ఎన్నికల వేళ, ప్రజాస్వామ్య హేల.. ప్రసాదరావు

 ఎన్నికల వేళ, ప్రజాస్వామ్య హేల 


ప్రజలు ఓట్లు వేసి మళ్లీ ప్రభుత్వాన్ని ఎన్నుకునే రోజు దగ్గర పడింది. ఓట్లు ఎవరికి వేయాలి అని ప్రజలు, ఓట్లు ఎలా అడగాలి అని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఆలోచించే సందర్భం. ఈ రెండు అంశాలు కూడా పరస్పరాధారితం. వీటి మధ్య ఉన్నటువంటి సంబంధాల్ని ప్రస్తుత పరిస్థితులకు అన్వయించి ఓక విశ్లేషణ.

ముందు ప్రజలు ఎవరికి ఓట్లు వేయాలి అనే విషయం గురించి ఆలోచిద్దాం. మన ఓటర్లలో వ్యక్తిగత విషయాల వ్యక్తిగత ఆలోచన ల దృష్ట్యా ఓట్లు వేసేవారు చాలా తక్కువ. ఓట్లు ఎవరికి వేయాలి అనే విషయం ఒక పెద్ద ప్రశ్న. ఎలక్షన్లో నిలబడే ప్రతి నాయకుడు కూడా ప్రజా ఆమోదంతో నిలబడే వాడు కాదు. అంతకుముందు ప్రజలల్లో ఉండి ఎన్నుకున్న పడ్డవాళ్ళు లేదా వేరే ప్రాంతాల్లో నాయకత్వం వహించి ఇప్పుడు నిలబడి స్థానం స్థానంలో ఏదో ఒక పార్టీ టికెట్ ఇచ్చినవాళ్లు. 

ప్రజలు ఎలాంటి వారిని ఎన్నుకునే విషయంలో రెండవ అభిప్రాయం లేదు. ఓట్లు అడిగే వ్యక్తి నిజాయితీపరుడైయుండి, అంతకుముందు ప్రజాసేవ చేసి ఆ ప్రజా సేవ చేసిన ఆధారాలు చూపెట్టగలిగి, ప్రజాసేవలో ఆయనకు ప్రశ్నించ లేనటువంటి, సేవా ఫలితం కనిపించి నిరూపించే గల నిదర్శనాలు ఉంటే వారిని ఎన్నుకోవాలి. అంతేకాకుండా ఆ వ్యక్తి తాను నాయకత్వం వహించిన ఈ గత ఐదు సంవత్సరాలు గాని అంతకన్నా ఎక్కువ సమయంలో గానీ ఎంతవరకు అభివృద్ధి చేయగలిగే అవకాశం ఉందో అంత చేశాడా లేదా అనే విషయాన్ని కూడా ఓటర్లు దృష్టిలో పెట్టుకోవాలి. కానీ ఇంత విచక్షణతో ఓటర్లు ఓట్లు వేస్తున్నారా అనేది సంశయాత్మకం. అది ఓటర్ల బలహీనత కాదు. వారికి ఈ విషయాలన్నిటిని తెలియజేసే అటువంటి సంస్థలు గాని, ప్రభుత్వ యంత్రాంగం గాని, ఇంతవరకు అధికారంలో ఉన్నవారు గాని తెలియ చేసే అటువంటి పారదర్శక వ్యవస్థ మన దేశంలో ఎక్కడా లేదు. ఉదాహరణకి ప్రతి నివాస స్థలంలో, అది గ్రామమే కావచ్చు, నగరమే కావచ్చు, నగరంలో ప్రతి వార్డు కావచ్చు, సమస్యలు ఎలక్షన్ల ముందు ఏమేమి ఉన్నాయి, ఆ నివాస స్థలంలో ఎంతమందికి సహాయం అవసరము, ఎలాంటి అభివృద్ధి అవకాశాలు ఉన్నాయి అనేటువంటి ఒక ఎజెండాను ముందే తయారు చేస్తే అప్పుడు ఓటర్లు వాటిని సాధించడంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న నాయకుడు ఎంతవరకు అభివృద్ధి సాధించాడు లేదా ప్రతిపక్షంలో ఉన్నవాళ్లు ఆ ఎజెండాను ఎందుకు సాధించలేదు వారు ఏ విధంగా సాధించగలరు చెప్పగలిగితే అప్పుడు ఓటర్ల యొక్క ప్రజాస్వామిక హక్కును ఏ కుల ప్రాతిపదికనో, మత ప్రాతిపదికనో కాకుండా ప్రజాస్వామ్య విలువల ప్రకారం ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి వ్యవస్థ మన దగ్గర పైపై వ్యవహారంగానే ఉంటుంది కానీ ఒక నిర్దృష్టమైనటువంటి గణాంకాల సహితంగా, ఒక విధానపరంగా అందరికి అర్థం అయ్యే పద్ధతిలో ఉండదు. ఎందుకంటే అలా ఉంటే ప్రజలకు ప్రశ్నించే సామర్థ్యం పెరిగి వారిని ఇతర ప్రలోభాలతో ప్రభావితం చేసే అవకాశం ప్రస్తుత నాయకులు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు గాని అధికారంలో ఉన్నవారు గానీ, చేయడం లేదు. చేయరు.

కానీ ప్రస్తుతం పార్టీలు ఓట్లు అడిగే విషయంలో ఎక్కువగా ఉచితాలకు ప్రాముఖ్యత ఇస్తున్నాయి. ఎందుకంటే ప్రజలు ముఖ్యంగా ప్రస్తుతం, త్వరగా అందగలిగే లాభాల గురించి ఆలోచిస్తారు కానీ దీర్ఘకాలిక శాశ్వత అభివృద్ధి అవసరాల గురించి ఆలోచించరు, ఆలోచించే సామర్థ్యాలు, పైన వివరించినట్టుగా నిజ గణాంకాల సమాచార వ్యవస్థ అనే వనరు వారికి అందుబాటులో ఉండదు. ఇలాంటి పని చేయగలిగే సాంఘిక సంస్థలు కొన్ని ఉంటాయి. ఇవే సామాజిక, ఆర్థిక, పర్యావరణ, వివిధ ప్రజల వర్గాల హక్కుల విషయంలో ప్రభుత్వ నిర్వహణ పద్ధతులను విశ్లేషణ చేసి ప్రజల యొక్క అవగాహన పెంచి వారిని ఓటు హక్కును సమర్ధవంతంగా నిర్వహించే దిశలో నడిపేందుకు ప్రయత్నాలు చేస్తాయి. ఇలాంటి పని కొన్ని వందల సామాజిక సంస్థలు కర్ణాటకలో ప్రజాస్వామ్య రక్షణలో ప్రజాస్వామ్య విలువల దృఢత్వాన్ని పెంచే ప్రయత్నం చేశాయి. కానీ మన దగ్గర ఇలాంటి సంస్థలు ఎన్నో ఉన్నప్పటికీ ఎంతో చేస్తున్నప్పటికీ వాటి యొక్క ప్రభావం ప్రజల మీద చాలా తక్కువగా ఉంది. ఇలాంటి సంస్థలన్నీ ఏకతాటి కింద కావచ్చు సమన్వయంగా ప్రయత్నిస్తే, ప్రజలు నాయకుల్ని ఎన్నుకునే విధానంలో మంచి మార్పులు వస్తాయి.

ఇప్పటికీ మన రాజకీయ పార్టీలు కుల ప్రాతిపదిక మీద మత ప్రాతిపదిక మీద ఓట్లు అడిగే పరిస్థితి ఉన్నది. ఇప్పటి ఆర్థిక సామాజిక పరిస్థితులలో ప్రజలంతా వారిని వారి వృత్తి పరంగా గుర్తించుకుంటారు గాని ఈ కులమత ప్రాతిపదిక మీద కాదు. కానీ అన్ని సమాచార రంగాల్లో అన్ని పార్టీలు కూడా ఈ కుల మతాల గుర్తింపునే శాశ్వతంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే ఈ విధంగా విడిపోయిన ప్రజల్ని ప్రలోభాలకు సులభంగా గురి చేయవచ్చు. కానీ ప్రజాస్వామ్యం నిజంగా వర్ధిల్లాలి అంటే ప్రజలకు అభివృద్ధి పేరు మీద సమాచారాన్ని అందించేటువంటి ఒక వ్యవస్థను కావాలని ఎందుకు కల్పించరంటే, వారి యొక్క స్వీయ ప్రలోభాల వల్ల అంత సమర్ధమైనటువంటి పాలన అందించడం సాధ్యం కాకనో లేక ఇష్టం లేకనే, లేక ఇలాంటి వ్యవస్థలో పరిపాలన సులభం కాబట్టి వారి యొక్క స్వీయ స్వార్ధ ప్రయోజనాలకు అనుకూలంగా ఉంది కాబట్టో ఇలాంటి అసహెతుక ప్రజాస్వామ్య చట్రాన్ని కాపాడుతుంటారు.

సాధారణంగా ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి పార్టీలు కులమత అంశాలపై ఎక్కువ ముగ్గు చూపుతున్నాయి. రకరకాల కులాల వారు మాకు ఎన్ని సీట్లు కావాలని అడగడం. ఆ కులాలకు చెందిన నాయకులు కూడా వారికి జనాభా ప్రతిపదికంగా సీట్లు కావాలని అడగడం ఎక్కువగా మనకు వినబడుతుంది. ఇది ప్రజలు సరియైన నాయకుల్ని ఎన్నుకునేందుకు కావలసిన ప్రాతిపదిక కానే కాదు.

అసలు నిజంగా ప్రజల అభివృద్ధి కుల మతాలపై కాక వారి యొక్క చేసే పనులపై వృత్తులపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వాలు ఈ కులమత విషయాలను విస్మరించి వృత్తుల ఆధారంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ప్రజాస్వామ్యాన్ని ఇంకా బలపరిచిన వారవుతారు. మన రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా వృత్తుల ఆధారంగా విభజించ వచ్చు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రొఫెషనల్ అంటే ప్రైవేట్ ప్రాక్టీస్ చేసే డాక్టర్లు, ఇంజనీర్లు, చిన్న తరహా వ్యాపారస్తులు, పెద్ద వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు, నైపుణ్యాల ఆధారంగా అసంఘటిత రంగంలో పనిచేసేవారు. అన్ని వృత్తులలో ప్రభుత్వ విధానాలు వెనుకబడిన వారిని దృష్ట్యాబెట్టుకుని కనుక ఏర్పరిస్తే వారి అభివృద్ధి చేస్తే , ఆర్థిక సామాజిక సమానత్వం వచ్చి ఈ కులమత వైశ్యామ్యాలు దీర్ఘకాలంలోనైనా వైదొలగి ప్రజాస్వామ్యం కూడా ఫరిడావిల్లే అవకాశాలు మెరుగవుతాయి. 

ఉదాహరణకి ప్రభుత్వ ఉద్యోగులు పెద్దపెద్ద చదువులు చదివిన డాక్టర్లు ఇంజనీర్లు బడా వ్యాపారస్తులు వీటి గురించి ప్రత్యేకంగా చేయవలసింది ఏమీ లేదు. ఇతర అసంఘటిత వృత్తులు చేసే అటువంటి వారు, వ్యవసాయదారులు వీరిపై ఎక్కువగా శ్రద్ధ చూపాలి. ఇప్పటి వరకే సౌకర్యమైనటువంటి జీవితం గడిపే వారి కోసం వెచ్చించే బడ్జెట్, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలకు వెచ్చించే బడ్జెట్, మానవ ఆధారిత అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించే బడ్జెట్కు మధ్యన ఒక సమతుల్యత ఉండేలా విధానాలు ఏర్పరచాలి. ఇలాంటి సమతుల్యత కొంతవరకు టిఆర్ఎస్ ప్రభుత్వంలో సాధించినప్పటికీ ఇంకా ఎంతో సాధించాల్సిన అవసరం ఉంది. వృత్తులే అభివృద్ధి దోహకాలు. కులాలతో మతాలతో అభివృద్ధి ఎన్నటికీ జరగదు. కాబట్టి వృత్తి ఆధారిత విధానాలు చేపట్టాలి. వృత్తులు చేపట్టే వారికి ప్రోత్సాహకాలు అందిస్తే వారి యొక్క ఉత్పాదకత పెరిగితే దేశం అభివృద్ధి చెందుతుంది. అభివృద్ధి నిరోధకాలైనటువంటి కులమత ప్రేరిత సంఘర్షణలు తగ్గిపోతాయి.

ఏ రంగాలలో వృత్తిపరమైనటువంటి మానవ కేంద్రీతమైనటువంటి అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయో అలాంటి వాటిని ప్రజలకు తెలియజేస్తూ పార్టీలు ఓట్లు అడగాలి, ప్రజలు కూడా అలాంటి సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని ఓట్లు వేయాలి. కుల మత ఆధారిత కార్యక్రమాల నుండి ప్రభుత్వాలు దూరం కావాలి. ఇది రాజరికం కాదు. ఇప్పుడు ఎన్నుకొన పడ్డ నాయకులు వారి పేరు చరిత్రలో నిలిచేందుకు చేసి అటువంటి ప్రజా ధన దుర్వినియోగాన్ని ఆపాలి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్యం. ప్రజాప్రగతి ముఖ్యం. గుళ్ళు గోపురాలు పెద్ద పెద్ద కట్టడాలు విగ్రహాలు కాదు. వాటిపై పెట్టే డబ్బుతో నిరుద్యోగులకు ప్రజాహిత కార్యక్రమాల్లో ఉద్యోగాలు ఇల్లు లేని వాళ్లకు ఇల్లు నాణ్యమైన ఉచితమైన వైద్య విద్యా సౌకర్యాలు ఎన్నో కల్పించవచ్చు. అలా చేయగలిగిన వారిని ప్రజలు ఎన్నుకోవాలి. అలా చేయగలమన్నవాళ్లే ఓట్లు అడగాలి.

డాక్టర్ ఎంహెచ్ ప్రసాదరావు

99 63013078 కేపిహెచ్బి 6 ఫేజ్

హైదరాబాద్

ఫ్లాట్ నెంబర్ 402 శ్రీరంగ విహార అపార్ట్మెంట్స్

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు