విశ్వవేదికల్లో
ఎర్రతివాచీలపై
సగర్వంగా నడుస్తూ
స్వదేశంలో మీ కాళ్ళకు
అంటిన రక్తపు మరకలను
తుడుచుకుంటున్నారా..!
అక్కడ ఇస్తున్న పూలగుత్తులలో
ఇక్కడ నలిగిపోయిన
అమాయక పూబంతులు
కనిపించడం లేదా..!
పుతిన్ పొగిడాడా..
బైడెన్ ప్రశంసల్లో ముంచెత్తాడా..
ఆ కుహానా పెద్దల
కరతాళధ్వనుల
నడుమ నీ భారతావనిలో
అత్యాచార వేళ
మీ అక్కచెల్లెళ్ల
ఆక్రందనలు
వినిపించడం లేదా..!
రోజుకు నాలుగైదు
ఖరీదైన బట్టలు మారుస్తున్నారే..
ఈ వేదభూమిలో
పశువాంఛకు
బలవుతున్న
ఆడపడుచుల
మానం నుంచి స్రవించిన
రక్తపు మరకలు
అంటుకున్నాయేమో
చూసుకోరాదా..!
దేశవిదేశాల్లో
మువ్వన్నెల జెండాను ఎగరేసే వేళ
ఒకపక్కనే కనిపించేలా జాగ్రత్త పడండి..
రెండో వైపున అన్నీ
రక్తపు చారికలే కదా..!..
మీరు సోగ్గా అధిరోహించే
ప్రత్యేక విమానాల చక్రాల కింద నలిగి చిద్రమైపోతున్న
మహోన్నత భారత చరిత్రను
ఇంకెంతకాలం కాలం
ఇలా వక్రీకరించి
ప్రపంచానికి చాటుతారు..
మీరు కొట్టే డప్పు
ఎన్నిఅమాయక బలిపశువుల చర్మంతో
చేసిందో మీకు తెలియదా..!
మామూలు అల్లర్లని..
చెదురుముదురు సంఘటనలని..
వర్గపోరాటాలని..
ప్రతిపక్షాల కుట్రలని
కొట్టిపారేయకండి..
చాలామటుకు మతకలహాలే..
అవి ఎవరి సృష్టి..
మరెలా..ఈ ఓట్ల కుంభవృష్టి..!
బయటి ప్రపంచానికి తెలియదేమో..
మన ప్రజాస్వామ్య దేశంలో
ప్రతి ఒక్కరికీ ఎరుకే కదా..!!
ఇకనైనా కళ్ళు తెరవండి...
పద్ధతి మార్చండి...
పై పై తెరలు తీయండి..
ముసుగులు తొలగించండి..
మెరమెచ్చు మాటలు మానండి..
మీరు..మీ షా
మీనమేషాలు..
మీ దొంగ వేషాలు ఆపి
ఈ దుర్యోధనదుశ్శాసన
దుర్నిరీతి రాజ్యంలో
మానభంగ పర్వంలో
మాతృహృదయ నిర్వేదాన్ని
అరికట్టే ప్రయత్నం చేయరాదా..
ఇదేమి అక్రమాల వరదా..
ఓ వరదా..ఇలా సదా..!
మీకేమి ఫాయిదా..!?
సురేష్..9948546286
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box