దేశ ప్రజల చేతుల్లో రాజాస్థానాలు
శ్రీలంక నేర్పుతున్న పాఠాలు, గుణపాఠాలు!
ప్రియమైన మిత్రులారా!
ఈ భువికి తామే అధినాధులమని విర్రవీగిన నియంతలకు అంతిమంగా కుక్కచావు తప్పదు. ఇది చరిత్ర చెప్పిన సత్యం. మరోసారి శ్రీలంక చెబుతోన్న పాఠం.
కట్టలు తెంచుకున్న ధర్మాగ్రహంతో వెల్లువెత్తిన శ్రీలంక దేశ ప్రజల ఎదుట ఈరోజు మధ్యాహ్నం తన అధికార భవనం నుండి దేశాధ్యక్షుడు గోటబయ రాజపక్ష పలాయనం చిత్తగించిన విషయం తెల్సిందే. ఆయన జాడ కోసం ఆందోళనాకార్లతో సహా ప్రజలు గాలించారు. అధ్యక్ష భవనం నుండి పారిపోయినా, కొలంబో నగరంలోనే ఏదో మూలన దాక్కొని వుంటాడనేది ప్రజల సందేహం. ఇంతలో ఈరోజు సాయంత్రం ఒక సంచలన వార్త బయటకు పొక్కింది. అదేమిటంటే...
ప్రజలు అధ్యక్ష భవన్ ని స్వాధీనం చేసుకోబోతున్న పరిస్థితిని కొన్ని గంటల ముందే పసిగట్టిన దేశ అధ్యక్షుడు దొడ్డిదారి గుండా ఉడాయించినట్లు ఓ వార్త వెలువడింది. తన నివాస భవన్ కి దగ్గరలో తీరంలో ఆగిన *SLNS గజాబహు* అనే పేరు గల నౌకలోకి అధ్యక్షుడు జారుకున్నట్లు *న్యూస్ ఫస్ట్ ఛానెల్* కొలంబో నుండి కొద్ది సేపటి క్రితం ఓ వార్త ప్రసారం చేసింది. ఆయన్ని ఎక్కించుకున్న తర్వాత ఆ నౌక తీరానికి కొంత దూరంగా సముద్రం మధ్యకు వెళ్లి ఓ సురక్షిత ప్రాంతంలో లంగర్ వేసుకొని ఉందట. తనకు భద్రత ఉందనే నమ్మకం కలిగిన తర్వాతే మెయిన్ ల్యాండ్ లోకి ఆయన అడుగు పెడతాడనే వార్తని కూడా ఆ వార్తా ఛానెల్ ప్రసారం చేస్తోంది.
పైనపేర్కొన్న నౌక ద్వారా ఒకవేళ సముద్రంలోని సురక్షిత ప్రదేశానికి ఆయన చేరకపోవచ్చు. కొలంబోలోనే ఏదో ఒక మరుగు ప్రదేశంలోనే దాక్కొని అభద్రతా స్థితిలో బిక్కుబిక్కుమంటూ పడి ఉండొచ్చు. ప్రజలు వెదికి ఆయన్ని పట్టుకుంటారనే భయంతో ఆందోళనాకార్ల దృష్టిని మళ్లించే వ్యూహం కూడా వుండొచ్చు. ప్రజల నుండి ఆయన్ని రక్షించే లక్ష్యంతో ఇలాంటి గాలి వార్తల్ని పుట్టించి వ్యాప్తి చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఏది ఏమైనా, తామే ఈ భువికి అధినాధులమని విర్రవీగిన పాలకులకు పట్టిన దుస్థితికి ఇది అద్దం పడుతోంది.
ఇప్పుడు దేశాధ్యక్షుడు పారిపోయాడు. అడ్రెస్ లేని చోట దాక్కున్నాడు. ఆయన రాజ్యమేలిన రాజాస్థానాలు మొత్తం ప్రజల స్వాధీనంలో ఉన్నాయి. ఔను, అధ్యక్ష భవనం, ఆయన నివాసం తో పాటు పార్లమెంట్ భవన్ ప్రస్తుతం ప్రజల స్వాధీనంలో ఉన్నాయి. చరిత్ర ఎలాంటి విచిత్ర మలుపులతో ముందుకు సాగుతుందో కదా!
ఆర్ధిక సంక్షోభం క్రమంగా రాజకీయ సంక్షోభంగా మారి, చివరకు ప్రజా తిరుగుబాటుగా కూడా మారింది. ద్రవ్యోల్బణం, అధికధరలు, నిరుద్యోగం, ఆకలి మంటలు పెట్రేగిన కారణంగా తలెత్తిన ప్రజల తిరుగుబాటును నిరంకుశ పాలకులు పోషించిన మతతత్వం, ప్రాంతీయ తత్వం, జాత్యహంకారం అనే మూడు భూతాలు కాపడలేక పోయాయి. బ్రతుకు జీవుడా అంటూ పలాయనం చిత్తగించే దిక్కుమాలిన స్థితిలో పడ్డారు. అంతిమంగా ప్రజలే అజేయులని శ్రీలంక ప్రజలు మరోసారి నిరూపిస్తున్నారు. వారికి జేజేలు పలుకుదాం.
ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
7-15,pm,
9-7-2022
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box