బహుముఖ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజి

 బహుముఖ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజి
 కొండా స్పూర్తితో బి.సి హక్కులు సాధించాలి 



   చరిత్ర పుటల్లో స్వయం కృషితో తన పేరును తనే లిఖించుకున్న గొప్ప ప్రజ్ఞాశాలి కొండా లక్ష్మణ్ బాపూజి జీవిత చరిత్రను, చరిత్రను వేరుచేసి చూడడం చాలా కష్టం. తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించి రాజకీయ నాయకుడిగానే కాదు, రాజనీతిజ్ఞుడిగా విశేష కీర్తిని పొందిన బాపూజి జీవిత చరిత్రను ఆవిష్కరించడం అంత సులువైన విషయమేమికాదు. తను జ్ఞాపకం ఎరిగిన నాటినుండి ఉద్యమాలే జీవితంగా బతికి తన సర్వస్వాన్ని ప్రజల కోసం దారపోసిన ధీశాలి, తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకోవడమే కాకుండా తెలంగాణ వచ్చేవరకు ఏ ఒక్క పదవిని తీసుకోనని చెప్పి ఆచరించిన మహా నిష్టాగరిష్ఠుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. 20, 21వ శతాబ్దాల భిన్న దశలలో జీవించిన రాజకీయ నాయకుల్లో బాపూజీ జీవితం విశిష్టమైనది. ఆయన జీవితం తెలంగాణ విశాల రాజకీయ, సాంఘీక చరిత్రల తాలూకు స్వాతంత్ర్యానంతరం కంపుకొడుతున్న భారతదేశపు రాజకీయ చట్రానికి వెలుపల ప్రజా రాజకీయాలకు అద్దం పడుతుంది. పేదలపై పెత్తందారి అరాచకాలకు వ్యతిరేకంగా ఉద్యమించడమే కాకుండా ఏక కాలంలో ఆరు భిన్నమైన అంతర్గత సంబంధం కలిగి ఉన్న ప్రజా ఉద్యమాలతో ఆయన జీవితం ముడిపడి ఉన్నదని చెప్పడం సముచితం. అవి వరుసగా నిజాం వ్యతిరేక పోరాటం, వెనుకబడిన తరగతుల ఉద్యమం, చేనేత సహకారోద్యమం, తెలంగాణ రైతాంగ పోరాటం, స్వాతంత్రోద్యమం, ప్రత్యేక తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలు చేసిన బహుముఖ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. 
    నియంతృత్వ భూస్వామ్య నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా తలెత్తిన ఉద్యమంలో యువ కార్యకర్తగా రాజకీయ జీవితం ప్రారంభించిన బాపూజీ చాలామంది కాంగ్రెస్ నాయకుల మాదిరిగానే అహింసను ప్రబోధించే గాంధేయ తత్వానికి బహిరంగ జీవితంలో కట్టుబడి ఉంటూనే నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ ప్రతిఘటనోద్యమంలో ఆయన క్రియాశీలంగా పాల్గొన్నారు. జాతీయోద్యమంలో సామాజిక మూలాలు వీడకుండా ప్రజా రాజకీయాలు చేసిన బాపూజీ చేనేత సహకారోద్యమంలో నేతన్నల హక్కుల సాధనకు శ్రమించారు. చేనేత మగ్గాల యజమానులు, వ్యాపారుల ప్రయోజనాలు, నేత పనివారల ప్రయోజనాలు ఒకటి కాదని ఆయన సాగించిన ఉద్యమం అట్టడుగు శ్రేణులకు చేరువ చేసింది. కార్యకర్తగా  స్వాతంత్ర ఉద్యమంలో కీలకపాత్ర వహించిన బాపూజీ ఎం.ఎస్ రాయ్ ఆలోచనలు, రచనలకు, ప్రసంగాలకు ప్రభావితుడై ఆయన ప్రసంగాలను 'భారత విప్లవ సమస్యలు' అనే పేరుతో ఉర్ధూలోకి అనువాదం చేసి ముద్రించారు. రాజకీయాలు, ప్రజా జీవితంలో ఉన్నవారు నిష్కపటంగా, నిజాయితీగా ఉండాలని బోధించిన బాపూజి పరస్పర విరుద్ధమైన సుభాష్ చంద్రబోస్ అతివాద ధోరణి, గాంధీజీ స్వామ్యవాద ఆలోచన ధోరణి బాపూజీపై తీవ్ర ప్రభావం చూపాయి. పల్లెలు, పట్టణాల్లోని మురికి వాడల్లో ఉండే పేదలు కుటీర పరిశ్రమల్లో, వంశపారంపర్యంగా వస్తున్న వృత్తులు చేసుకుని బతికే వారి జీవితాలను మార్చాలని అనుక్షణం తపించిన వ్యక్తి బాపూజి వడ్రంగి, కంసాలి, కంచర, మేధర, బెస్త, కల్లుగీత కార్మికుల, దర్జీల, వడ్డెరుల లాంటి ఉత్పత్తి కులాల అభ్యున్నతి కోసం విశేష కృషి చేశారు. గ్రామీణ జీవణానికి, ఆర్ధిక వ్యవస్థకు వెన్నుమూకలై ఉండి కూడా సామాజిక హోదా లేక తక్కువగా చూడ బడుతూ ఎలాంటి అధికార దర్పానికి ఆస్కారం లేని, ఆర్ధికంగా గిట్టుబాటు లేని, అశుబ్రకరమైన కుల వృత్తుల్లో సాంప్రదాయంగా మనుగడ సాగిస్తున్న బి.సి కులాలకు నాణ్యమైన విద్య, ఆర్ధిక సామర్థ్యం తగినంత లేకుండా సామాజిక, రాజకీయ సాధికారత సాధించడం వీలుకాదనే వాస్తవాన్ని గుర్తించిన బాపూజీ చేనేత వృత్తి కులాలే కాకుండా ఇతర బి.సి కులాలు కూడా తమ తమ వృత్తుల ద్వారా తమ ఆర్ధిక స్థోమతను మెరుగుపరచుకొనగలిగే కార్యక్రమాలను ఆయన జీవితకాలంలో ఎన్నో చేశారు. స్వాతంత్ర్యానంతరం రాజకీయాలు భ్రష్టుపట్టిపోవడం, క్రమక్రమంగా రాజకీయ, సామాజిక విలువల పతనంలోనూ బాపూజీ విలువల కోసం నిలబడ్డాడు. బలహీన వర్గాల నాయకత్వం బి.సి ఉద్యమాలు, రిజర్వేషన్ల  పేరిట కొందరు అందలాలెక్కే ప్రణాళికలు వేసుకుంటున్న ఇప్పటి నాయకత్వాలకు మొత్తంగా సామాజికన్యాయం దృష్టి కానీ, బలహీన వర్గాల హక్కుల దృష్టి కానీ కొరవడిన కాలంలో బాపూజీ అవగాహనలో, పని విధానంలో లోతైన దృష్టి పెట్టాడు. వ్యవసాయాధారిత వృత్తులు, చేతి వృత్తులు అంతరించిపోతున్న క్రమంలో జీవనోపాది అవసరాలు హఠాత్తుగా కనుమరుగై ప్రత్యామ్నాయం లేక కోట్లాది మంది ఉపాధి కోల్పోతున్న తరుణంలో ఆయన రాజకీయ పోరాటాల్లో అంతర్లీనంగా వృత్తులు బలపడడం గురుంచి యోచన చేసిన మహానీయులు బాపూజీ. 
   మూడు తరాల ఉద్యమానికి సాక్షిగా నిలిచిన  కొండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర డిమాండ్ ఉద్యమ రూపంలో ముందుకు వచ్చిన అన్ని సందర్భాల్లో బాపూజీ క్రియాశీలక పాత్ర వహించారు. 1956 లో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటును ప్రతిఘటించిన ఉద్యమంలో, 1960 దశాబ్దాల చివరి నాళ్ళలో పెద్ద ఎత్తున తలెత్తిన ఉద్యమంలో 1995 లో ముందుకు వచ్చిన రెండో దశ తెలంగాణ ఉద్యమంలో, చివరి దశ తెలంగాణ  ఉద్యమంలో బాపూజీ పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చారు. తెలంగాణ ఉద్యమం ఓట్లు, సీట్లకు పరిమితమై రాజీ ధోరణితో నడుస్తూ, నిరాశ నిస్పృహలతో జనం ఈసురోమంటున్న దశలో కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజలలో భవిషత్ పై ఆశలను చిగురింపజేశారు. 
     దేశానికి స్వాతంత్రం వచ్చి తెలంగాణ ఇండియాలో కలిసిన తర్వాత కొండా లక్ష్మణ్ ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నుండి 1952 లో తొలిసారిగా ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో 23 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా, డిప్యూటీ స్పీకర్ గా, మంత్రిగా విశేష సేవలు అందిచడమే కాకుండా దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా స్వంత పార్టీని సైతం ఎదిరించి బహుజన, శ్రామిక వర్గాల పక్షాన నిలబడిన పక్షపాతి బాపూజి. 1969 లో మొదలైన తొలి దశ తెలంగాణ ఉద్యమమానికి మద్దతుగా తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి అండగా నిలిచారు. బి.సి లకు మేలు చేసే బి.పి మండల్ కమీషన్ నివేదికకు వ్యతిరేకంగా  పార్లమెంటులో రాజీవ్ గాంధీ మాట్లాడినందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి వెనుకబడిన తరగతులకు అండగా నిలిచి సామాజిక మూలలను వీడని గొప్ప నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షపై అమితంగా ఆలోచించే బాపూజీ 2001 లో టిఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పుడు తన ఇల్లునే పార్టీ కేంద్ర కార్యాలయానికి అందించిన సహృదయ సౌజన్య శీలి. తెలంగాణకు పచ్చి వ్యతిరేకి అయిన చంద్రబాబు బాపూజిపై కక్ష కట్టి ఆయన లేని సమయంలో ఆయన ఇంటిని నేల మట్టం చేశారు. ఆ భవనంలోని అన్ని రికార్డులను, స్థిర, చర ఆస్తులను నిరంకుశంగా ప్రభుత్వాదికారులు తీసుకెళ్లారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఏక నాయకత్వం పనికిరాదని సమిష్టి నాయకత్వం మాత్రమే ఆశయసిద్ధికి దోహదం చేస్తుందని వెలుగెత్తి చాటిన బాపూజీ విద్యార్థి, యువజనులను చైతన్యం చేసి తన 96 ఏండ్ల వయస్సులో సైతం తెలంగాణ కోసం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసి తెలంగాణ ఉద్యమంలో సామాజికతను జోడించారు.
     ఉర్ధూ, మరాఠీ భాషల్లో పాఠశాల విద్యను కొనసాగించిన కొండా లక్ష్మణ్ గాంధీని ఎవరు కలవకూడదని ఆంక్షలు ఉన్నప్పటికీ తన పదహారేళ్ళ వయసులో కొంతమంది విద్యార్థులను వెంటబెట్టుకొని  చంద్రాపూర్ లో గాంధీని కలుసుకొని స్వతంత్ర ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు.  చిన్నతనంలోనే కొండా యువకులను వెంటబెట్టుకొని మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. తన ఆందోళనల ద్వారా పేదల ఇనాం భూములు తిరిగి వచ్చేలా చేయడంతో భూస్వాములు కొండాను తిరుగుబాటుదారునిగా చూసారు. హైదరాబాద్ సిటీ కళాశాలలో  విద్యనభ్యసించిన కొండా 1938 లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైన వందేమాతరం ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యారు. జాతీయ ఉద్యమంలో యువకులు చేరడం కోసం తన 20 ఏండ్ల వయస్సు నుండే యువకులకు రహస్యంగా శిక్షణ ఇచ్చేవారు. 1938 లో నిజాం పాలనలో  పౌర హక్కుల సాధన కొరకు హైదరాబాద్ లో కాంగ్రెస్ సత్యాగ్రహం, హిందూ మహాసభ, ఆర్య సమాజం చేసిన పోరాటంలో పాల్గొని కొండా అరెస్ట్ అయ్యారు. 
   పదవ తరగతి పాసైన కొండా ఆర్ధిక ఇబ్బందుల వల్ల కళాశాల విద్యను మానేసి సాయంకాలం పూట హైకోర్టు నడిపే రెండు సంవత్సరాల న్యాయవాద వృత్తి కోర్సులో చేరి న్యాయవాది అయ్యాడు. న్యాయవాదిగా నిజాం కు వ్యతిరేకంగా పోరాడే వారి తరువున వాదించి కేసులు గెలిపించి సేవలు అందిచారు. ఆనాటి ఉద్యమకారులైన చాకలి ఐలమ్మ, బందగి లాంటి వాళ్లకు న్యాయ సహాయం అందించాడు. డెహ్రాడూన్ లో 1940 లో నిర్వహించిన రాజకీయ శిక్షణకు హాజరై "రెవల్యూషనరీ ఇష్యుస్ ఆఫ్ ఇండియా" అనే అంశంపై ఎం.ఎన్.రాయ్ చేసిన ఉపన్యాసం విని బాపూజీ చాలా ప్రభావితుడయ్యాడు. స్వాతంత్ర పోరాట సమయంలో షోలాపూర్ లో సుభాష్ చంద్రబోస్ ను కలిసి నిజాం నిరంకుశత్వంపై చర్చించారు. రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తున్న కొండా ఇంటిని 1941 లో పోలీసులు ముట్టడించారు. పోలీసుల నుండి తప్పించుకొని కొంతకాలం అజ్ఞాతంలో ఉండి కూడా నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమం చేసాడు. హైదరాబాద్ నుండి బొంబాయి లోని కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్ళి "జాయిన్ ఇండియా" ఉద్యమంలో చురుగ్గా పాల్గొనడమే కాకుండా నిజాం రాజ్యం నుండి వచ్చే శరణార్ధుల బాగోగులు చూసారు. 
    కొండా లక్ష్మణ్ బాపూజీ 1941 లో ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో కిసాన్ సదస్సు ఏర్పాటు చేసి జాతీయ నాయకులు జయప్రకాష్ నారాయణ, ఎన్.జి. రంగా వంటి వారిని ఆహ్వానించారు. 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంతో పాటు తెలంగాణ విమోచన ఉద్యమంలో పాల్గొన్న కొండా బ్రిటిష్ రెసిమెంట్ ప్రాంగణం, టెలిగ్రాఫ్ కార్యాలయం ఇతర చోట్ల కాంగ్రెస్ పతాకాన్ని ఎగురవేశారు. నిజాం నిరంకుశ పాలన నుండి సామాన్యులను రక్షించడం కోసం హైదరాబాద్ లోని అనేక ప్రాంతంల్లో పౌర రక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు. 1942 లో ఏర్పడిన ఆంధ్ర మహాసభతో అనుబంధం పెంచుకున్న కొండా రావి నారాయణ రెడ్డి, బద్ధం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రరెడ్డిలతో కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత చేనేత రంగం దెబ్బతినడంతో బాపూజీ పెద్ద ఉద్యమం చేసి యార్న్ కూపన్ పద్ధతిని నిజాం ప్రభుత్వంలో పెట్టించగలిగారు. నిజాం కాలంలో ఉన్న నిర్బంధ వెట్టి చాకిరి గెజిట్ నోటిఫికేషన్ కు వ్యతిరేకంగా బాపూజీ ఉద్యమం చేసి మత్యకారులు, మంగలి, చాకలి, కుమ్మరి, చేనేత కార్మికుల నిర్బంధ ఉచిత సేవల విముక్తి కోసం పోరాటం చేసి విజయం సాధించాడు. 1945 లో నిజాం రాష్ట్ర పద్మశాలి సంఘ అధ్యక్షుడిగా ఎన్నికైన కొండా నిజాం దౌర్జన్యాలను అరికట్టడం కోసం సాయుధ దళాలను ఏర్పాటు చేయలనుకున్నాడు. నిజాం రాష్టాన్ని ఇండియన్ యూనియన్ లో కలపడానికి జరిగిన ప్రయత్నాల్లో  కీలకపాత్ర పోషించిన కొండాను 1947 లో నిజాం పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయతించగా రహస్య జీవితంలోకి వెళ్లి రైల్వే స్టేషన్లు, పోలీస్ స్టేషన్లపైన బాంబులు వేయడమే కాకుండా 1947 డిసెంబర్ 4 న నిజాం నవాబుపై కూడా బాంబు దాడి చేసిన బృందంలో కొండా పాల్గొన్నారు. బాంబు దాడిలో పాల్గొన్న పవార్ ను అరెస్ట్ చేసిన నిజాం పోలీసులు కొండాను అరెస్ట్ చేయలని చూస్తే దొరకకుండా బొంబాయి వెళ్లారు. ఈ కేసులో అనేకమంది కొండా లక్ష్మణ్ స్నేహితులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. తెలంగాణను ఇండియాలో కలిపిన తర్వాత కొండా లక్ష్మణ్ పై ఉన్న కేసులన్ని ఎత్తివేశారు.
      బ్రిటిష్ సామ్రాజ్యవాదం, నిజాం నిరంకుశ పాలనను ఎదుర్కొనేందుకు పరస్పర విరుద్ధమైన సుభాష్ చంద్రబోస్ అతివాద ధోరణి, గాంధీ సామ్యవాద ఆలోచన ధోరణిని అనే రెండు ఆయుధాలను బాపూజీ సమయోచితంగా వాడుకున్నాడు. బాపూజీ చేపట్టిన అనేక ఉద్యమాల్లో  తండ్రి పోశెట్టి నుండి నేర్చుకున్న క్రమశిక్షణ, తిలక్, ఎం.ఎస్ రాయ్, సుబాష్ చంద్రబోస్ ల నుండి నేర్చుకున్న ప్రగతిశీల భావాల ప్రభావం కనపడుతుంది. కులం, వర్గం, వంశపారంపర్యం ప్రాతిపదికగా సమకూరే గౌరవాలను నిరసించిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ప్రజాస్వామ్య స్ఫూర్తిని అందించే భారత రాజ్యాంగం, అంబేడ్కర్ ఆలోచన ప్రభావం బాపూజీపై కనిపించేది. 
   సంఘ సంస్కరణ ఉద్యమాల్లో భాగంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో బిల్లు పెట్టడం కోసం బాపూజీ జంట నగరాల్లో అనేక నిరసనలు చేపట్టారు. పద్మశాలి హాస్టల్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కొండా 1949 లో ప్రభుత్వం చేనేత సహకార సంఘాలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేసారు. 1944 నుండి 1960 వరకు రాష్ట్ర పద్మశాలి అధ్యక్షుడిగా, 1951 నుండి 1956 వరకు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంఘానికి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా కొనసాగిన కొండా నిరంతర కృషి వల్లనే హైదరాబాద్ రాష్ట్రం చేనేత వృత్తి నిర్వహించే 15 కులాలకు విద్యా సదుపాయాలు కల్పించేందుకు వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చింది. బాపూజీ ఎన్నో గౌరవాలు పొందారు. "ఆచార్య" అనే బిరుదు తన సేవల నుండే వచ్చింది. "సహకార రత్న" గా పేరుగాంచారు. 2005 ఆగస్టు 9 న భారత రాష్ట్రపతి "ఎమినెంట్ ఫ్రీడం ఫైటర్" అవార్డు ఇచ్చారు. సత్యాగ్రమం నూరేళ్ళ పండగ సందర్బంగా ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యులుగా ఎంపికయ్యారు. 2007 లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య సమరయోధుల స్క్రీనింగ్ కమిటీకి చైర్మన్ గా నియమించబడ్డాడు. 2010 లో కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదిలాబాద్ జిల్లా వాంకిడి లో కొండా లక్ష్మణ్ బాపూజీ సేవా సధన్ ప్రారంభించి గిరిజనులకు సేవ చేయడానికి 25 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. బలహీన వర్గాల అభ్యున్నుతి కోసం జీవితమంతా పోరాడిన కొండా జనాభాలో అత్యధిక శాతం ఉన్న వెనుకబడిన తరగతుల సామాజిక న్యాయ ఉద్యమం కోసం వారి సంక్షేమం కోసం బి.సి వెల్ఫేర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి దానికి 25 లక్షల మూల ధనాన్ని అందించారు. ఇంకొక మాటలో చెప్పాలంటే  దక్షిణాదిన తమిళనాడులో ఉద్యమం చేసిన పెరియార్ తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ అని చెప్పాలి. పెరియార్ ఉద్యమ వారసులు ఆయన స్పూర్తితో తమిళనాడులో బాహుజన రాజ్యం స్థాపిస్తే తెలంగాణలో మాత్రం రెండు సార్లు దురాక్రమణకు గురై నేటికి నిరంకుశ పాలన కొనసాగుతుంది. 
    బాపూజీ విలక్షణ వ్యక్తిత్వం, స్వాతంత్రం, న్యాయం, సమానత్వం సాధించేందుకు అలుపెరుగని సామాజిక, రాజకీయ పోరాటం చేసిన గొప్ప వ్యక్తి తన రహస్య జీవితంలోనే మద్రాస్ లో 1948 జూన్ 27 న డాక్టర్ శకుంతలాదేవితో బాపూజి కి వివాహం జరిగింది. చైనా యుద్ధం క్షతగాత్రులకు భార్య శకుంతలాదేవిని వెళ్లి సేవలు చేయమని ప్రోత్సహించారు. బాపూజీ ఇద్దరి కుమారులలో ఒకరు ఇండియన్ ఎయిర్ పోర్స్ లో చేరి అసువులు బాసారు. నిజాం రాజ్యం ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ తాలూకాలోని మారుమూల గ్రామం వాంకిడిలో కొండా పోశెట్టి, అమ్మక్కలకు 1915 సెప్టెంబర్ 27 న జన్మించిన బాపూజీ 97 సంవత్సరాలు జీవించి 2012, సెప్టెంబర్ 21 న తుదిశ్వాస విడిచారు. పీడిత ప్రజల విముక్తి కోసం బహుముఖ పోరాటం చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరం యువతకు ఆదర్శం కావాలి.
    బాపూజీ తన జీవితకాలంలో ఎంతో మంది మహానీయులతో  సత్సంబంధాలు కొనసాగించారు. నెహ్రు, లాల్ బహుదూర్ శాస్త్రి, సర్వేపల్లి రాధాకృష్ణ, ఇందిరాగాంధీ, కామరాజ్ నాడార్, నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్, టంగుటూరి అంజయ్య, కె.వి. రంగారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, రాజీవ్ గాంధీ, సోనియాగాంధీ, మన్మోహన్ సింగ్ లాంటి నాయకులతో సత్సంబంధాలు కొనసాగించారు. పీడిత ప్రజల పక్షాన జీవితాంతం పోరాటం చేసిన బాపూజి పేరు రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలనలో ఉందనే సంగతి తెలుసుకున్న ఆనాటి అగ్రకుల నాయకులు ఒక్కటై రాజకీయంగా ఆయనను ఒంటరిని చేశారు. తొమ్మిది దశాబ్దాల తెలంగాణ సామాజిక చరిత్ర, ఉద్యమాలు, సామాజిక, ఆర్ధిక న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాత్రుత్వానికి సంబంధించిన అనేక పరిణామాలు కొండా జీవితంతో ముడిపడి ఉన్నాయి. బాపూజీ వంటి వ్యక్తిత్వం, సౌశీల్యం, సంకల్ప బలం, త్యాగశీలత, నేటి సమాజానికి ఎంతో ఆదర్శనీయం. విద్యారంగంలో జరిగిన కృషితో ఉద్యోగాల్లో ప్రవేశించిన ఉద్యోగులు వ్యక్తిగత అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వకుండా, రాజకీయాల్లో ఎదిగిన వారు దళారులుగా మారకుండా కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి మహనీయుల అడుగుజాడల్లో పయనించడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి.
    సాయుధ పోరాటం మొదలుకొని 2014 లో తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఎందరో మహానుభావులు, సామాన్యులు త్యాగం చేసారు. అలాంటి త్యాగధనులను గుర్తించి వారి చరిత్రను సమాజానికి తెలియజెప్పాల్సిన బాధ్యత మరిచిన టిఆర్ఎస్ పార్టీ త్యాగధనుల చరిత్రను కనుమరుగు చేయడానికి తెలంగాణ తల్లి విగ్రహాలను ఊరూరా పెట్టిస్తున్నారు. సామాజిక పోరాటాల ఉధృతి గమనించిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇటీవల చాకలి ఐలమ్మ, కొండా లక్ష్మణ్ బాపూజి జయంతులను ప్రభుత్వం అధికారికంగా జరపాలని నిర్ణయించడం సంతోషకరం.  75 సంవత్సరాల తెలంగాణ ఉత్సవాల సందర్భంగా కొందా లక్షన్ బాపూజీని ఏ పార్టీ పట్టించుకోకపోవడం బాధాకరమే కాక సబ్బండ బహుజన వర్గాలకు, తెలంగాణ సమరయోధులకు అవమానకరం. మొక్కుబడిగా జయంతి కార్యక్రమాలు చేసే పాలకులు చిత్తశుద్ధితో మహనీయులు కలలు కన్న తెలంగాణ కోసం కృషి చేయాలి. లేని పక్షంలో త్యాగధనులు కోరుకున్న సబ్బండ వర్గాలు విముక్తి చెందే సంపూర్ణ తెలంగాణ కోసం ప్రజలు మరో పోరాటానికి సిద్ధమవుతారు. ఆనాడు నిజాంను పాలనను దించిన కొండా స్పూర్తితో నేటి నిరంకుశ దొర పాలనకు చరమగీతం పాడుతారు. 

(సెప్టెంబర్ 21 ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 11 వ వర్ధంతి సందర్భంగా)


  సాయిని నరేందర్
రాజకీయ, సామాజిక విశ్లేషకులు
       9701916091
2 Attachments • Scanned by Gmail

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు