మళ్లీ ఇంకో అమానుషం..
మరోసారి
బట్టబయలైన
మృగాడి విద్వేషం..
ఈసారి మరో వికృతరూపం
నడిరోడ్డుపైనే నరరూపరాక్షసుల
జుగుప్సాకర ప్రతాపం..!
ఏం జరుగుతోంది
మన సమాజంలో..
రోజుకో కోణంలో
కనిపిస్తుందేమిటి
మగాడి నైజం
ఏదో రూపంలో
ఆడ'కూతురు'పై దౌర్జన్యమేనా..!?
మనం నేర్చిన చదువు..
గురువులు చెప్పిన బుద్దులు..
పెద్దలు బోధించిన సుద్దులు..
చిన్నతనంలో
అమ్మానాన్నలు
నేర్పిన పాఠాలు..
తాతలు బామ్మలు
చూపిన బాటలు
జీవితంలో
అనుభవాలు
నేర్పిన గుణపాఠాలు...
సంస్కృతి నేర్పిన సంస్కారం..
రామాయణం
చూపిన మార్గం..
ఏమైపోయాయి ఇవన్నీ..,!?
అసలు ఏమిటా విపరీతం..
ఏమైపోయింది
ఆ మనిషుల్లోని ఇంగితం..
జంతువులైనా ఆలోచించి
వెనకడుగు వేసే సన్నివేశం..
మనిషే పాల్పడితే..
ఇంకెక్కడి మానవత్వం..
మృగాలు సైతం చీదరించుకునే
మనిషి తత్వం..!
మళ్లీ ఇలా జరగకూడదు..
ఇలా విచక్షణ మరచి..
ఇంగితం విడిచి
ఇంత కర్కశంగా..
అమానవీయంగా
ప్రవర్తించడం..
మంచి మరచి..
విజ్ఞత విడిచి..
మానవతను మంటగలిపి..
దానవతను కలగలిపి..
దౌర్జన్యం చేయడం..
ఇది మొదలు కాదు..
కాని తుది కావాలి..!
ఇలాంటి పైశాచికాలకు
ఇక చరమగీతం పలకాలి..
ప్రభుత్వాలు కదలాలి
న్యాయస్థానాలు స్పందించాలి..
ముష్కరులను
సత్వరమే శిక్షించాలి..
రేపు మరో రాక్షసుడు లేవకుండా..
ఎల్లుండి
ఇంకో అకృత్యానికి
తావు లేకుండా..
కఠిన దండన..
వచ్చినా రాకున్నా
ఆ కర్కోటకుల్లో పరివర్తన..
అది రేపటి
మరో కంటకుడికి
కాదా హెచ్చరిక..
ఇదే..ఇదే..
ఈ వేదభూమిలో
ప్రతి స్త్రీమూర్తి పొలికేక..!
*********
సురేష్ కుమార్ ఎలిశెట్టి
9948546286
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box