ఈడీ, బోడీలను పెట్టుకో.. ఏం పీక్కుంటావో పీక్కో

మునుగోడు సభలో కెసిఆర్ ఫైర్



ఈ డీకి దొంగలు భయపడతారు.. నేను ఎందుకు భయపడతా.. ఈడీ వాళ్లు వస్తే వాళ్లే నాకు చాయ్‌ తాగించి పోతారు. ఈ డీ, బోడీలను పెట్టుకో.. ఏం పీక్కుంటావో పీక్కో. ఎవరు యుద్ధం చేస్తారో వాళ్ల చేతిలోనే కత్తి పెట్టాలి. మీరు గోకినా గోకక పోయినా ... నేను గోకుతా అంటు సిఎం కెసిఆర్ మునుగోడులో జరిగిన ప్రజాదీవెన సభలో మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. మోదీని అహంకారమే పడగొడుతుందని విమర్శించారు. దేశం నుంచి బీజేపీని తరిమి కొడితేనే మనకు విముక్తి కలుగుతుందన్నారు. 

కేసీఆర్‌ బతికున్నంత వరకు రైతుబంధు ఆగదు. మీటర్లు పెట్టనివ్వను. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. అది వేస్ట్‌ అయిపోతుంది. మీ కోసం పాటుపడే వారికి ఓటు వేయాలి తప్ప పోటువేసేవాడికి కాదు’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

దేశంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను, సమాజాన్ని విభజించే విద్వేష విధానాలను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై చర్చిస్తున్నాం. దేశాన్ని, ప్రజలను ఎలా కాపాడుకోవాలనే దానిపై ఐదారు నెలలుగా తలలు బద్దలు కొట్టుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాం. ఇప్పుడున్న పరిస్థితులతో దేశం యొక్క జీవిక దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రగతిశీల, క్రియాశీల శక్తులు ఏకం కావాలని నిర్ణయించుకున్నాం. పేదలు, రైతుల బతుకులు బాగుపడేదాకా పోరాడుతాం. దేశంలో ప్రగతిశీల శక్తులన్నింటినీ ఒకటి చేసి పోరాటం కొనసాగిస్తాం. ఈ పోరాటం ఒక్క రోజుతో ఆగేది కాదు. ఈ ఉప ఎన్నికకే పరిమితం కాదు. మునుగోడు నుంచి ఢిల్లీ దాకా సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్ సహా మిగతా క్రియాశీల శక్తులన్నీ కలిసి పోరాడుతా మన్నారు.

ఇక్కడ గోల్ మాల్ చేసి ఉప ఎన్నిక వచ్చేలా చేశారు. ఇంకో ఏడాదిలోనే ఎన్నికలు ఉండగా ఇప్పుడు ఇక్కడ ఉప ఎన్నిక తేవాల్సిన అవసరం ఏమిటి? మిమ్మల్ని ఇలా ఎర్రటి ఎండలో నిలబెట్టాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? దీని వెనుకాల మాయా మశ్చీంద్ర ఏమిటి? గుర్తించకపోతే దెబ్బతినే ప్రమాదం ఉంటుంది..” అని కేసీఆర్ చెప్పారు.

తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడి ఎనిమిదేళ్లు అయింది. కృష్ణా నదిలో నీటి వాటా తేల్చాలని కోరితే ప్రధాని నరేంద్ర మోదీ తేల్చడం లేదు. ఎందుకు తేల్చడం లేదు? ఇప్పుడు మునుగోడుకు ఎందుకు వస్తున్నారు. మా నీటి వాటా మాకు ఇవ్వనందుకే అమిత్ షా తెలంగాణకు వస్తున్నారా? బిడ్డా.. అమిత్ షా సమాధానం చెప్పాలి. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చకపోవడానికి కారణమేంటో చెప్పాలి. మా నీటి వాటా తేల్చితే అందుకు అనుగుణంగా ప్రాజెక్టులను పూర్తిచేసుకుంటాం. కానీ తేల్చకుండా అడ్డం ఎందుకు పడుతున్నారు?” అని కేసీఆర్ ప్రశ్నించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు