ఎలక్షన్లో ప్రతి వర్గం తమకు రాజ్యాధికారాలు కావాలని. జనాభా ప్రతిపాదిక మీద సాధికారత ఉండాలని రకరకాల కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. ఈ మధ్యన బీసీలు, కాంగ్రెస్లో, బిజెపిలో బీసీ నాయకుడ్ని తీసివేసిన తర్వాత అధికారం కోసం సాధికారత కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బండి సంజయ్ బీసీ కమ్యూనిటీకి చెందినవాడు. అతన్ని తీసివేసి అగ్రకుల కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్పినప్పుడు ఎంతో క్రమశిక్షణతో ఉంటారనుకున్న బిజెపి కింది స్థాయి కార్యకర్తల్లో కొంత అశాంతి ప్రబలి చేతికొచ్చిన అధికారం చేజారింది అనే నిస్సాయితలో చిన్నగా ఉద్యమాలు కూడా చేశారు. కాంగ్రెస్లో అయితే బీసీ నాయకులు పాదయాత్రలు కూడా చేశారు. ఈ మధ్య హనుమంతరావు ఆధ్వర్యంలో బీసీ నాయకులంతా అధిష్టాన ఆజ్ఞలను బేఖాతరు చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బీసీలకు వారి జనాభా ప్రాతిపదిక 36% ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు
కాంగ్రెస్లో ఈ విధంగా అంతర్గత విభేదాలు బాగా ఉన్నాయని ప్రచారంలో ఉన్నప్పుడు ఇలాంటి డిమాండ్లు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తాయి అనే ఉద్దేశంతోనే ఆ పార్టీ అధిష్టానం వీరిని పిలిచి కొంత మందలించినట్టు తెలిసింది.
ప్రజాస్వామికంగా చూస్తే ప్రతి వర్గానికి వారి జనాభా ప్రాతిపదిక మీద సాధికారత ఉండడం సమంజసమే. కానీ మొదటి నుండి ముఖ్యంగా స్వతంత్రం వచ్చిన తర్వాత భూస్వాములు, రాజరిక వర్గాల నుండి అగ్రవర్ణాల నుండి వచ్చిన వారే పెత్తనం కొనసాగించడం జరుగుతుంది. వారిలో నాయకత్వ లక్షణాలు నాయకులుగా ఎన్నిక అయ్యేందుకు కావలసిన వనరులు పుష్కలంగా ఉండేవి. అలానే చాలామంది ఇప్పటివరకు కూడా చాలా ప్రాంతాల్లో వారి పెత్తనం కొనసాగుతుంది
వీరి పాలన వల్ల వెనుకబడిన తరగతులకు ముఖ్యంగా షెడ్యూల్ కులాలు షెడ్యూల్ ట్రైబ్స్ వారికి సరియైన న్యాయం, అధికారంలో భాగం, వనరుల్లో ఉద్యోగాల్లో భాగం రాలేదనేది ఎన్నో సర్వేల వల్ల తెలిసిన విషయమే.
అగ్రవర్ణాల పాలనతో విసిగిపోయి, అన్యాయం, అధికార కేంద్రీకరణ, ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో, భరించరానంతగా ఎక్కువైపోయినప్పుడు, జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో సంపూర్ణ విప్లవం పేరుతో సామ్యవాద శక్తులు బీసీలకు అధికారం ఇచ్చేందుకు ఎంతో తోడ్పడ్డాయి. బీహార్లో, ఉత్తరప్రదేశ్లో బీసీల ఎస్సీల సాధికారత లభించింది.
దీని కారణంగానే కేంద్రంలో అగ్రవర్ణ చేతుల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు జనాభా ప్రాతిపదికన జనగణన చేయాలనే ప్రతిపాదనలను పట్టించుకోలేదు. ఈ మధ్యలో బీసీల పాలనలో ఉన్న బీహార్లో కులగణన చేస్తే, 63% బీసీలు ఉన్నారని లెక్క తేలింది. అయితే ఆ సర్వేలో మరి అధికారం ఏ బీసీ కులాల చేతిలో ఎంత ఉన్నది అనే విషయం మాత్రం లెక్కించలేదు.
అయితే ఆ రాష్ట్రాలలో సాధికారత వల్ల అదే వర్గానికి చెందిన వారిని అందరికీ సాధికారత లాభాలు సమకూర్చలేని కారణంగా, బీసీ సాధికారత లక్ష్యాలు సగం కూడా సాధించలేకపోయారు. బీహార్ ఉత్తరప్రదేశ్ లో అయితే అటు బీసీ పరిపాలన ఉన్నప్పుడు, ఎస్సీల పరిపాలన ఉన్నప్పుడు కూడా అగ్రవర్ణాల పరిపాలించినటువంటి సమయంలో ఉన్నటువంటి అవలక్షణాలే పరిపాలనలో కొనసాగాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం. కొన్ని బీసీ కులాల సాధికారత లభించిన తర్వాత, ఎక్కువ సంఖ్యలో ఉన్న అత్యంత వెనుకబడిన బీసీల సంక్షేమ నిర్లక్ష్యంగా కారణంగా వారిని సమీకరించి బిజెపి అధికారంలోకి వచ్చి తన మత ప్రాతిపదికన ప్రజలందరినీ తన అధికార శాశ్వతత్వం కోసం వాడుకుంటుంది. దీనికి కారణం బీసీల అనైక్యత కాదా. కాన్షిరామ్ అద్భుత ప్రయత్నం, విజయం కూడా ఈ కారణంగానే నీరు కారిపోయింది.
అయితే బీసీ పరిపాలనల వల్ల దేశంలో అభివృద్ధి సమానత్వ దిశగా సాధికారత దిశగా కొనసాగ లేదని చెప్పలేం. తమిళనాడులో కేరళలో బీసీ నాయకులు చాలా అభివృద్ధి చేశారు. ఎన్టీఆర్ పాలనలో కూడా బీసీలకు సమైక్యాంధ్రలో సాధికారత లభించింది. స్వాతంత్రం తరువాత 40 సంవత్సరాలు అగ్రకులాల కింద పనిచేస్తున్న బీసీ నాయకులు కొందరు స్వయంప్రత్తి కలిగి దేశంలో మహా నాయకులుగా వెలుగొందారు. కాకపోతే గ్రహించవలసిన ఒక విషయం ఏమిటంటే ఈ బీసీలలో వేల కొద్ది కులాలు ఉన్నాయి. కానీ మొత్తానికైతే ఇన్ని కులాలలో ఈ సాధికారత వల్ల అధికంగా లభ్యత పొందింది పైన ఉన్న మూడు నాలుగు కులాలే. బీహార్లో మధ్యప్రదేశ్లో యాదవులు, కర్ణాటకలో గౌడ్లు, తెలంగాణలో గౌడ్లు, యాదవులు, ముదిరాజులు కొంతవరకు సాధికారత పొందారు.
ఇది సాధారణంగా దేశంలో పరిస్థితి బీసీల సాధికారత గురించి అయితే, ఇక మన తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎలక్షన్లో రాబోతున్న దృష్ట్యా బీసీ సాధికారతరకు జరుగుతున్న ప్రయత్నాలు చేపట్టవలసిన కార్యక్రమాలు ప్రణాళికల గురించి ఒక విశ్లేషణ అవసరం.
నిజంగా బీసీలకు శాశ్వత సాధికారత కావాలనుకుంటే వారి జనాభా ప్రతిపదికన అది సాధ్యమే కానీ అందుకోసం వారు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తరువాత రిజర్వేషన్ల వల్ల గాని, ఆర్థిక సంస్కరణల వల్ల గాని బీసీలలో ఇప్పుడు ఎంతోమంది యువకులు యువతులు విద్యారంగంలో అత్యద్భుతాలు సాధించారు. ఆర్థిక రంగంలో కూడా ముఖ్యంగా కొన్ని కులాల వారు వ్యాపారంలో ఎంతో ఉన్నతి సాధించారు. వారందరూ బీసీ సాధికారతకు ఎంతో దోహదం చేయగల సామర్థ్యం ఉన్నవారు.
అత్యంత ముఖ్యమైనది ఏమిటి అంటే బీసీలలో ఉన్న అన్ని కులాల వారు ఒక తాటి కిందికి రావాలి. ఒక నాయకుని, మీద గురి ఉండాలి. అందర్నీ ఒక తాటి కింద తెచ్చినటువంటి నాయకుడిని ఎన్నుకోవాలి. చాలాకాలంగా కృష్ణయ్య బీసీల అందరిని సమీకృతం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనకు బీసీల స్థితిగతుల గురించి తరాలుగా ప్రణాళికాబద్దంగా జరుగుతున్న అన్యాయాల గురించి లోతైన అవగాహన ఉంది. వాటిని అధికమించేందుకు ఉద్యమాలు చేస్తున్నాడు. కానీ అన్ని బీసీ కులాల ప్రజలు, ముఖ్యంగా ఇంతవరకే కొన్ని బీసీ కులాల నుండి ఆర్థిక రాజకీయ సాధికారత పొందిన నాయకులు ఆయన యొక్క నాయకత్వాన్ని ఆమోదిస్తారా అన్నది సంశయాత్మకమే. ఆయన గాని వేరే ఎవరైనా ఒక నాయకుడు గానీ అవసరం. బహు నాయకత్వం వల్ల ఎప్పుడు సాధికారత ప్రజాస్వామ్యంలో రాదు.
నిజంగా బీసీలకు సాధికారత కావాలంటే ప్రస్తుతం బీసీలలో రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఉన్నత స్థాయికి పోయినటువంటి గౌడ్లు యాదవులు ముదిరాజులు పద్మశాలీలు వారి బీసీలలో మేము గొప్ప అని అటువంటి ఆధిపత్య ధోరణి వదలాలి. ఇప్పుడు అధికారాలనుభవిస్తూ ఉన్నటువంటి వివిధ పార్టీలలోని నాయకులంతా ఆ పార్టీలకు రాజీనామా, చేసి బీసీలకు సంబంధించిన ఒక పార్టీని స్థాపించి, అందులో అన్ని బీసీ కులాల వారికి సమానంగా సీట్లు పంచి బీసీ ఉద్ధరణకు అన్ని బీసీ కులాల ఉద్ధరణకు ఒక ప్రణాళిక వారి యొక్క ఆర్థిక స్థితిగతుల సమాచార విశ్లేషణ ఆధారంగా చేపడితే, తప్పకుండా వారికి సాధికారత లభిస్తుంది ఒకసారి ప్రయత్నంలో లభించకపోవచ్చు. కానీ అలాంటి ఒక రాజకీయ అవకాశం(political space)ఉంది అనేది నిర్వివాదాంశం.
కానీ అలాంటి ప్రయత్నం ఇప్పటివరకు జరగలేదు. ప్రతి పార్టీలో ఉన్న బీసీ నాయకులు మాకు ఇన్ని సీట్లు కావాలి అని కొట్లాడిన వారే కానీ, వారందరికీ అందర బీసీల ఉద్ధరణ ఉద్దేశం ఉందని చెప్పలేం.
బీసీ కులాల నుండి వచ్చిన వీరందరూ కూడా అధికారంలో ఉన్నప్పుడు వారి కులాల వారికి సహాయం చేసుకున్న వారే గాని, మిగతా వెనుకబడ్డ బీసీ కులాలను ఆదరించిన దాఖలాలు లేవు. కానీ అగ్రకుల పాలకులు వారి యొక్క పరిపాలన శాశ్వతం చేసుకునేందుకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఇతర వెనుకబడిన మైనారిటీలకు ఏదోరకంగా ఎంతోకొంత వారికి జరిగిన అన్యాయం వారిని ఎదురు తిరిగేటట్టు చేయకుండా, ఉపశమన రూపంలో, ప్రణాళిక బద్ధంగా సహాయం కార్యక్రమాలు చేపట్టిన ఆధారాలున్నాయి
అయితే అగ్ర కులాల పరిపాలనలో బీసీల సాధికారత ఎంత చేసినా అది కావలసినంత దానికన్నా చాలా తక్కువే అనేది నిజం.
ఇప్పటికీ అయినా బీసీలు ఒక తాటి కిందికి వచ్చి, పార్టీని నిర్మించి, అందరూ కలిసికట్టుగా ఒక ఉన్నత భావాలతో, సమ సమాజ నిర్మాణం కోసం, అత్యంత వెనుకబడిన వర్గాల హక్కుల పరిరక్షణ కోసం, వాతావరణ పరిరక్షణ కోసం, అధికార వికేంద్రీకరణ కోసం, వికేంద్రీకృత ఉత్పాదత కోసం ప్రయత్నిస్తే అది సాధ్యమే కానీ నా దృష్టిలో వీరంతా ఒక తాటి కిందికి రాగలరు అనేది కష్టమైన పని. అందుకే అగ్రకుల పరిపాలన కొనసాగుతుంది ఇక ముందు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కానీ బీసీల రాజకీయ ఆర్థిక సాధికారత అసాధ్యం కాదు. అగ్రకులాల్లేని పాలకుల పాలనలో తమిళనాడులో సాధించిన అభివృద్ధి వీరికి మార్గదర్శకంగా ప్రోత్సాహకంగా ఉంది.
ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో రెండు మూడు అగ్రకులాల, కుల పిచ్చి కారణంగా పాలన అకలావికలమైపోయి, అక్కడి కిందివర్గ ప్రజల యొక్క దారిద్రం, సాధికారిత అవకాశాలు శాశ్వతంగా దూరమవుతున్నాయి.
తెలంగాణలో ఇప్పుడు బీసీలు అంతా వారి కుల వైషమ్యాలను వీడి కేవలం ఆర్థిక పరమైన అంశాలనే చేపట్టి ఆర్థికంగా సామాజికంగా అందర్నీ సమాన దృష్టితో చూసే అటువంటి ఆదర్శంతో కనుక బీసీ నాయకులు ముందుకు సాగితే దేశానికి వీరు మార్గదర్శకం కావడమే కాకుండా దేశంలో ఒక కొత్త యుగ స్థాపన జరగవచ్చు.
డాక్టర్ ఎంహెచ్ ప్రసాద్ రావు
9963013078
KPHB colony 6th phase
Sri Ranga Vihara apartments
402
Hyderabad
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box