దివికేగిన యుద్ధగీతం........

దివికేగిన యుద్ధగీతం........

పాదం మీద 
పుట్టుమచ్చవై పుట్టి
సిగలో పువ్వువై వెళ్ళావు..
గర్జనవై.. ఘీంకారమై..
ఇదే గద్దరువై మళ్లీ రావా..!


 



విప్లవం 

మానవ ఆకృతి దాల్చితే..


గొంతు

బాంబులా పేలితే..


అక్షరాలు

ఆంక్షలను చేదించి 

విప్లవకాంక్ష రగిలిస్తే..


ఒక మనిషి తానే నిలువెల్లా

పోరాటానికి ప్రతిరూపమైతే 

అది గద్దర్ కాక

ఇంకెవరవుతారు..!


ఆయన పాడేది

మామూలు పాటలు కాదు..

మాటాడేది నీ భాష..

నా భాష కాదు..


అది జనం భాష..

సామాన్యుడి ఘోష..


రాగం లేని పాట..

ఉర్రూతలూగించడమే

దాని సరాగం..


శృతి తెలియని కూత..

మోగిస్తుంది మోత..


ఆ గొంతు పసిప్రాయంలోనే

పసిగట్టేసింది జనం నాడి..

వయసుతో పాటే 

పెరిగింది వేడి..

బండెనక బండి కట్టి..

పదహారు బండ్లు కట్టి..

ఏ బండ్లో వస్తవ్ కొడకో..

నాజీల మించినవ్ రో

నైజాము సర్కరోడా..

ఇలా గద్దర్ పాడితే

భూమి దద్దరిల్లదా..!


గళమెత్తితే జనసామాన్యం శివాలెత్తినట్టే..

ఎలుగెత్తితే సామ్రాజ్యవాదం

పరిగెత్తినట్టే..

నీ పాదం మీద 

పుట్టుమచ్చనై చెల్లెమ్మా..

వరించిన నందినే వద్దన్న మొండి..

ఉన్నన్నాళ్ళూ బ్రతికాడు 

అలాగే రంకెలేస్తూ..

రంగు మార్చక..

హంగు నేర్వక..!


నీ పాట..నీ ఆట..

రంజు రంజు..

నీ స్వరం..మండే భాస్వరం..

నీ గొంగళి..భళాభళి..

అప్పుడైనా..ఇప్పుడైనా..

గద్దరంటే పాలకులు

జరభద్రమే..

ఆయన గొంతు వింటే

అరాచకం చిద్రమే..!


అమరవీరునికి లాల్ సలాం..


గద్దర్ కు అక్షరనివాళి..


సురేష్..9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు