డిజిపి పై బండి సంజయ్ అగ్రహం
జనగామ జిల్లా దేవరుప్పుల గ్రామంలో బీజేపీ శ్రేణులపై టీఆర్ఎస్ కార్యకర్తల రాళ్లదాడి ఘటనపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీ మహేందర్‌రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడిన ఆయన... బీజేపీ కార్యకర్తల తలలు పగలగొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని నిలదీశారు. తన పాదయాత్ర ప్రశాంతంగా కొనసాగేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేదంటే తర్వాత జరగబోయే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. టీఆర్ఎస్ కార్యకర్తల రాళ్లదాడిలో బీజేపీ కార్యకర్తలకు ఇద్దరికి తలలు పగిలాయని బండి సంజయ్ డీజీపీకి వివరించారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించకపోతే గాయపడ్డ కార్యకర్తలను 10 నిమిషాల్లో డీజీపీ ఆఫీసుకి తీసుకొస్తానని.. ముఖ్యమంత్రిని అక్కడికే రమ్మనండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు పోలీసులు కల్పించే భద్రత వద్దని.. కార్యకర్తలే తనను చూసుకుంటారని బండి సంజయ్ అన్నారు. కొందరు పోలీసులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కొమ్ముకాస్తూ ప్రతిపక్షాలను వేధిస్తున్నారని ఆరోపించారు. తాము ఎంతో ప్రశాంతంగా పాదయాత్ర కొనసాగిస్తుంటే టీఆర్ఎస్ నేతలు కావాలనే రెచ్చగొట్టి దాడికి పాల్పడ్డారని ఆరోపించారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box