ఆవేశమే సన్నివేశం!
సామాన్యుడే
నా దేవుడన్నాడు
ఆ సామాన్యుడి కోసమే బతికిండు..
తాను అసమాన్యుడైనా గాని సామాన్యుడిగానే పోయిండు..
కాళోజీ..
ఈ పేరే
తిరుగుబాటుకు నిర్వచనం..
ఆవేశానికి బహువచనం..
అక్షరంలోనైనా..
ఆహార్యంలోనైనా!
ఈ తెలంగాణ కవికి నివాళి
ఆ తెలంగాణ యాసలోనే
ఆ భాషలోనే రాద్దామనుకుంటే
అంతలోనే ఆయన మాటలే గుర్తుకొచ్చి మూసుకొని తెలిసిన పథంలోనే
పద పదంటూ
పరుగులెత్తింది ప్రతి పదం..
అలాగే అమరింది
ప్రతి పాదం!
ఔను మరి..
ఎవడి వాడుక భాషలో
వాడే రాయాలె..
ఇట్ట రాస్తే అవతలోడికి తెలుస్తదా..!
అని ముందే హెచ్చరించాడు పెద్దాయన..
ఇక ప్రయోగాల జోలికెళ్ళి
ఏం ప్రయోజనం..!?
ఒక్క సిరాచుక్క
లక్ష మెదళ్ళకు కదలిక..
మళ్లీ ఆ పెద్దాయన
మాటలే స్ఫూర్తిగా
ఆయన కాలాన్ని తలస్తూ
కలం కదిలింది..
ఆయన గురించి నాలుగు మాటలు రాద్దామంటే
మస్తిష్కం నిండా
ఆయన మాటలే
సుడులు తిరుగుతున్నాయి...
అలవాటు ప్రకారం
మద్దెలో నాలుగు
ఎంగిలిపీసు ముక్కలు జొప్పసిస్తనేమోమని
మా చెడ్డ భయం..
తెలుగు బిడ్డవురోరి
తెలుగు మాట్లాడుటకు
సంకోచపడెదవు
సంగతేమిటిరా..
అన్యభాషలు నేర్చి
ఆంధ్రంబు రాదనుచు
సకిలించు ఆంధ్రుడా
చావవేటికిరా..
ఇలా గద్దించిన కాళోజీ
మాటలు బుద్దెరిగి మసలితే
తెలుగోడు ఎప్పటికీ వెలుగోడే!
కాళోజీ..ఉద్యమ ప్రతిధ్వని..
రాజకీయ సామాజిక
చైతన్య సమాహారం..
ఆయన ఓ ప్రశ్న..
ఆయనే జవాబు..
హక్కు ఆయన బుక్కు..
అదే ఆయన ధృక్కు..
ఇది నా గొడవ ని
అనుకోక
తుది విజయం మనది అంటూ
ఆ హక్కు కోసం
మొదట తెల్లదొరలను..
పిదప నిజాములను
ఎదిరించిన శూరుడు..
మండే సూర్యుడు!
"""""""""""""""""""""""""""""""""""
ప్రజాకవి..పద్మవిభూషణ్
కాళోజీ నారాయణ రావు జయంతి
(09.09.1914)
సందర్భంగా
ప్రణామాలతో..
ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box