Delayed justice is
Denied justice..
అది తీర్పే..
కానీ ఏముంది మార్పు..
ముప్పై ఏళ్ల పోరాటం..
ఎన్ని ప్ర"దక్షిణలు"..
ఇంకెన్ని తర్పణలు..
వయసులు ఉడిగి..
మనసులు విసిగి..
ఇప్పుడొస్తే తీర్పు..
అది న్యాయదేవతకే ఏమార్పు..!?
ఎప్పటి సంగతి..
1992లో జరిగిన దమనకాండ..
పద్దెనిమిది మంది
అభాగ్య వనితలు..
అన్నెం పున్నెం ఎరుగని
అమాయక నిరక్షరాస్యులు..
నిజమే..కొందరి ఇళ్లలో
దొరికిందేమో చందనం..
అందుకా ఇంత నరకం..!
పోలీసుల వేధింపులు..
అధికారుల సాధింపులు..
ఇక్కడ తాకి..అక్కడ గోకి..
వికృత చేష్టలు..
పరాకాష్టగా మానభంగాలు..
ఒకసారి..రెండుసార్లు కాదు..
రోజుల తరబడి..
మృగాల్లా కలబడి..!
పద్దెనిమిది మంది ఆడపడచులపై..
215 మృగాలు..
ఇష్టం వచ్చినట్టు..
ఎక్కడ పెడితే అక్కడ..
ఎప్పుడు నచ్చితే అప్పుడు..
పోలీసులే రేపిస్టులైతే..
అధికారులూ కామాంధకారులుగా మారితే
ఇంకెక్కడి న్యాయం..
కోర్టుకెక్కితే ఏళ్ల తరబడి
సాగదీత..
ఫాయిదాలు లేని వాయిదాలు..
ముప్పై ఏళ్లకు ఇప్పుడొచ్చింది తీర్పు..
నిందులకు జైలుశిక్ష..
బాధితులకు పరిహారం..!
అయితే..అయితే..
Delayed justice is
Denied justice..
మూడు దశాబ్దాలు..
కాళ్ళరిగేలా తిరుగుళ్ళు..
ఠానాలు..కోర్టుల చుట్టూ
నాటి అమ్మాయిలు
నేడు ముసలమ్మలు..
పోయిన శీలాలు..
బలైన బ్రతుకులు..
సమాజంలో ఎన్ని అవమానాలు..
చీదరింపులు..
ఎన్నెన్ని బెదరింపులు..
హుంకరింపులు..
బ్రతుకు ధైన్యమై..
భవిత శూన్యమై..
ఇన్నాళ్ళకి దక్కింది న్యాయమా..
ఈ తీర్పు ఊరటా..
ధర్మానికి బాసటా...
న్యాయవ్యవస్థకు గౌరవమా..
మళ్లీ మరో కోర్టు..
మరింత జాప్యం..
ఇదేగా విధం..
మన వ్యవస్థ విధానం..!
దీనంతటికీ సాక్షిగా
నిలబడిన గీత
ఆపగలిగిందా ఆలస్యాన్ని..
వ్యవస్థల అపహాస్యాన్ని..!
(అసలు వార్త ఇది..
18 మంది మహిళలపై రేప్.. 31 ఏళ్ల నాటి కేసులో 215 మంది ప్రభుత్వ
ఉద్యోగులకు శిక్ష..
బాధ్యతాయుత ఉద్యోగంలో ఉన్న వ్యక్తులే నరరూప రాక్షసులుగా మారి
18 మంది మహిళలపై
లైంగిక వేధింపులకు..
అత్యాచారానికి తెగబడ్డారు.ఈ కేసు 1992 నాటిది కాగా.. 31 ఏళ్ల తర్వాత మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది.
ఈ ఉదంతం తమిళనాడులో జరిగింది.1992లో తమిళనాడులోని ధర్మపురి జిల్లా కల్వరాయన్ కొండ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంలో వాసాత్తి అనే గ్రామంలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే భారీగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. 1992 జూన్ 20 వ 155 మంది అటవీ సిబ్బంది, 108 మంది పోలీసులు, ఆరుగురు రెవెన్యూ శాఖ అధికారులు కలిపి మొత్తం 269 మంది
ఆ గ్రామాన్ని చుట్టుముట్టారు. ప్రతి ఇంటికీ వెళ్లి తనిఖీలు చేశారు. ఆ సోదాల్లో కొన్ని ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటికి సంబంధించి 90 మంది మహిళలు, 43 మంది పురుషులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎర్రచంద్రనం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయారని భావించిన ఆ ప్రభుత్వ అధికారులంతా ఆ గ్రామస్థులకు నరకం చూపించారు. ఆ గ్రామంలో ఉన్న 18 మంది గిరిజన మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.బాధితులు ఆరూర్ పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులపై కేసు నమోదు చేసేందుకు వారు నిరాకరించారు. దీంతో ఇలా తమకు న్యాయం జరగదని భావించిన బాధితులు ఏకంగా సుప్రీంకోర్టు గడప తొక్కారు.నిందితులందరిపై కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.సుప్రీంకోర్టు మొట్టికాయలతో కేసు నమోదు చేసినా విచారణ మాత్రం ముందుకు సాగలేదు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బాధితులు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. చివరికి 1995 ఫిబ్రవరి 24 వ తేదీన ఈ కేసును ధర్మాసనం సీబీఐకి బదిలీ చేసింది. ఈ క్రమంలోనే దర్యాప్తు జరిపిన సీబీఐ అధికారులు వాసాత్తి గ్రామంలో విధ్వంసం సృష్టించిన మొత్తం 269 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో 2011 సెప్టెంబరు 29 వ తేదీన ధర్మపురి జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. అయితే అప్పటికే నిందితుల్లో కొంతమంది చనిపోవడంతో తీర్పు వెలువరించేనాటికి బతికి ఉన్న 215 మందిని దోషులుగా తేల్చి వారికి శిక్షలు విధించారు. ఈ 215 మంది దోషుల్లో 12 మందికి పదేళ్ల జైలు, ఐదుగురికి ఏడేళ్లు, మిగిలిన వారికి ఏడాది నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించారు న్యాయమూర్తి. అయితే ధర్మపురి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన నిందితులు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేల్‌మురుగన్ ఈ కేసుకు సంబంధించి తీర్పును వెలువరించారు. ఈ కేసులో 215 మందికి జైలుశిక్ష విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. దీంతోపాటు 18 మంది బాధిత మహిళలకు ఒక్కొక్కరికీ
10 లక్షల పరిహారం అందించాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఇందులో ఐదు లక్షలు నిందితులు.. మరో ఐదు లక్షలు ప్రభుత్వం నుంచి వసూలు చేయాలని కోర్టు స్పష్టం చేసింది. ఇక ఈ ఘటన జరిగిన సమయంలో విధుల్లో ఉన్న ధర్మపురి జిల్లా కలెక్టర్, ఎస్పీ, అటవీ శాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని
తేల్చి చెప్పింది.)
ఇ సురేష్ కుమార్
జర్నలిస్ట్
9948546286
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box