అరవింద్ కాన్వాయ్ పై దాడి - ఖండించిన బిజెపి నేతలు- కేంద్ర హోం మంత్రి ఆరా

 


నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కాన్వాయ్ ని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం లోని ఎర్దండిలో టిఆర్ఎస్ పార్టి నేతలు  గ్రామస్తులతో కల్సి  అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం వరద ప్రాంతాల పరిశీలనకు ఎంపీ వస్తున్నారని తెలుసుకున్న టిఆర్ఎస్ నాయకులు అరవింద్ ను అడ్డుకుని నిరసన తెలపాలని గ్రామస్థులతో ముందే ప్లాన్ వేశారని బిజెపి నేతలు ఆరోపించారు. తమ గ్రామానికి చెందిన ఓ భూ వివాదాన్ని పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన అరవింద్ ఆ తర్వాత దాన్ని పట్టించుకోలేదని  గ్రామస్థులు  ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై  ఎంపీ కాన్వాయ్ కి అడ్డంగా నిలుచున్నారు.  పోలీసులు గ్రామస్తులను పక్కకు తప్పించి ఎంపీ కాన్వాయ్ ని ముందుకు పంపించారు. 

బిజెపి కార్యకర్తలు తమపై దాడి చేసారని టిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తు గ్రామస్థులను భారి సంఖ్యలో కూడగట్టారు. 

వరద ప్రాంతాల పరిశీలన పూర్తి చేసి తిరగి వస్తుండగా మరోసారి ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకున్నారు.  పోలీసులు వారిని బలవంతంగా అడ్డుతొలగించగా ఆగ్రహంతో ఎంపీ కాన్వాయ్ లో వాహనాలపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో రెండు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి.

ఎంపి అరవింద్ కాన్వాయ్ పై దాడి విషయం తెల్సుకున్న బాజపా నేతలు తీవ్రంగా ఖండించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి అరవింద్ ను  వివరాలు అడిగి తెల్సుకున్నారు. పథకం ప్రకారమే దాడికి పాల్పడ్డారని అరవింద్ హోం మంత్రికి వివరించారు. గ్రామాలలో బిజెపి నేతలు పర్యటించకుండా దాడులు జరపాలని టిఆర్ఎస్ నేతలు లక్ష్యంగా ఎంచుకున్నారని తెలిపారు. తనపై జరిగిన దాడి వెనక ఎమ్మెల్యే విద్యాసాగర్ ఉన్నారని అరవింద్ హోం మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. 

నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అరవింద్‌పై టీఆర్‌ఎస్‌ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, సీఎం కేసీఆర్‌ నియంత వైఖరిని ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక భౌతిక దాడులకు తెగబడటం సిగ్గు చేటన్నారు. ఇది మూమ్మాటికీ పిరికిపంద చర్య అని బండి సంజయ్‌ మండిపడ్డారు. ప్రజాస్వామ్యవాదులంతా టీఆర్ఎస్ దుశ్చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని కోరారు. 

ధర్మపురి అరవింద్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు హుజురాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. ఇవి ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనే సత్తా లేక చేస్తున్న చర్యలనీ అన్నారు. బిజెపి కి వస్తున్న ఆదరణను జీర్ణించుకోలేక దాడులకు దిగడం హేయమైన చర్య అని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, ప్రజాక్షేత్రంలో మీకు శిక్ష తప్పదని హెచ్చరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు