ఆధిపత్య వర్గాలకు ములుగులో పనేంటి?
సీతక్కను ఓడించాల్సిన కక్ష వీరికి ఎందుకు?
సీతక్క అధికార పార్టీ నాయకుల లాగా లాండ్ మాఫియా, సాండ్ మాఫియా చేయలేదు కదా.!
సీతక్కను ఓడించడం కోసం స్థానికేతర నాయకులు డబ్బు సంచులు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు?
ములుగు అభివృద్ధిని అడ్డుకున్నది ఎవరు?
పుట్టుక మన చేతిలో ఉండదు. కానీ చావు మన చేతిలోనే ఉంటుంది. ఏ కులంలో పుట్టాలో, ఎవరి కడుపులో పుట్టాలో మన ప్రమేయం లేకుండానే జన్మిస్తాము. చావు మాత్రం 95 శాతం మన చేతిలోనే ఉంటుంది. మనం ఎలాంటి మార్గాన్ని ఎన్నుకుంటే ఆ మార్గంలోనే మన చావు ఉంటుంది. జీవుల అన్నిటికన్నా మానవ జన్మ చాలా గొప్పది. అలాంటి జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేయడం చాలా చాలా గొప్ప విషయం. ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వాలనుకొని బందూకు చేతబూని జంగ్ సైరన్ ఊదిన సీతక్క చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది. బుల్లెట్ విడిచి బ్యాలెట్ వైపు వచ్చిన సీతక్క రెండు పర్యాయాలు ములుగు ఎమ్మెల్యేగా గెలిచింది. ప్రజల ఓట్లతో నిజాయితీగా గెలిచిన సీతక్కను అధికార బి ఆర్ ఎస్ పాలక వర్గం పాలన పరమైన నానా ఇబ్బందులకు గురిచేసింది. అధికారులు సమర్థవంతంగా పనిచేయకుండా వారిపై ఒత్తిడి పెంచి ఇక్కడి ప్రజల అభివృద్దికి అడ్డు పడిన బి ఆర్ ఎస్ నాయకులు ఒక ఎమ్మెల్యేకు హక్కుగా రావలసిన నియోజకవర్గ అభివృద్ధి నిధులను కూడా అందకుండా తొక్కి పట్టారు. దీనిపై సీతక్క కోర్టును ఆశ్రయించి ప్రభుత్వానికి మొట్టికాయలు వేయించింది. ఈ ఒక్క సంఘటన చాలు సీతక్క నియోజకవర్గ ప్రజల పట్ల అంకితభావం, ప్రజల వైపు ఆమె నిలిచిన దీశాలి తనపు లక్షణం. అభివృద్ధిని అడ్డుకోచూసిన బిఆర్ఎస్ పార్టీ ములుగు ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కును కోల్పయిందనే విషయం ప్రజలు గుర్తించాలి. ములుగు నియోజక వర్గానికి భలమైనా నాయకత్వం లేకుండా చేయడమే వీరి ముఖ్య లక్ష్యంగా వుంది. గత ఎన్నికల్లో సీతక్కతో గెలిచిన కాంగ్రెస్ శాసన సభ్యులు బి అర్ ఎస్ కు అమ్ముడుపోయిన సందర్భములో తనను ఎంత ప్రలోభ పెట్టినా, ఎంత ఒత్తిడి చేసినా, ఎన్ని ఆశలు చూాపిన కె సి ఆర్ కుట్రలకు లొంగ కుండా తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజల పక్షానా నిలబడి, పార్టీ క్రమ శిక్షణకు కట్టుబడి ములుగు నియోజకవర్గ రాజకీయ అధికార నైతికతను కాపాడడములో ఎంతో సాహస పాత్ర నిర్వహించింది. ఒక ఆదివాసి మహిళ పార్టీ పెద్ద దొరకు తలవంచకుండా తమను ఎదిరించి నిలబడడము ఆధిపత్య వర్గాలకు మింగుడు పడలేదు. అందుకే సీతక్కను కాలరాయాలని, తన రాజకీయ జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా ఆదివాసీ వర్గాలలో బలమైన సీనియర్ నాయకురాలును ఓడించి రాజకీయ ప్రాతినిధ్యం లేకుండా చేయాలని తలంపుతో పడరాని పాట్లు పడుతున్నారు. సీతక్కను ఎలాగైనా ఓడించాలని ప్రత్యేక దృష్టితో ఎన్నికల ప్రచారంలో ధన ప్రవాహం, స్థానిక ప్రజాప్రతినిధులను కొనుగోలు చేయడం, మద్యంతో యువతను ప్రలోభ పెడుతూ పార్టీ పెద్దలే పనిగట్టుకొని అనైకిత రాజకీయాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్య విలువలను నాశనం చేస్తున్నారు.
ఒక సాధారణ ఆదివాసి మహిళ అయిన సీతక్క రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు తన సేవల ద్వారా దేశ స్థాయిలో ప్రజాదరణ సంపాదించింది. కరోనా కష్ట కాలంలో ప్రతి ఒక్కరూ ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని తోబుట్టువులను కూడా పట్టించుకోని భయంకరమైన పరిస్థితుల్లో మారుమూల ప్రాంతాల్లోకి సైతం వెళ్లి ప్రజలకు తిను బండారాలను అందించి సేవలు చేసిన ధీశాలి సీతక్క. నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం తన స్వంత పరపతితో సుదూర ప్రాంతాల్లో ఉన్నవారి సహాయం తీసుకొని రాజకీయాలకు అతీతంగా, కుల, వర్గాల తారతమ్యం లేకుండా విపత్తు కాలంలో, సామాజిక సేవలో ఆమె గొప్పదనాన్ని ప్రపంచమంతా కొనియాడింది. ప్రజలకు అహార భద్రత కల్పించి అండగా నిలిచిన మానవతావాది సీతక్క. కనీ, విని, ఎరుగని వర్షాల వల్ల ఉదృతమైన వరద తాకిడితో ములుగు నియోజకవర్గంలోని గ్రామాలు రాత్రికి రాత్రే నీట మునిగి ప్రజల మరణాలు జరిగితే సీతక్క తల్లడిల్లింది. ప్రజల ప్రాణాల రక్షణ కోసం అడవుల్లో, వరదల్లో వెళ్లి ప్రజలకు అండగా నిలిచింది. ప్రజల కష్టాలకు కన్నీరు మున్నీరైంది. మానవీయ విలువలకు ప్రతి రూపంగా నిలిచింది. సీతక్క ప్రతిపక్ష ఎమ్మెల్యే అని అధికార బి ఆర్ ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి నిధులు ఇవ్వకున్నా ఎక్కడెక్కడినుండో నిధులు, నిత్యావసరాలు సేకరించి నియోజకవర్గ ప్రజలకు అందించి ఆదుకుంది.
ఇంతటి మానవీయ నాయకురాలును ఎందుకు కక్ష కట్టి ఓడించాలనుకుంటున్నారో బి ఆర్ ఎస్ నాయకులు చెప్పాలి.
సీతక్కను ఓడించడం కోసం స్థానికేతర నాయకులు డబ్బు సంచులు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు?
యువతకు మందు, డబ్బులు ఎందుకు పంచుతున్నారు?
తెలంగాణ రాష్ట్రంలోని యువత మొత్తం బి ఆర్ ఎస్ దుష్ట పాలనను అంతమొందించాలని ప్రతినబూనితే ములుగు నియోజకవర్గంలో యువత ఎందుకు బి ఆర్ ఎస్ నాయకుల ఉచ్చులో పడుతున్నట్లు?
మారుమూల వెనుకబడిన ప్రాంతంలోని యువతకు మాయ మాటలు చెప్పి, డబ్బు ఆశ చూపి బి ఆర్ ఎస్ పార్టీలోకి ఎందుకు చేర్చుకుంటున్నట్లు?
సీతక్కను ఓడించడానికి ప్రతిన బూనిన పెద్ద దొర సీతక్క సామాజిక వర్గానికే చెందిన అభ్యర్థిని సీతక్కకు పోటీగా బరిలో దించడం ఒక కుట్రపూరిత ఎత్తుగడ. ప్రగతిశీల ఉద్యమాల నుండి వచ్చిన సీతక్కకు అలాంటి చరిత్ర కలిగిన అభ్యర్థిని బరిలోకి దించడమనేది ఆదివాసీల నాయకత్వాన్ని ఎత్తి పట్టాలన్న తలంపు బి ఆర్ ఎస్ పార్టీకి లేదు. ఆ పేరుతో వారి నాయకత్వాన్ని బలహీన పరుచాలన్న కుట్ర దాగి ఉన్నదన్న సత్యాన్ని మనం గుర్తించాలి. పార్టీల రూపములో దాగివున్న ఈ కుట్ర పూరిత ఎత్తుగడను చిత్తూ చేస్తూ సీతక్కను గెలిపించి ఈ ప్రాంతపు ఉద్యమ చరిత్రని ఎత్తి పట్టాలి. ములుగులో సీతక్కను ఓడించాలని కుట్ర చేస్తున్న పెద్ద దొర ముఠా ఎత్తుగడలను అడుగు, అడుగున తిప్పి కొట్టి సీతక్క విజయం చరిత్రలో నిలిచిపోయేలా చేయాలి.
అసలు బయట నుండి వచ్చిన ఈ ఆధిపత్య వర్గాలకు ములుగులో పనేంటి? ఎన్నడైనా ఎన్నికల సమయంలో బయట నుండి ములుగుకు నాయకులు వచ్చి రాజకీయాలు చేశారా? డబ్బు పంచారా? ఈ దుష్ట సంస్కృతి పెద్ద దొర, చిన్న దొర సూచనలతో జరుగుతుంది. గతంలో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఈ సంస్కృతిని ఏజెన్సీ ప్రాంతంలో మొదలు పెట్టిన బి ఆర్ ఎస్ వారికి అత్యంత అనుంగుడైన కుసుమ జగదీష్ ను ఏటూరునాగారం నుండి గెలిపించి జిల్లా పరిషత్ చైర్మన్ చేశారు. అందుకోసం మంత్రులు, ఎమ్మెల్యేలు ఏజెన్సీని ఎన్నడూ లేనంతగా ఆక్రమించారు. ఈ ప్రాంతంలో ఉన్న ఇసుకను హైదరాబాద్ తరలించడానికి వారికి అనుంగుడైన జగదీష్ ను గెలిపించుకుని అందినకాడికి దోచుకున్నారు. లెక్కకు మించి ఇసుక తోడుకొని పోవడం వల్ల ములుగు నియోజకవర్గంలో భూగర్భ జలాలు తగ్గిపోయి ఈ ప్రాంత ప్రజల భవిషత్ అంధకారం కానున్నది. వారి అవసరం కోసం జగదీష్ ను గెలిపించడమే కాదు. తీవ్ర ఒత్తిడితో ఆయన చావుకు కూడా బి ఆర్ ఎస్ నాయకులు కారణమయ్యారు. తన స్వంత పార్టీ నాయకున్ని ఎన్నో ఒత్తిడులకు గురి చేసి ఆయన చావుకు కారకులైనవారే ఈ ఎన్నికల్లో సీతక్కను ఆగం చేయడానికి పూనుకున్నారు.
ములుగులో సీతక్క అభివృద్ధి చేయలేదని అసత్య ప్రచారం చేస్తున్న బి ఆర్ ఎస్ నాయకులు గత 10 ఏండ్లుగా రాష్ట్రాన్ని పాలించిన బి ఆర్ ఎస్ అభివృద్ధి చేయాలా లేక ఎలాంటి నిధులు లేని సీతక్క చేయాలా? మంత్రులు మోకరిల్లి గెలిపించుకున్న జిల్లా పరిషత్ చైర్మన్ ద్వారా ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఐదు యేండ్లు మంత్రిగా ఉన్న నాయకుడు ఎందుకు అభివృద్ధి చేయలేదు? బి ఆర్ ఎస్ నాయకుల చూపంతా ఇసుక దందా మీదనే పెట్టారు కానీ ములుగు నియోజకవర్గ అభివృద్ధి మీద కాదని ప్రజలందరికి తెలుసు. దొంగే దొంగా దొంగా అని అరచినట్లుగా అభివృద్ధి చేయని ప్రభుత్వమే సీతక్క అభివృద్ధి చేయలేదు, చేయదని అని తప్పుడు ప్రచారం చేయడం సిగ్గు చేటు? సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్న మంగపేట మండలం రాజకీయ సమస్యకు సీతక్కకు ముడిపెట్టి ఎందుకు మాట్లాడుతున్నట్లు? బోడ గుండుకు, కోడు గుడ్డుకు ముడి పెట్టి మాట్లాడుతున్న బి ఆర్ ఎస్ నాయకుల మాటలు నమ్మకూడదు. మంగపేట మండల సమస్య, ఏజెన్సీ లో ఆదివాసీయేతర సమస్య చట్టపరమైనది. ఏజెన్సీ ప్రాంతంలో ఏమైనా మార్పులు రావాలంటే పార్లమెంట్ లో చట్టం ద్వారా మాత్రమే సాధ్యం. అలాంటిది సీతక్కను ఆ సమస్యకు ముడిపెట్టి మాట్లాడడం ఎంతవరకు సమంజసం. ఈ ప్రాంత ఆదివాసీయేతరులు బి ఆర్ ఎస్ చేస్తున్న అపోహలను, అబద్ధాలను నమ్మకూడదని విజ్ఞప్తి. ఇంతవరకు సీతక్క ఏ ఒక్కరి గుంట భూమి కూడా గుంజుకోలేదు. ఏ ఒక్కరిపై కూడా అక్రమ కేసులు పెట్టించలేదు. సీతక్క ఆదివాసీల పక్షపాతి అయితే ఆది ఎన్నో కష్టాలు వచ్చేవి. అన్ని వర్గాలను సమంగా చూసే సీతక్కను అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి. ప్రస్తుత ఎన్నికలను సీతక్కకు, నాగ జ్యోతికి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా చూడరాదు. రాష్ట్రంలో పాలన మారడం కోసం జరుగుతున్న ఎన్నికలు చూడాలి. దుష్ట పాలన అంతం కోసం, ములుగు అభివృద్ధి కోసం ఒక బలమైన, అనుభవం కలిగిన నాయకురాలైన సీతక్కను గెలిపించుకోవడం ములుగు నియోజకవర్గ ప్రజల అవసరం.
రాష్ట్రంలో మళ్ళీ బి ఆర్ ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని, ములుగులో కూడా బి ఆర్ ఎస్ అభ్యర్థి గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని నియోజకవర్గ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. గత 10 ఏండ్లలో తెలంగాణ రాష్ట్రంలో బి ఆర్ ఎస్ దుష్ట పాలనను చూసిన ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. బి ఆర్ ఎస్ ను ఓడించాలని ప్రతి నోట అంటున్నారు. ఈ సారి తెలంగాణలో బి ఆర్ ఎస్ ఓటమి ఖాయమైంది. కానీ అందుకు భిన్నంగా ములుగులో బి ఆర్ ఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మకూడదు. కె సి ఆర్ మాటలు 10 ఏండ్లు నమ్మి మోసం పోయాము ఇంకా నమ్మితే బలిదానాలు పెరిగి తెలంగాణ బొందల గడ్డగా మారుతుంది.
తెలంగాణలో అధికార మార్పిడి జరిగి కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమైన సందర్భంలో ములుగు నుండి గెలిచే సీతక్కకు మంత్రి పదవి తప్పక వస్తుంది. మంత్రిగా ప్రత్యేక నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో జాతీయ నాయకురాలిగా ఎదిగిన సీతక్క కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా తెచ్చి అభివృద్ధి చేసే అవకాశం ఉంది.
నిరుద్యోగులు, యువత, బడుగు బలహీనవర్గాల భవిత కోసం కాంగ్రెస్ ను గెలిపించుకోవడం అవసరం. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల కోసమే పని చేసే ప్రజల కష్టాలు తెలిసిన సీతక్కను గెలిపించుకోవడం చాలా అవసరం.
ములుగు నియోజకవర్గంలో డబ్బు సంచులతో తిరుగుతున్న స్థానికేతర బి ఆర్ ఎస్ నాయకులు వెంటనే వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నాము. విలువలతో, క్రమశిక్షణతో, ప్రేమతో జీవించే ఏజెన్సీ ప్రజలను, యువతను పాడు చేయవద్ధని కోరుతున్నాము.
ప్రజాస్వామ్యంలో ప్రజల ఓటు ద్వారనే పాలన నిర్ణయించబడుతుంది. ప్రస్తుత రాజకీయాల మీద విశ్వాసం కోల్పోయిన చాలామంది విద్యావంతులు ఓటుకు దూరమవుతున్నారు. ఓటు మీద, సమాజం మీద, రాజకీయాల మీద, పార్టీల మీద అవగాహన లేని వారు ఓట్లు వేస్తున్నారు. ఎన్నికలు జరుగుతున్నాయి. పాలకులు గద్దెనెక్కుతున్నారు.
"ఆలోచనాపరులు ఓటుకు దూరముంటున్నారు, అవగాహన లేనివారు ఓటు వేస్తున్నారు" తద్వార తప్పుడు పలితాలతో దోపిడీ పాలకులు గద్దెనెక్కుతున్నారు. ఇది మార్చాలి. ఆలోచనాపరులందరూ ఓటు వేయాలని విజ్ఞప్తి. రాష్ట్రంలో పాలన మార్పు కోరుకుంటున్న సందర్భంలో మొదటి సారి ఓటు వినియోగించుకుంటన్న యువ ఓటర్లందరు తప్పకుండా ఓటు వేసి కాంగ్రెస్ ను గెలిపించాల్సిన అవసరముంది.
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి బి ఆర్ ఎస్ గెలుపుకోసం నానా తంటాలు పడుతున్న బిజెపి ఏకంగా బి సి ముఖ్యమంత్రి అని ప్రకటించింది. గత 70 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్ గా ఉన్న మాదిగల ఓట్లను వర్గీకరణ ఆశ చూపి ఓట్లను చీల్చి బి ఆర్ ఎస్ గెలుపుకోసం బిజెపి చేసే కుట్రలను ప్రజలు గమనించాల్సిన అవసరముంది. నిజంగా బి సి ల మీద బిజెపి కి ప్రేమ ఉంటే జనగణన ఎందుకు చేయడం లేదు? చట్టసభల్లో బి సి లకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వడం లేదు? బి సి ముఖ్యమంత్రి విషయం రెండేండ్ల కింద ఎందుకు ప్రకటించలేదు? బి సి అధ్యక్షుడు బండి సంజయ్ ని ఎందుకు మార్చినట్లు? పట్టుమని పది సీట్లు కూడా రాని బిజెపి బి.సి ని ఎట్లా ముఖ్యమంత్రి చేస్తారు? కుట్ర రాజకీయాలు చేస్తున్న బిజెపిని, బిజెపి కి మద్దతు పలుకుతున్న మంద కృష్ణ ను బి.సి, ఎస్సీ సమాజం నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి.
రాష్ట్ర రాజకీయాలను మార్చే ఈ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గంలోని ప్రతి ఓటరు ఓటును వినియోగించుకోవాలని విజ్ఞప్తి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఆ ఒక్కరోజు (నవంబర్ 30) మీ ఊరికి వచ్చి ఓటు వేసి సీతక్కను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి.
సాయిని నరేందర్
సామాజిక, రాజకీయ విశ్లేషకులు
తెలంగాణ ఉద్యమకారులు వేదిక రాష్ట్ర సమన్వయకర్త
9701916091
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box