నూతన యుగం ప్రవక్త -పెరియార్ స్పూర్తితో బానిసత్వం వీడాలి
ఏ వ్యవస్థ ఆయినా పీడిత ప్రజల్ని ఎంత క్రూరంగా అవమానించి, హింసించి, అణచివేస్తుందో అంతగా ఆ వ్యవస్థ పట్ల కోపాన్ని, ద్వేషాన్ని, కసిని పెంచుకోనిదే పీడుతులకు ఎన్నడూ ఎక్కడా న్యాయం జరగలేదన్నది చారిత్రక సత్యం. అలాంటి సామాజిక స్ఫూర్తిని, ప్రేరణని కల్పించిన సమరశీల మార్గదర్శకులు పెరియార్. తెలుగువారికి బాబాసాహెబ్, పూలే గురుంచి తెలిసినంతగా పెరియార్ గురుంచి తెలియదు. దక్షిణ భారతదేశంలో 19-20 శతాబ్దాల మధ్య కాలంలో ఒక వైపు బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకులను ఎదిరిస్తూ మరోవైపు బ్రాహ్మణీయ ఆధిపత్య కులాల నుండి సంపూర్ణ విముక్తి విమోచన కోసం దళిత బహుజనులలో, స్త్రీలలో స్వాభిమాన చైతన్యం కల్పిస్తూ స్వేచ్ఛ కోసం, సామాజిక సమానత్వం కోసం అపూర్వ కృషి సల్పిన వారిలో మహాత్మ జ్యోతిరావు పూలే, బి.ఆర్. అంబేడ్కర్, పెరియార్ ప్రసిద్ధులు.
పెరియార్ సాంస్కృతిక విప్లవం, సామాజిక సందేశం దక్షిణాది తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ జాతీయులందరికి ఉద్దేశించినది. ఆయన మాటలు, రాతలూ అక్షరాల్లో ముద్రించగలుగుతే కనీసం 50 పెద్ద సంపుటాలవుతాయి. గణిత శాస్త్రవేత్త వసంతా కందసామి పెరియార్ ఉద్యమాన్ని లెక్కల్లో అభివర్ణించిన తీరు చూస్తే ఆయన ఉద్యమ ప్రస్థానం అర్ధమవుతుంది. "తన 94 సంవత్సరాల 3 నెలల 7 రోజుల జీవితకాలంలో ఆయన ప్రచార కార్యక్రమాల కోసం 8,20,000 మైళ్ళు ప్రయాణించారు. ఇది భూగోళపు చుట్టుకొలత కన్నా 33 రెట్లు ఎక్కువ. భూమికి చందమామకు మధ్య గల దూరానికి 3 రెట్లు. ఆయన మొత్తం 10,700 సభలు, సమావేశాల్లో ప్రసంగించారు. తన జీవితకాలమంతా ఇచ్చిన ప్రసంగాల కాలం 2,34,000. ఇవేగాని కేసెట్లలో రికార్డు చేసి విడవకుండా వినిపించితే 2 సంవత్సరాల 5 నెలల 11 రోజులు పడుతుంది. తన మొత్తం ఉద్యమ చరిత్రలో వివిధ సందర్భాలలో 10 సంవత్సరాల కాలం జైలు జీవితం అనుభవించాడు.
దళితుల కోసం, పీడిత జనుల కోసం జీవితకాలం ఉద్యమం చేసిన పెరియార్ ధైర్య సాహసాలు కలిగిన మేధావి. ఆయన సంపన్న కుటుంబంలో పుట్టి విలాసవంతమైన జీవనం గడిపే అవకాశమున్నా అణగారిన ప్రజల కోసం, స్త్రీల కోసం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం సమసమాజ స్థాపన కోసం అలుపెరుగని పోరు చేసినారు. మనిషికి మనిషికి మధ్య హెచ్చు తగ్గులను, అసమానతలను పెంచే కులాన్ని నిర్మూలించాలని, కుల అసమానతలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పెరియార్ ముఖ్యులు. మానవుల మధ్య ప్రతి అసమానతకు, ప్రతి అణచివేతకు, ప్రతి అవమానానికి కులం ఏ విధంగా కారణమైందో పెరియార్ పరిశోధనాత్మకంగా వివరించడమే కాకుండా ఆ అణచివేతల నుండి బయట పడడానికి ఆచరణాత్మక ఉద్యమం చేసాడు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో అభివృద్ధికి కులం ఎలా అడ్డుకట్ట వేస్తుందో పెరియార్ పోరాటాల ద్వారా గ్రహించగలం. మనుధర్మం ప్రభోధించిన వర్ణాశ్రమ ధర్మాలను, దేవున్ని అడ్డుపెట్టుకొని ఆధిపత్య కులాలు ఏర్పరచుకున్న నీచ, నికృష్ట పాలనా వ్యవస్థ కుట్రలను పెరియార్ బయట పెట్టారు.
దేశభక్తుల రూపములో ఉన్న మనువాదుల చాణుక్య నీతిని బయటపెట్టిన పెరియార్ ఒకజాతి, ఒక వర్గం వెనుకబాటుతనానికి ఇతరుల అణచివేతతో పాటు ఆ జాతి ప్రజల్లో ఉన్న బానిసత్వ లక్షణం కూడా కారణమవుతుందన్నారు. బ్రాహ్మణ అగ్రవర్ణాలపై పోరు చేస్తూనే బహుజన ప్రజల చైతన్యం కోసం నాస్తికత్వాన్ని ఆయుధంగా చేసుకొని పోరాటం చేశారు. అందరూ గొప్పగా చెప్పుకునే గాంధీకి ఎలాంటి చరిత్ర అధ్యయనం, జ్ఞానం లేదని, సామాజిక దృక్పధం లేని ఒక పామరుడుగా వర్ణించిన పెరియార్ గాంధీ మద్దతిస్తున్న వర్ణ వ్యవస్థను ద్వంసం చేయకుండా బహుజనులకు విముక్తి జరగదని తెలిపారు. ఆ వర్ణ వ్యవస్థకు మూలమైన హిందూ మతం పోయి కులాలు అంతమైనప్పుడే పీడిత ప్రజలు మానసిక బానిస సంకెళ్లను తెంచుకోగలరని భోధించారు. అంటరానితనాన్ని పాటించిన ప్రముఖ దేశభక్తులందిరిని ప్రశ్నించిన ధైర్యశీలి పెరియార్. బ్రిటిష్ కాలం లోనే " నేటి రాజ్యం ఎందుకు నశించాలి" అని సంపాదకీయం రాసి న్యాయమూర్తి ముందు సైతం అంతే ధైర్యంగా వాదించి బహుజన ప్రజల ఆశాజ్యోతి గా నిలిచారు. దళిత హక్కుల కోసం పోరాడుతున్న అంబేడ్కర్ కు వ్యతిరేకంగా గాంధీ నిరాహార దీక్షకు పూణుకోవడాన్ని వ్యతిరేకించిన పెరియార్ గాంధీని జీవితాంతం దళితుల పాలిట శత్రువుగా భావించారు.
*తొలి మానవ హక్కుల పోరాటం: వైక్కోమ్*
కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లాలో "వైక్కోమ్" అనే చిన్న పట్టణములో ఉన్న పురాతన శివాలయం ముందు నాలుగు వీధుల గుండా అంటరాని కులస్తులు నడవకూడదనే నిషేధాన్ని ఎత్తి వేయాలని కేరళ రాష్ట్రంలోని సంఘ సేవకులు సత్యాగ్రహం ప్రారంభించారు. సత్యాగ్రహంలో పాల్గొన్న నాయకులందరిని అక్కడి ప్రభుత్వం చెరసాలలో వేయగా అక్కడి మిగతా నాయకులు పెరియార్ ను ఆహ్వానించి సత్యాగ్రహం కొనసాగించాలని కోరగా పెరియార్ కేరళకు వెల్లి సత్యాగ్రహం కొనసాగించారు. ఆయన సత్యాగ్రహానికి దేశవ్యాపిత మద్దతుతో పాటు విరాళాలు కూడా ఇచ్చారు. పెరియార్ పట్టుదలను చూసిన అక్కడి పాలకులు సత్యాగ్రహంలో జోక్యం చేసుకోవాలని గాంధీని కోరారు. 1925 మార్చి 9న వైక్కోమ్ చేరుకున్న గాంధీ పెరియార్ ను కలిసి సత్యాగ్రహాన్ని విడనాడాలని కోరారు. దానికి పెరియార్ ఇలా బదులిచ్చారు. "గాంధీ గారూ సత్యాగ్రహాన్ని నిలిపేయమంటున్నారు సరే వైక్కతప్పన్ వీధిలో కుక్కలు, పందులు, పశువులు, గాడిదలు నడుస్తాయి. ఇవన్నీ సత్యాగ్రహం చేసే వాటి హక్కుల్ని సాధించుకున్నాయా? కానీ సాటి మనుషులు మాత్రం వీధుల్లో నడవడానికి సత్యాగ్రహాలు చేస్తుంటే వాటిని విరమించుకోమని అంటున్నారే మీరు. బాగుందా? గాంధీ కాసేపు మౌనం వహించి వీధులల్లో ప్రవేశం ఇస్తే గుడిలోకి ప్రవేశం కోసం పోరాటం చేస్తే ఎట్లా? అని అడిగాడు. దీన్ని బట్టి అందరూ మహాత్ముడుగా పిలిచే గాంధీ దళిత వ్యతిరేకి అని తెలుసుకోవాలి. అంతిమంగా వైక్కోమ్ వీధుల గుండా శూద్రులు నడిచే హక్కు సాధించి మానవ హక్కుల తొలి విజయాన్ని పెరియార్ సాధించారు.
కాంగ్రెస్ విధానంపై విసిగుచెందిన పెరియార్ ఆ పార్టీ నుండి బయటకు వచ్చి ప్రారంబించిన స్వాభిమాన ఉద్యమంలో దళితులను, స్త్రీలను పాత్రధారులను చేసి వేలల్లో కుల వ్యతిరేక వివాహాలు జరిపించారు. స్వాభిమాన ఉద్యమం విజయం సాధించాలంటే స్త్రీల పాత్ర అవసరమని గుర్తించిన పెరియార్ సమాజములో సగబాగమైన స్త్రీలకు అంతే స్థాయిలో అవకాశాలు ఉండాలని స్త్రీల స్వాభిమానం - స్వేచ్ఛ గూర్చి, స్త్రీల అణచివేతకు గురికావడానికి ప్రధాన కారణమైన మత విశ్వాసాలు, దైవ భావాలు, పురుషాహంకారం పట్ల స్త్రీలను చైతన్యం చేశారు. స్త్రీలు మానసిక బానిసత్వాని వీడిన నాడే సమానత్వాన్ని సాధిస్తారని, పురుషుడు లేకుండా స్త్రీ బ్రతకలేదని ప్రతి స్త్రీ అనుకుంటోందని అదే సమయములో స్త్రీ లేకుండా పురుషుడు జీవించగలడని ఆమె అనుకుంటోంది. తరతరాలుగా ఇలాంటి బానిస భావాలు లోతుగా పాతుకుపోయిన మత వ్యవస్థలో పెరిగిన స్త్రీలు తమ సంకెళ్లను తామే తెంచుకోవాలని పెరియార్ పిలుపునిచ్చారు. స్త్రీ స్వేచ్ఛ పట్ల పెరియార్ అభిప్రాయాలు విప్లవాత్మకమైనవి. యుగయుగాలుగా పురుషులలో కరుడుగట్టుకున్న స్త్రీ పట్ల చిన్నచూపు, పురుష దురహంకారం ఒకవైపు, తానూ ఒక మనిషినే, తనకు ఒక మనస్సు, తెలివి, వ్యక్తిత్వం ఉందన్న కనీస మాత్రపు ఇంగితజ్ఞానం లేని బానిసలా, బిడ్డలను కనిపెంచే మర మనిషిలా జీవించడం, చావడం అలవర్చుకున్న స్త్రీలకు పెరియార్ స్త్రీ వ్యక్తిత్వ వికాసం కోసం, ఆనందం కోసం బోధించిన విషయాలు చాలా తీవ్రమైనవి. బాల్య వివాహాలను వ్యతిరేకించి, వితంతు వివాహాలను ప్రోత్సహించిన పెరియార్ హిందూ పురోహిత పెళ్లిళ్ల వల్ల సమాజంలో స్త్రీ చిన్నచూపు చూడబడుతూ అవమానపరిచే విధంగా ఉన్నాయని, ప్రత్యామ్నాయంగా "దండల పెళ్లి (స్వాభిమాన పెళ్లి)" లను ప్రారంభించాడు. స్త్రీలకు స్వేచ్ఛ సమానత్వంతో పాటు విద్య, ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమాలు చేశారు. పురుషుడు స్వేచ్ఛగా ఉండాలంటే స్త్రీలకు స్వేచ్చనివ్వాలని, పురుషులకున్నంత స్వేచ్చ స్త్రీలకు కల్పించాలని పెరియార్ బోధించారు.
"పెరియార్" అని పిలవండి
స్త్రీ సమానత్వం, చైతన్యం కోసం ఈ.వి. రామసామి చేసిన పోరాటానికి 1938 నవంబర్ 12 న మద్రాసులో 5000 మంది మహిళలు నల్ల చీరలు ధరించి రామసామిని పెద్ద ఊరేగింపు లో తీసుకెళ్లి సభ పెట్టి "పెరియార్ వర్ధిల్లాలి" అని నినాదాలు చేసి ఆరోజు నుండి ఈ.వి.రామసామి ని పెరియార్(మహాత్మ, గొప్పవారు) అని పిలవాలని తీర్మానించారు.
తొలి రాజ్యాంగ సవరణ
స్వాతంత్ర్యాన్ని "విషాద దినం" గా అభివర్ణించిన పెరియార్ దేశ ప్రజలకు వెండి సంకెళ్లు పోయి బంగారు సంకెళ్ళు పడ్డాయని అన్నారు. మనం రాసుకున్న రాజ్యాంగం పీడిత కులాలకు న్యాయం చేకూర్చదని "రాజ్యాంగం నశించాలని" నినదించిన పెరియార్ గతం నుండే కొనసాగుతున్న రిజర్వేషన్లు రాజ్యాంగం ఏర్పడిన తర్వాత చెల్లవని కోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఉద్యమించి తొలి రాజ్యాంగ సవరణ చేయించి రిజర్వేషన్లను కాపాడిన పెరియార్ బహుజనులకు స్ఫూర్తిదాయకం. పెరియార్ ఉద్యమం వల్ల తమిళనాడులో ఆనాటి నుండి నేటికి బహుజనులు రాజ్యమేలడమే కాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్య, ఉద్యోగ రంగాల్లో 67 శాతం బహుజనులకు రిజర్వేషన్లు కొనసాగాతున్నాయి. పెరియార్ ఉద్యమ వారసులైన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, నేటి ముఖ్యమంత్రి స్టాలిన్ వారి పాలనతో దేశ మెజార్టీ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆనాటి పెరియార్ ఉద్యమ స్పూర్తితో నేడు ఒబిసి జనగణన, రిజర్వేషన్లపై సీలింగ్ ఎత్తివేత, క్రిమిలేయర్ విధానం రద్దు, చట్టసభల్లో ఒబిసిలకు రిజర్వేషన్లు, న్యాయ వ్యవస్థలో ఒబిసిలకు రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి. రిజర్వేషన్ల సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఇబిసి లకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి. రాజ్యాంగంలో కుల వ్యవస్థ స్థిరీకరణను పరిరక్షిస్తున్న అధికరణలను బహిరంగంగా తగలబెట్టి నవంబర్ 26 ను కుల నిర్మూలన దినంగా ప్రకటించి బ్రాహ్మణ హోటళ్లపై "బ్రాహ్మణ" అనే పేరును తొలిగించే ఉద్యమం చేశారు.
పెరియార్ నిరాడంబర, నిస్వార్థ సేవలను గుర్తించిన ఐక్యరాజ్యసమితి యొక్క విద్య, సైన్స్, సాంస్కృతిక ప్రచార సంస్థ(UNESCO) భారత ప్రభుత్వం ద్వారా ఒక ప్రశంసా పత్రాన్ని పెరియార్ కు బహుకరించించి.
"నూతన యుగం ప్రవక్త, ఆగ్నేయాసియా దేశాల సోక్రటీస్, సంఘ సంస్కరణోద్యమానికి తండ్రి, అజ్ఞానానికి, మూఢనమ్మకాలకి, అర్ధరహిత సాంప్రదాయాలకి, ఆధారం లేని ఆచారాలకు బద్ధ శత్రువు." అని ప్రశంషించారు.
21 వ శతాబ్దంలో జీవిస్తున్న మనం నాస్తిక ఉద్యమాలు, అంబేడ్కర్, పూలే భావాల విప్లవాల స్పూర్తితో జీవిస్తూ సామాజిక చైతన్యం కోసం, సామాజికన్యాయం కోసం తపిస్తోన్న మనం ఒక అడుగు ముందుకేసి తెగించి లక్ష్యాన్ని సాధించాల్సిన అవసరముంది. స్వాతంత్ర్యము వచ్చి 75 ఏండ్లు దాటినప్పటికి మనువాద వారసులు రాజ్యాంగ యంత్రాంగాన్ని ఇంకా తమ గుప్పిట్లో పెట్టుకొని వ్యవస్థను శాసిస్తూ దుష్ట నీతులతో బహుజనులను ఏవిధంగా పీడించి పిప్పి చేస్తున్నదో ఆలోచించాలి. అవమానాలు, అక్రమాలు సహిస్తూ, భరిస్తూ బాంచలకన్న హీనంగా, దీనంగా అల్లాడిపోతున్న ఘోర దృశ్యాలను, మారణకాండను విజ్ఞులూ, విద్యావంతులూ, మేధావులూ, సామాజిక ఉద్యమకారులూ, ఒక్కసారంటే ఒక్కసారి కళ్లముందు చిత్రించి చూడాలన్నది నా భావన.
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఎంతో ప్రగతి సాధించి చంద్రయాన్ 3 ని దిగ్విజయంగా ప్రయోగించి ప్రపంచ ప్రఖ్యాత గడించిన భారతదేశంలో మతోన్మాద పాలకులు సనాతన ధర్మం పేరుతో దేశ ప్రజలను తిరోగమనం దిశగా తీసుకెలుతున్న నేటి తరుణంలో పెరియార్ ఆలోచన విధానం, సిద్ధాంతం, పనితీరు నేటి ప్రగతిశీల ఉద్యమాలకు ఆదర్శం కావాలి. ప్రపంచంలో అనన్య సామాన్యమైన రీతిలో ఆయన సాగించిన సాంస్కృతిక విప్లవం పీడిత ప్రజలను చైతన్య పరిచింది. ఆయన జీవితమే పీడిత జాతికి ఒక సందేషాన్ని, స్ఫూర్తినిస్తుంది. మౌనంగా, స్థంబంధంగా చొప్పదంటు నినాధాలతో మన జీవితాలు గడిచిపోరాదు. సాంస్కృతిక విప్లవ సందేశాన్ని ప్రజలకు అందించడానికి పదండి ముందుకు తోసుకు పోదాం.
నిప్పు రవ్వలు - ఆణిముత్యాలు
" అంటరాని వారిని చెరువులో నీరు తోడనివ్వకుంటే మరొక చెరువును విడిగా కట్టిపెట్టండి. గుడి లోనికి వెళ్ళనివ్వకపోతే మరొక గుడిని కట్టిపెట్టండి" అని గాంధీ అన్నారు. దానికి నేను "చెరువులో నుంచి నీరు తోడకూడదంటూ అవమాణిస్తున్న నీచత్వానికి పరిష్కారం లేదన్నట్లయితే వారు నీళ్లు లేకుండానే చావనివ్వండి. వారికి అవమానం పోవాలన్నదే ప్రధానం. నీళ్లు కాదు" అన్నారు. -
..గాంధీతో పెరియార్ చర్చ 1927, బెంగుళూరు.
"ఒక మనిషిని మరొక మనిషి తాకకూడదు, కంటపడకూడదు" లాంటి అభిప్రాయాలు పాతుకుపోయిన ఒక దేశాన్ని భూకంపంతో నాశనం చేయకుండా, అగ్నిపర్వతాల మంటల ప్రవాహాల్లో ముంచేయకుండా, నేల పగుల్లలో నలిపేయకుండా, సుడిగాలిలో ముక్కచెక్కలు చేయకుండా వదిలి పెట్టడం, చూచిన తర్వాత కూడా "భగవంతుడు" ఒకడున్నాడని, ఆయన ధర్మాత్ముడని, దయామయుడని, తెగించి అనగలిగితే అలాంటి వారి గూర్చి ఏమనుకోవాలో మీరే నిర్ణయించండి. ఇలా అనగదొక్కబడిన క్రూరంగా హింసించబడిన ప్రజా సముదాయం ఇంకా ఎంతకాలమని ఓటమితో అహింసా ధర్మభావంతో ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఇలాంటి ఒక సమాజం ఇంకా ప్రాణాలతో బ్రతకడం కన్నా వారు తమ ప్రయత్నాలలో ప్రాణాలు పోగొట్టుకోవడం తప్పని మీలో ఎవరైనా అనుకుంటున్నారా?" (తిరుచ్చెమ్ కొట్టిల్ లో 16-10-1951)
"ఒక కుటుంబంలో నలుగురు ఉంటే వారిలో ఒక్కరే చదువుకునే వీలుంటే ఆ కుటుంబంలో ఉన్న మగాళ్లని ఆపి ఒక్కగానొక్క కూతురు చదువుకునే విధంగా ఆమెకు అవకాశం కల్పించాలి. "
"సంఘ సంస్కరణకు చివరి సరిహద్దు సామ్యవాదమే అన్నట్లు నాస్తికత్వమే వివేకానికి చివరి సరిహద్దు". (పెరియార్ 25-3-1950)
పెరియార్
జననం: 1879 సెప్టెంబర్ 17
మరణం: 1973 డిసెంబర్ 24
(పెరియార్ 145 వ జయంతి సందర్భంగా)
సాయిని నరేందర్
సామాజిక విశ్లేషకులు
9701916091
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box