ఇది ధరిత్రి ఎరుగని ప్రళయం..!

 

మర్మస్థానం కాదది 

మీ జన్మస్థానం..

మానవతకి మోక్షమిచ్చు

పుణ్యక్షేత్రం..

శిశువులుగా మీరు పుట్టి

పశువులుగా మారితే..

మానవరూపంలోనే 

దానవులై పెరిగితే..

సభ్యతకి సంస్కృతికి

సమాధులే కడితే

కన్నులుండీ చూడలేని దృతరాష్ట్రుల పాలనలో..

ఏమైపోతుంది సభ్యసమాజం..

ఏమైపోతుంది మానవధర్మం..

ఏమైపోతుందీ భారతదేశం..!?


కారణం ఏదైనా కావచ్చు..

నిరసన ఎలాగైనా తెలుపుకో..

కాని ఇది అత్యంత హేయం..

చెప్పనలవికానంత నీచం..

రాక్షసులని మించిన అమానుష ప్రవర్తన..

ఆటవికులు సైతం ఒడిగట్టనంత క్రౌర్యం..!


ఎక్కడ ఉన్నాం మనం..

ఇంకెక్కడికి పోతున్నాం..

వేనవేల సంవత్సరాల నాగరికత నేర్పిన నిబద్ధత..

మానవీయ విలువలు

ఎక్కడికి పోయినట్టు..?


ఔను..ఈ ఉపోద్ఘాతమంతా

మణిపూర్ ఉదంతం గురించే.

ఒక అల్లరి మూక..అందులో మనుషుల్లా కనిపించే కొన్ని మృగాలు..రెచ్చిపోయి 

నడిరోడ్డుపై పోలీసులు మౌనప్రేక్షకులై చూస్తుండగా ఒక వర్గం ప్రజల్ని చిత్రహింసల పాల్జేయడమే

హేయమని అనుకుంటే

కనీస విచక్షణ మరచిన

ముష్కర మూక రాక్షస గణాలను తలపిస్తూ

ఇద్దరు స్త్రీలను నగ్నంగా చేసి 

వారి పట్ల అత్యంత కర్కశంగా ప్రవర్తించిన తీరు..

ఛీ..మనిషిగా ఎందుకు పుట్టామా అన్నంత జుగుప్స కలిగించింది.!


విషయం ఏదైనా అవనీ..

ఆ స్త్రీలకు ఈ వివాదంతో ఏంటి సంబంధం.

వారు సైతం ఆందోళనకారుల వ్యతిరేకవర్గం తరపున అక్కడికి వచ్చి ఉండవచ్చు గాక..అంతమాత్రం చేత వారిని బంధించి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అడ్డుకుని

ఆనక వలువలు ఊడదీసి

ఊరేగించడం..కళ్లెదుటే ఆ ఇద్దరిలో ఒకరి తమ్మున్ని చిత్రహింసలు పెట్టి చంపడం..అంతకు ముందే కన్నతండ్రిని మట్టుబెట్టడం అబ్బ..తలచుకుంటేనే కంపరం కలగటం లేదూ..!

అక్కడితో ఆగకుండా వందలాది మంది చూస్తుండగా ఒకరి తర్వాత ఒకరు ఆ ఇద్దరిపై అత్యాచారం చెయ్యడం అదింకెంత హేయం..!?


ఇది భూమ్మీదనే జరిగింది.

అందునా భారతదేశంలో..

స్త్రీని దేవతాస్వరూపంగా భావించి పూజించిన 

వేదభూమిలో..

పురాణాల పుటలు ముడుచుకోగా..

వేదాలు నిర్వేదమైనటుల

జరిగిన ఈ భయంకర ఘటన

పవిత్ర భారత దేశ చరిత్రలో

నిస్సందేహంగా 

మాయని మచ్చ..!


రావణుడు రాక్షసుడైతే కావచ్చు గాక.. సీతను అపహరించిన సమయంలో గాని..ఆ తర్వాత ఏడాదిపాటు లంకలో బందీగా ఉంచినప్పుడు గాని కనీసం ఆమెను తాకనైనా తాకలేదని

రామాయణంలో చదివాం.

అంతే కాదు అశోకవనంలో ఆమెకు కావలిగా స్త్రీలనే ఉంచాడు.


యుగం మారాక ద్వాపరంలో 

పాంచాలిపై విపరీతంగా కక్ష బూనిన దుర్యోధనుడు నిండు పేరోలగంలో ఆమెను వివస్త్రను చేయతలపెట్టాడు.

ద్రౌపదిని తీసుకువచ్చి వివస్త్రను చేయమన్నాడే

గాని చెరచమని తమ్ముడు దుశ్శాసనుని ఆదేశించలేదే.


ఇది కలియుగంలో సైతం 

ఊహించలేని ఘోరకృత్యం.

పైశాచిక క్రీడ..నడిరోడ్డుపై సాగిన కరాళనృత్యం..!


ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు..

చేతులు ముడుచుకు కూర్చున్నాయా

చట్టాలు..

చేష్టలుడిగి ఉన్నారా పోలీసులు..

ముమ్మాటికీ మణిపూర్లో

జరుగుతున్న ఉదంతాలన్నీ

ప్రభుత్వాల వైఫల్యం.

అటు కేంద్రప్రభుత్వం..ఇటు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం

ఈ సంఘటనలకు ఖచ్చితంగా బాధ్యత వహించాలి.నిజానికి మణిపూర్లో ఇంతకుముందు దుస్సంఘటనలు జరిగినప్పుడే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించవలసి ఉంది.

అయితే రాష్ట్రంలో కూడా బిజెపి ప్రభుత్వం ఉంది గనక కేంద్రం ఆ పనికి పూనుకోలేదు.

అటువంటప్పుడు తమ పార్టీ ఆధీనంలోని రాష్ట్ర సర్కార్ పరువు కాపాడుకోడానికి కేంద్రం మరింత పటిష్టమైన చర్యలు తీసుకుని ఉంటే బాగుండేది.

ఇప్పుడేమైంది..భారత ఇతిహాసమే పరిహాస మయ్యేంత దారుణ సంఘటన మణిపూర్లో

చోటు చేసుకుంది.


ఇది ఎవరి వైఫల్యం..

ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వానిదే..

మన మోడీకి అమెరికాలో చరిత్ర ఎరుగని గౌరవం

లభించిందని..ఆయన ప్రపంచనాయకుడై

పోయాడని గొప్పలు పోతున్న మనం ఇప్పుడు అదే ప్రపంచం ముందు మొహం ఎలా చూపించగలుగుతాం.

నేడో రేపో ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించనున్న మోడీజీ

తన దేశంలో..తన ఏలుబడిలో అడుగడుగునా జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘనకు..ఇటువంటి అమానవీయ దుష్కార్యాలకు

ఏమని బదులు చెబుతారు.

అసలు ఏ ముఖం పెట్టుకొని అలాంటి గొప్ప వేదికపై కాలు మోపుతారు. కరతాళ ధ్వనుల మధ్య వేదికను అధిరోహించే ఆ పెద్ద మనిషి 

హృదయాన్ని నిన్న గాక మొన్ననే తన గడ్డపై జరిగిన అకృత్యం ములుకులా పొడవదా.. అప్పటికి ఇంకా

ఆ పచ్చి ఆరదుగా..!


మోడీ ఏం చేస్తారు..అనకండి 

ఆయన భక్తులారా..

కేంద్రంలో..రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వాలు నడుస్తున్నాయి.రాష్ట్రాల్లో పరిస్థితులు 

చేజారుతున్నప్పుడు

సరిదిద్దవలసిన బాధ్యత కేంద్రానిది కాదా..?

ఆపాలనుకుంటే ఎంతసేపు..

సైన్యాన్ని దింపితే ఆగమేఘాల మీద అదుపు చెయ్యరా..కానీ అది జరగదు.ఈ అల్లర్లు ఎవరో కోరి చేయిస్తున్నవి..ఇవి జరిగితేనే కొన్ని నికృష్ట ప్రయోజనాలు నెరవేరుతాయి.!?


ఇప్పుడు కూడా ఇటు 

రాష్ట్ర సర్కార్ గాని..

అటు కేంద్రప్రభుత్వం గాని అంత పటిష్టంగా వ్యవహరిస్తున్నట్లు కనిపించడం లేదు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని ఏంటి నమ్మకం..

అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు.ఎవరు రాజీనామా చేస్తారు.


ఇప్పుడిక ఏముంది..ముందు విచారం..ఆనక విచారణ..

కేసులు..తిరకాసులు..

కోర్టులు..అక్కడ ఎడతెగని జాప్యాలు..ఈలోగా యుగమే మారిపోతుంది.!


ఈ గొప్ప దేశంలో..

ఎక్కడో ఒక దగ్గర..

ఎప్పుడో ఒకప్పుడు అచ్చంగా ఇలాగే కాకపోయినా

ఇలాంటి దుస్సంఘటనలు

ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉన్నాయి.అయితే ప్రాణానికి.. మానానికి

నిస్సిగ్గుగా ఖరీదు కట్టి నగదు రూపంలో చెల్లించే షరాబులున్నంత కాలం

ఏదీ ఆగదు..ఎవ్వరూ ఆగరు.

జనం మర్చిపోతారు..

ఇంకో సంఘటన జరిగే దాకా ప్రభుత్వాలు పట్టించుకోవు..!


రేపు మరో రేపు..

అంతేగా..

విచారం వ్యక్తం చేయడం..

పరిహారం చెల్లించడం..

సిగ్గులేని ముఖాలపై

దిక్కుమాలిన  నవ్వులు

పులుముకుని విజయగర్వంతో విరగబడి తిరగడం...

ఇదే పాలకుల నీతి..నిరతి..


ఛీ..ఛీ..ఛీ..ఛీ..

రాసి చిరాకు వేస్తోంది...

మారని వ్యవస్థ..

తీరని దురవస్థ..!


        సురేష్..జర్నలిస్ట్

             9948546286

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు