ప్రవాసులకు అమెరికాలో భారి ఊరట

యూఎస్‌ సిటిజెన్‌షిప్‌ యాక్ట్‌ బిల్లు ప్రవేశ పెట్టిన పెట్టిన డెమోక్రాట్లు
2021 బిల్లు తీసుకొచ్చిన బైడెన్‌


వాషింగ్టన్‌ : ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు అమెరికాలో ప్రవాసులకు ఊరట కలిగించే బిల్లు  ఆమోదించే దిశగా అడుగులు పడుతున్నాయి.  అమెరికాలో ఎన్నో సంవత్సరాలుగా నివాసముంటున్న భారతీయులతో సహా పలువురు విదేశీయులకు ఊరట కలిగించే విదంగా బిల్లు ప్రవేశ పెట్టారు. జో బైడెన్‌ సర్కార్‌  అత్యంత కీలకమైన అంశాలతో కూడిన ఈ ఇమ్మిగ్రేషన్‌ సవరణ బిల్లును యుఎస్‌ సిటిజెన్‌షిప్‌ యాక్ట్‌, 2021 ఆ దేశ చట్టసభలో ప్రవేశపెట్టారు. డెమొక్రాటిక్‌ పార్టీకి చెందిన సెనెటర్‌ జాబ్‌ మెనెండేజ్‌, ప్రతినిధుల సభ సభ్యురాలు లిండా సాంచెజ్‌ ఈ బిల్లును గురువారం సభలో ప్రతిపాదించారు. అక్రమంగా దేశంలో ప్రవేశించిన 8.5లక్షల మంది చిన్నారులకు వలసదారులుగా గుర్తింపు కల్పించటం, మరో 1.1కోట్లమంది అక్రమ వలసదారులకు పౌరసత్వం ఇవ్వటమే లక్ష్యంగా బిల్లును ప్రవేశపెట్టినట్టు వారు వెల్లడించారు. కాగా ఈ బిల్లు వల్ల ఎన్నో ఏండ్లుగా పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న ప్రవాస భారతీయులకు ప్రయోజనం కలుగుతుందని వార్తలు వెలువడ్డాయి. సవరణ బిల్లు కాంగ్రెస్‌లోని ఉభయ సభల (ప్రతినిధుల సభ, సెనెట్‌)లో ఆమోదం పొందాక, బైడెన్‌ సంతకంతో అది చట్టరూపం దాల్చుతుంది. ఈ సందర్భంగా బిల్లు రూపకర్తలు మాట్లాడుతూ, యుఎస్‌ పౌరసత్వ చట్టం, 2021 ఒక నైతిక, ఆర్థిక అత్యవసరంతో పాటు విస్తృతమైన, సమగ్ర ఇమ్మిగ్రేషన్‌ సంస్కరణలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాటుచేసిందిగా పేర్కొన్నారు. అలాగే ఉపాధి ఆధారిత ఇమ్మిగ్రేషన్‌ విధానంలో మార్పులు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు. దేశాల వారీ గ్రీన్‌కార్డు కోటా తొలగింపు, హెచ్‌1బీ వీసాదారుల భాగస్వాములకు దేశంలో పని చేసుకోవడానికి వీలు కల్పించడం లాంటివి దీని కిందకు వస్తాయని వారు పేర్కొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు