చాకలి ఐలమ్మ స్ఫూర్తి నేటి అవసరం
నిజాంను దించిన తెగువతో దొరను దించాలి
సామాన్య కుటుంబంలో పుట్టి అతి సాధారణ మహిళ అయినా అసామాన్య పోరాటం చేసిన చాకలి ఐలమ్మ తెలంగాణ వీరాంగిని, తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఐలమ్మది కీలక అధ్యాయం. అయ్యా నీ బాంచన్ (బానిసను) కాల్మొక్కుతా అంటూ వెట్టి చేసిన బతుకుల విముక్తికోసం తిరగబడ్డ తెగువ ఐలమ్మది. అనాదిగా చేస్తున్న వెట్టిని వ్యతిరేకించిన ఐలమ్మపై దొరల పెత్తనం, అణచివేత చాలానే జరిగింది. సనాతన సాంప్రదాయ జీవితాన్ని వ్యతిరేకించి స్వాభిమాన జీవితాన్ని గడపాలనుకున్న ఐలమ్మ భూస్వాములు, దొరలపై పెద్ద యుద్ధమే చేసింది. ఆనాటి నిజాం సంస్థానంలో భాగమైన నేటి తెలంగాణ ప్రాంతంలో 1940 లలో దొరలు, దేశ్ ముఖ్ లు, దేశ్ పాండేలు, భూస్వాములు, పెత్తందార్లు, నిజాం రాజుకు కప్పం(పన్ను) కడుతూ గ్రామాలపై అధికారం చలాయించేవారు. దొరలు ప్రజలను వివిధ రకాల పన్నుల పేరుతో పీడించడమే కాకుండా వారితో నిర్బంధ వెట్టి చేయించుకునేవారు. చాకలి, మంగలి, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చేనేత, నీరటికాడు, మాదిగ తదితర వృత్తి కులాల బ్రతుకులు వెట్టిలోనే తెల్లారేవి. వంతుల వారిగా పొద్దు పొడవక ముందే దొర గడీల్లో ప్రత్యక్షమై అన్ని పనులు చేసేవారు. దొరల వ్యవసాయ పనులైన నాట్లు, కోతలు, కుప్ప కొట్టి ధాన్యం దొరల గడీలకు చేర్చడం చేసిన తర్వాతనే గ్రామాల్లోని మిగతా వారి పని చేయాలనే నియంతృత్వం సాగే భయంకరమైన రోజులవి. స్వంత అస్థిత్వం, స్వాభిమానం గురించి మాట్లాడే ధైర్యం లేని ఆ రోజుల్లో దొర ముందుకు వెళ్లాలంటే నెత్తిన రుమాలు, కాళ్ల చెప్పులు చేతుల్లోకి తీసుకొని వంగి నడవాల్సిందే. మహిళల సంగతి మరీ దారుణంగా ఉండేది. భూస్వాములు, దొరలు ఆడింది ఆట పాడింది పాట. దేవదాసి, దాసీల వ్యవస్థతో మహిళలపై జరిగిన అఘాయిత్యాలు, వారు పడిన బాధలు వర్ణనాతీతం. పంటలు చేతికందిన నాడు సర్వ చాకిరి చేసిన కుల వృత్తుల వారికి బిక్షమేసినట్లు వారికి తోసినంత ధాన్యం పెట్టేవారు. మాదిగలనైతే కళ్ళం అడుగు ఊడ్చుకోమనే వారు.
ఇండియా చరిత్రలో 1940 నాటి తెలంగాణ ప్రజా పోరాటం విశిష్టమైనది. ఆనాటి తెలంగాణ ఉద్యమం దొరలు, రజాకార్లు, పోలీసు యాక్షన్ చేసిన ఎన్నో పోరాట గాధలను వివరిస్తాయి. తెలంగాణ సాయుధ పోరాటం కేవలం భూమి కోసం, భుక్తి కోసమో సాగింది కాదు దోపిడికి, అణచివేతకు వ్యతిరేకంగా, వెట్టి చాకిరి విముక్తికి, స్వాభిమాన జీవితానికి ప్రతీకగా, గడీల పాలన స్థానంలో ప్రజా పాలన స్థాపించేందుకు సాగిన సంగ్రామం. ఆనాటి నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని దేశ్ ముఖ్ లలో విసునూరు రామచంద్రారెడ్డి ఒకరు. జనగామ తాలూకాలో 40 గ్రామాల్లో సుమారు 40 వేల ఎకరాల భూమి కలిగి నరరూప రాక్షసుడని పేరున్న రామచంద్రారెడ్డి సమీప గ్రామమైన పాలకుర్తిలో సామాన్యులు తలెత్తుకు తిరుగాలంటే వణుకు. అలాంటి దొరపై తిరుగుబాటు చేసిన అగ్ని ఖనిక ఐలమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాకిరి కులంలో పుట్టి వెట్టిని ఎదిరించిన ధీరురాలు ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచి దొరల రాజ్యాన్ని కూల్చడంలో కీలకపాత్ర వహించింది. తను చాకిరి చేస్తూనే తను ఊర్లో అడుక్కొచ్చిన బువ్వ అప్పటి కమ్యూనిస్టు నాయకులకు పెట్టి నిత్య నిర్బంధంలో సైతం కమ్యూనిస్టులకు ఆశ్రయం కల్పించడమే కాకుండా తాను ఉద్యమంలో పాల్గొన్నది.
వెట్టి నుండి, చాకిరి బతుకు నుండి బయటకు వచ్చి స్వాభిమానంగా జీవించాలని నిర్ణయించుకున్న ఐలమ్మ తనకున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేస్తే ఆరుగురు సంతానంతో కూడిన తన కుటుంబం గడవడం కష్టమవడంతో సమీపంలోనున్న కొండలరావు దొర భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తుంది. వెట్టి వొదిలి వ్యవసాయం చేయడమే కాకుండా ఆనాటి సాయుధ పోరాటంలో బాగమవుతున్న ఐలమ్మను ఎన్నో విధాలుగా అనచివేయాలని ఐలమ్మ పండించిన పంటను బలవంతంగా తీసుకెళ్లాలనుకున్న విసునూరు దొరను తిప్పికొట్టింది. పంటను ఎత్తుకెళ్లాడానికి వచ్చిన దొర గుండాలను ఎదురించడంలో ఐలమ్మ సాహసం, తెగువ గొప్పది. ఆ సాహసం వీర తెలంగాణ రైతాంగ విప్లవోద్యమానికి ఎంతో బలమిచ్చింది. ఐలమ్మ తిరుగుబాటును గమనించిన ఆనాటి కమ్యూనిస్టు నాయకులు ఆరుట్ల రామచంద్రారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, రావి నారాయణరెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి, కట్కూరి రామచంద్రారెడ్డి, ధర్మభిక్షం, చకిలం యాదగిరి లాంటి వాళ్ళు పాలకుర్తిని కేంద్రంగా చేసుకుని ఉద్యమాన్ని కొనసాగించారు. ఐలమ్మ దంపతుల నాయకత్వంలో ఏర్పాటుచేసిన గుతుపల సంఘాన్ని అణచివేయాలని చూసిన గుండాలను, పోలీసులను తిప్పికొట్టారు. తన భర్తను, కొడుకులను, జైల్లో నిర్బంధించినా కూడా ఐలమ్మ భూపోరాటంలో వెనుకడుగు వేయలేదు. ఉద్యమంలో ఐలమ్మ కుమారులు సోమయ్య, లచ్చయ్య, భర్త నర్సయ్య కార్యకర్తల స్థాయి నుండి దళ కమాండర్లుగా ఎదిగారు. ఐలమ్మ కుమార్తె సోమ నర్సమ్మ, ఉద్యమంలో కొరియర్ గా పని చేసింది. రెండు సార్లు పాలకుర్తిని సందర్శించిన కమ్యూనిస్టు దిగ్గజం పుచ్చలపళ్లి సుందరయ్య ఐలమ్మ ఇంటిపై అరుణ పతాకం ఎగురవేశారు. "తెలంగాణ రైతు బిడ్డ కోసం జరిపిన తొలిదశ పోరాటానికి ఆమె చిహ్నం" అని ఐలమ్మ గురించి సుందరయ్య అభివర్ణించాడు.
ఊరందిరిని ఏకం చేసి వారు తిరగబడేలా చేస్తున్న ఇలమ్మను విసునూరు దొర పిలిచి నిలదీసాడు. కాలుస్తానని తుపాకి పెట్టి మరీ బెదిరించాడు. తనను కాల్చిన ఏమి కాదని తనకు నాలుగు ఎకరాల భూముందని, ఐదుగురు కొడుకులున్నారని కానీ నీకు ఒక్కడే కొడుకు వేల ఎకరాల భూమి ఉందని అయినా ఇంకా ఇతరుల భూమి ఎందుకు గుంజుకుంటున్నావని ఎదిరించి మాట్లాడింది. నన్ను చంపితే సంఘపోల్లు వస్తారని, జనం తిరగబడతారని, భూములు పంచి గడీని కూల్చుతారని, నీ ఘడీలో గడ్డి మొలుస్తుందని గళమెత్తి హెచ్చరించిన ధిక్కార స్వరం ఐలమ్మ. ఐలమ్మ మాటలు నిజమైనాయి. దొర అధికారం పోవడమే కాకుండా గడీల పాలన అంతమైంది. దొర కొడుకు దిక్కులేని చావు చచ్చాడు. ఆ తర్వాత దొర కూడా చచ్చాడు.
"కానరాని ఐలమ్మ తెగువ"
ఐలమ్మ ఉద్యమ కాలంలో ఆదివాసీ ప్రాంతంలో కొమరం భీం, జనగామ ప్రాంతంలో దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళ వీరోచిత పోరాటాలతో ప్రభుత్వాలు మారాయి. పాలకులు మారారు కాని ప్రజల జీవన స్థితిగతులేమి మెరుగుపడకపోగా మరింత బానిసత్వంలోకి నెట్టబడుతున్నాయి. సాయుధ పోరాటంతో గ్రామాలు విడిచి వెళ్లిన దొరలు, దేశ్ ముఖ్ లు పోలీసు యాక్షన్ తర్వాత కాంగ్రెస్ పాలనతో మళ్ళీ గ్రామాలకు వచ్చి పెత్తనం చెలాయించి దోపిడి, అణచివేత కొనసాగించారు. వృత్తి కులాల వారు వృత్తులు కోల్పోయి అవమానంతో, ప్రజాస్వామిక బానిసత్వంలో ఆకలితో, ఆత్మహత్యలతో, అనారోగ్యంతో మరణిస్తున్నారు. నక్సలైట్లుగా మారి తిరుగుబాటు చేస్తున్నారు. చాకిరి కులాల జీవితాల సంస్కృతిని సంస్కరించాలనే ఆలోచన పాలకులకు లేకపోవడం వల్లనే నేటికి ఉత్పత్తి, చాకిరి కులాలు అధోగతిలో జీవిస్తున్నారు. కింది కులాలను, ఉత్పత్తి కులాలను ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నిర్మాణంలో భాగస్థులను చేయాల్సిన పాలకులు వారిని ఓటు బాంకుగా మాత్రమే వాడుకుంటున్నారు. మారుతున్న పరిణామాల్లో ఆయా కులాలకు స్వతంత్రం, స్వేచ్ఛ, స్వేచ్ఛగా మాట్లాడడం, రాజకీయాల్లో పాల్గొనే సామాజిక స్వేచ్ఛ కల్పించబడాలి. సాంఘీక, ఆర్ధిక భావాలను మార్పు చేసి సామాజిక మూలాలను సంస్కరించకపోవడంతో ఆర్ధిక అరాచకత్వం పెరిగిపోతుంది. పాలకులు ఊదరగొడుతున్న బంగారు తెలంగాణ భ్రమల్లో బ్రతికినంతకాలం ప్రజల్లో మరింత బానిసత్వం పెరుగుతుంది తప్ప తిరుగుబాటు చేయలేరు. పాలనలో బాగస్వామ్యమవుదామనే భావన కింది, చాకిరి, ఉత్పత్తి కులాలకు రాలేదు. సాంఘీక సమానత్వంతో సమాజం పునఃనిర్మాణం జరగాలి. పేదరికంతో ఎన్నో తరాలుగా అవస్థలు పడుతున్న ప్రజలు భ్రమల్లోనుండి, పాలకుల ప్రలోభాల నుండి బయటపడి స్వేచ్చ జీవనానికి బాటలు వేయాలి. బర్రెలు, గొర్రెలు, ఇస్థిరీ పెట్టెలు, చేపలు ఇచ్చి మరో 17 కులాలను బి.సి జాబితాలో చేర్చుతూ పాలకులు వెట్టిని ఆదునీకరిస్తుంటే ప్రజలు అదే భ్రమలో, బానిసత్వంలో బతికితే విముక్తి సాధ్యం కాదు. భ్రమల్లో బతికే సమాజం జీవితాన్ని అనుభవించలేదు.
ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసే బానిస భావనను, గులాంగిరిని వీడి ఐలమ్మ స్ఫూర్తిగా ఏలికలం కాకుండా పాలకులుగా కావాల్సిన అవసరముంది. సంపద సృష్టిస్తున్న వాళ్లు, ఉత్పత్తి చేస్తున్న వాళ్ళు రాజ్యమేళాలి అప్పుడే ప్రజల నైపుణ్యత, ఉపాధి, సామాజిక ఉత్పత్తికి తోడ్పాటు లభించి సమసమాజం ఏర్పడుతుంది. ఆనాటి సమాజంలో భూమి ప్రదాన జీవనాదారం కావడంతో భూ పోరాటాలు జరిగాయి. పచ్చిమ బెంగాళ్ లో భూమి కోసం జరిగిన పోరాటమే నేడు దేశ వ్యాప్త నక్సలైట్ల ఉద్యమంగా కొనసాగుతుంది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తికోసం ఆనాడు జరిగిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేడు విద్య కోసం, వైద్యం కోసం, ఉపాధి, ఉద్యోగాల కోసం పోరాటం చేయాలి. తెలంగాణ సాధన జరిగితే రాష్ట్రంలో 60 శాతంగా ఉన్న బిసి లకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందని ఎన్నో త్యాగాలు చేసి వీరోచిత పోరాటం చేసారు. కానీ నేడు తెలంగాణలో బిసి లను బానిసలను చేసి పాలన కొనసాగుతుంది. ఐలమ్మ తెగువతో బిసి లు రాజకీయ శక్తిగా మారి అంబేద్కర్ అందించిన ఓటు ఆయుధంతో యుద్ధం చేసి రాజ్యమేలాల్సిన చారిత్రక అవసరముంది. ఆనాడు పాలకుల దోపిడి ప్రత్యక్షంగా ఉండేది. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణతో వ్యవస్థీకృతమైన నేటి పాలకుల దోపిడీని పసిగట్టి నూతన ఉద్యమాలు చేయాల్సిన అవసరముంది. ప్రదానంగా ప్రలోభ రాజకీయాల పట్ల ప్రజలను చైతన్యం చేయాలి. పాలితులుగా ఉన్నంతకాలం దోపిడి పీడనల నుండి విముక్తి సాధ్యం కాదనే వాస్తవాన్ని ప్రజలకు బోధించి పీడిత వర్గాల ప్రజలను పాలకులుగా మార్చే ఉద్యమం చేయాలి. ఆనాడు నిజాంను దించిన ఐలమ్మ లాంటి వాళ్ళ పోరాట స్పూర్తితో నేడు దొర పాలనకు స్వస్తి పలికే ఉద్యమాలకు ప్రజలను సిద్ధం చేయాలి.
వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం కిష్టాపురం గ్రామం ఓరుగంటి మల్లమ్మ సాయిలు దంపతులకు 1919 లో సద్దుల బతుకమ్మ నాడు జన్మించి1985 సెప్టెంబర్ 10 న తుదిశ్వాస వదిలిన ఐలమ్మ మహిళా లోకానికే కాకుండా నేటి తరం ఉద్యమాలకు స్ఫూర్తి, ధైర్యానికి ప్రతీక, సాయుధ పోరాటంలో వేగుచుక్క నేటి తరం ఉద్యమ శక్తులు ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని దోపిడి పాలనపై పోరు చేయడమే ఐలమ్మకు నిజమైన నివాళి.
(సెప్టెంబర్ 10 న చాకలి ఐలమ్మ 38 వ వర్దంతి సందర్భంగా)
సాయిని నరేందర్
సామాజిక, రాజకీయ విశ్లేషకులు
9701916091
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box