి బయటకి వచ్చి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నా గాని ఆయనకి మాతృ సంస్థ పట్ల వ్యతిరేకత లేదు.అలాగే చంద్రబాబు అంటే ఇప్పటికీ గౌరవం ఉంది.ఆ కోణంలో చూస్తే ఎపి తదుపరి సీఎంగా చంద్రబాబు

వస్తే రెండు రాష్ట్రాల మధ్య ఇచ్చిపుచ్చుకోడాలు బాగానే ఉంటాయని భావించవచ్చు.

కానీ ఇక్కడ ఇంకొన్ని చిక్కు ముళ్ళు ఉన్నాయి.

చంద్రబాబు గనక రేపటి ఎన్నికల్లో బిజెపితో కలిస్తే

ఇక రేవంత్ ఆయనతో సత్సంబంధాలు ఏర్పరచుకోడానికి కాంగ్రెస్ అధిష్టానం సుతరామూ ఒప్పుకోదు. బిజెపితో కలిసి కాకుండా పోటీ చేసి తెలుగుదేశం గెలిస్తే అప్పుడు

రేవంత్..బాబు చెలిమి ఉభయ రాష్ట్రాలకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది.ఇదంతా తేలడానికి రేపు ఏపి ఎన్నికలు కీలకం.ఆ ఎన్నికల్లో పొత్తులు..గెలుపును అనుసరించి ఈ అంశాలు 

ఉంటాయి. ఇంకొన్నాళ్ల పాటు జగన్ అధికారంలో ఉంటారు అనుకున్నా అప్పటికి రేవంత్ ఇంకా పాలనలో నిలదొక్కుకోవడం వరకే సరిపోతుంది.అసలు కథ

2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాతే మొదలవుతుంది.


ఎలిశెట్టి సురేష్ కుమార్

       జర్నలిస్ట్

  9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు