రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్నప్పటికీ, నన్ను బీజేపీ నేత అని ఎలా అనగల్గుతున్నారని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశ్నించారు. "అన్ని పార్టీల నేతలను కలిశాను. ఇంకా చెప్పాలంటే బీజేపీ నేతలను ఒకట్రెండుసార్లు మాత్రమే కలిశానన్నారు. ఏదన్నా ఉంటే నేరుగా అడగండి, నేను సమాధానం చెబుతాను. అలాగే సీఎస్, డీజీపీ, ఇతర అధికారులను వచ్చి వివరణ ఇవ్వమనండి” అని గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గణతంత్ర వేడుకలకు, ఉగాది వేడుకలకు ఎందుకు రాలేదు..ఇదేనా మర్యాద అని ప్రశ్నించారు? సీఎం సహా అందరినీ ఆహ్వానించానని గవర్నర్ స్పష్టం చేశారు.
రాజ్‌భవన్‌కు, గవర్నర్‌ను కావాలనే అవమానిస్తున్నారని అన్నారు. ఉగాది వేడుకలకు తాను ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించానని చెప్పారు. రాజ్‌భవన్‌కు ఏ పార్టీతోనూ సంబంధం ఉండదన్నారు. రిపబ్లిక్ డే, ఉగాది కార్యక్రమాలకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఒక మహిళకు గౌరవం ఇవ్వాల్సిన విధానం ఇది కాదని అన్నారు. సోదరిగా భావిస్తే ఇలాగే వ్యవహరిస్తారా అని గవర్నర్ తమిళిసై ప్రశ్నించారు.
రాజ్ భవన్ కు ప్రగత్ భవన్ కు మద్య దూరం పెరిగిన పరిణామాల నేపద్యంలో ఢిల్లీ వెళ్లిన గవర్నర్ వరుసగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు, హోం మంత్రి అమిత్ షాను కల్సి రాష్ట్రంలో పరిస్థితులు వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో పరిణామాలపై ప్రధాని, హోం శాఖ మంత్రి అసంతృప్తిగా ఉన్నారు. డ్రగ్స్, అవినీతిపై మోదీ, అమిత్ షాకు నివేదించాను. డ్రగ్స్ వాడకం యువతను నాశనం చేస్తోంది. ఈ విషయంలో ఒక తల్లిగా బాధపడుతున్నాను. సీఎం కేసీఆర్ ను అన్నగా సంభోదిస్తాను. కరుణానిధి, జయలలిత, మమత.. గవర్నర్లతో విభేదించినప్పటికీ ప్రభుత్వ కార్యక్రమాలకు పలిచేవారు తెలంగాణలోని ఆస్పత్రుల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. యూనివర్సిటీల్లో 60 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విశ్వవిద్యాలయాలను ఉద్దేశపూర్వకంగానే నిర్వీర్యం చేస్తున్నారు. ప్రొటోకాల్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకొనే అధికారం నాకు ఉంది. అయినా నేను అలా చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం పై నాకు ఎలాంటి కోపం లేదు” అని గవర్నర్ పేర్కొన్నారు.
ప్రభుత్వం రాజ్ భవన్ పై వివక్ష చూపుతోందని గవర్నర్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసమే ఎప్పుడూ ఆలోచిస్తానని తెలిపారు. తెలంగాణలో తాను రైలు, రోడ్డు మార్గంలో మాత్రమే ప్రయాణించగలను అని అన్నారు. ఎందుకో మీరే అర్థం చేసుకోండని మీడియాతో తమిళిసై అన్నారు. భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరవుతానని చెప్పారు. మేడారంకు రోడ్డు మార్గంలోనే వెళ్లానని చెప్పారు. భద్రాచలంకు కూడా రోడ్డు లేదా రైలు మార్గంలో వెళ్లనున్నట్టుగా తెలిపారు. తెలంగాణలో ఎవరూ తన ప్రయాణాన్ని ఆపలేరని తమిళిసై అన్నారు. మేడారంకు వెళ్లినప్పుడు ప్రోటోకాల్ పాటించలేదని తాను చెప్పలేదని.. సీతక్క చెప్పారని అన్నారు. యదాద్రిలో తనకు మర్యాద ఇవ్వలేదని మీడియా రాసిందని.. తాను అనలేదని గవర్నర్ తెలిపారు. సీఎం, మంత్రులు, సీఎస్.. రాజ్‌భన్‌కు ఎప్పుడైనా రావొచ్చని అన్నారు. తనతో సమస్య ఉంటే ఎవరైనా వచ్చి చర్చించవచ్చు అని తమిళిసై చెప్పారు. ప్రొటోకాల్ పాటించడం లేదని.. వ్యక్తిగతంగా తనను అవమానించినా భరిస్తానని, కానీ వ్యవస్థకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రభుత్వ మంచి పనుల్ని తాను అభినందించానని, పలు సూచనలు చేశానని గుర్తు చేశారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box