తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీకి మనందరం మీటర్ పెట్టాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. బీజేపీ బారి నుంచి దేశాన్ని కాపాడాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా ధరలు పెంచుతోందని మండిపడ్డారు.
పెద్దపల్లి జిల్లాలో సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.
జాతీయ రాజకీయాల్లోకి రావాలని రైతు సంఘాల నేతలు తనను కోరారని సీఎం కేసీఆర్ వెల్లడించారు. దేశంలో బీజేపీని పారద్రోలి రైతు ప్రభుత్వం రాబోతోందని పేర్కొన్నారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం అందరూ సన్నద్ధం కావాలన్నారు. శ్రీలంక వెళ్లిన ప్రధాని మోదీని గో బ్యాక్ అన్నారని వెల్లడించారు. దేశంలో రైతులు వ్యవసాయానికి వాడే విద్యుత్ 20.8 శాతం మాత్రమేనని కేసీఆర్ వివరించారు. దేశంలో సాగు రంగానికి వాడే విద్యుత్ ఖరీదు రూ.1.45 లక్షల కోట్లు అని, అది కార్పొరేట్ దొంగలకు దోచిపెట్టినంత సొమ్ము కాదని అన్నారు. ఎన్ పీఏల పేరుతో రూ.12 లక్షల కోట్లు దోచిపెట్టారని ఆరోపించారు. రైతులకు ఇవ్వడానికి మాత్రం కేంద్రానికి చేతులు రావడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సింగరేణి ప్రైవేటీకరణ కుట్రను భగ్నం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ అవినీతి గద్దలు దేశాన్ని నాశనం చేస్తున్నాయని మండిపడ్డారు. అవినీతిపరుల బూట్లు మోసే సన్నాసులు తెలంగాణలో ఉన్నారని వ్యాఖ్యానించారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box