మామునూరుకు మంచిరోజులు వచ్చేనా ?
స్వాతంత్రానికి ముందు అతి పెద్ద విమానాశ్రయం....మామునూరు
స్వాతంత్రానికి పూర్వమే వరంగల్ ప్రజలకు విమాన ప్రయాణ సౌకర్యముండేది. 1941లో నాటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ జిల్లా కేంద్రానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలోని మామునూరు గ్రామంలో ఈ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ఎయిర్ పోర్ట్ అని కాకుండా ఎయిర్ స్ట్రిప్ అని పిలిచేవారు. స్వాతంత్రానికి ముందు ఉన్న విమానాశ్రయాలలో ఈ మామునూరు విమానాశ్రయం అత్యంత పొడవైన విమానాశ్రయంగా ఉండేది. మామునూరు గ్రామ కేంద్రంగా చుట్టుపక్కల ఉన్న నక్కలపల్లి, తిమ్మాపూర్, బొల్లికుంట గ్రామాల పరిధిలోని సుమారు రెండు వేల ఎకరాల స్థలం లో దీనిని నిర్మించారు. . మామునూరు తో పాటు సోలాపూర్ లోనూ నిజామ్ ప్రభుత్వం ఎయిర్ పోర్ట్ నిర్మించింది. వరంగల్ లోని ఆజాంజాహీ మిల్స్, కాగజ్ నగర్ లోని పేపర్ పరిశ్రమలుండడం తో ఈ నగరాలకు వచ్చే వ్యాపారస్తుల సౌకర్యార్థం మామునూరు విమానాశ్రయాన్ని ఆరవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించారు. అయితే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీనిలో 1100 ఎకరాలను వివిధ శాఖలకు కేటాయించింది.అతిపెద్ద రన్ వే పైన విమానాల రాకపోకలతో కళకళలాడిన ఈ విమానాశ్రయం 1964 వరకు కొనసాగింది. 1958 నుండి 1964 మధ్య కాలంలో స్వర్గీయ రాష్ట్రపతులు బాబూ రాజేంద్రప్రసాద్, సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్ తో పాటు ప్రథమ ప్రధాన జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, చివరగా విదేశాంగ మంత్రి హోదాలో దివంగత పి.వి. నరసింహారావు లాంటి వారు కూడా ఈ మామునూరు ఎయిర్ పోర్ట్ లో దిగారు.
ఈ విమానాశ్రయాన్ని పునరుద్దరించేందుకు 1980 లో వాయుదూత్ విమాన సర్వీసును ఇక్కడ ప్రవేశపెట్టారు. 18 సీట్లు గల విమాన సర్వీసును కొంత కాలం ఇక్కడి నుండి హైదరాబాద్ కు నడిపారు. హైదరాబాద్ - వరంగల్ లకు నేరుగా కాకుండా రామగుండం మీదుగా వాయుదూత్ ను తిప్పడం వల్ల ప్రజలకు అసౌకర్యంగా ఉండి వినియోగించుకునే అవకాశం తగ్గింది. వాయుదూత్ విమాన సర్వీసును ప్రవేశపెట్టినప్పుడు ప్రయాణికుల కోసం కొత్తగా మరో విశ్రాంతి భవనాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మంచినీటి సౌకర్యం కోసం ఇక్కడ వేసిన బోర్ నేటికీ వినియోగపడుతోంది. దశాబ్దాలుగా ఈ విమానాశ్రయాన్ని వినియోగించుకోకపోవడంతో ఇక్కడున్న విశాల ‘రన్ ’వే పైన చాలాకాలం భారత ఆహారసంస్థ (ఎఫ్.సి.ఐ) తమ గిడ్డంగులను ఏర్పాటుచేసింది. సరుకులను దించేందుకు వచ్చిపోయే లారీల వల్ల రన్ వే మరి కాస్తా దెబ్బతిన్నది. ‘కేలండర్’ అనే బ్రిటీష్ సాంకేతిక సంస్థ సహకారంతో విమానాలు నిలుపుకోవడానికి ఆనాడు ఇక్కడ ఏర్పాటు చేసిన ‘హేంగర్’ నేటికీ ఎన్.సి.సి క్యాడెట్ ల శిక్షణకు వినియోగిస్తున్న ‘గ్లయిడర్స్’ ను భద్రపర్చుకోవడానికి ుపయోగపడుతున్నది. విమానాల రాకపోకల సిగ్నలింగ్ వ్యవస్థ కోసం ఆనాడు ఏర్పాటుచేసిన అద్దాల భవనం, దాదాపు ఇరవైకి పైగా అతి పెద్ద సిబ్బంది క్వార్టర్లు శిథిలమైనప్పటికీ నాటి వైభవాన్ని గుర్తుచేసేవిగా ఉన్నాయి. 1936 లో బేగంపేట విమానాశ్రయాన్ని నిర్మించారు. బేగం పేట విమానాశ్రయానికి 130 కిలోమీటర్ల దూరంలో ఈ మామునూరు విమానాశ్రయం ఉంది.
నిజాం ప్రభుత్వం కేటాయించిన ఈ విమానాశ్రయ స్థలంలో దాదాపు 300 ఎకరాల స్థలాన్ని మామునూరు నాల్గవ బెటాలియన్ పోలీసు క్యాంపుకు, 400ఎకరాల స్థలాన్ని పాడిపరిశ్రమ కేంద్రానికి కేటాయించారు. మరికొన్ని ఎకరాల స్థలంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సాగుచేసుకుంటున్నారు. ఇటీవల జాతీయ విమానయాన సంస్థ ఈ విమానాశ్రయాన్ని పునరుద్దరించే ప్రయత్నాల్లో భాగంగా మరికొంత స్థలాన్ని సేకరించే ప్రయత్నంలో ఉంది.
*మామునూరు ను పునరుద్దరించేందుకై తెలంగాణా ప్రభుత్వం ప్రయత్నాలు*
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్ ఉదాన్ పథకం లో భాగం గా వరంగల్, కడప విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉండగా కేవలం కడప ను మాత్రమే అభివృద్ధి చేశారు. అదీకాక, హైదరాబాద్ లో బేగం పేట విమానాశ్రయాన్ని పూర్తిగా మూసివేసి శంషాబాద్ జీ.ఎం.ఆర్ ఎయిర్ పోర్ట్ చుటూ 120 కిలోమీటర్ల విస్తీర్ణంలో మరో కొత్త విమానాశ్రయాన్ని నిర్మించరాదనే శరతు తో అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుతో ముఖ్యమంత్రి కె.సి.ఆర్ మామునూరు విమానాశ్రయాన్ని తిరిగి నిర్మించేప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందుకోసం 200 ఎకరాల భూ సేకరణను కూడా ప్రారంభించారు. మామునూరు ఎయిర్ పోర్ట్ పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ గత ఐదేళ్లుగా కేంద్ర ప్రభుత్వానికి కె.సి.ఆర్ ప్రభుత్వం వినతులు అందచేస్తూనే ఉంది.
సంయుక్త సంచాలకులు
సమాచార శాఖ
9849905900
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box