యోగి పాలనలో మరో 'దిశ' -ఆగని అత్యాచారాలు
ఆలయ పూజారే అత్యాచార ప్రధాన నిందితుడు
మరో ఇద్దరితో కలిసి మహిళపై అమానుషానికి పాల్పడ్డారు
అత్యాచారం జరిపి అతికిరాతకంగ చంపారు
నీళ్లు లేని బావిలో పడి చనిపోయిందని చెప్పి
మృతదేహాన్ని ఇంట్లో పడేసి వెళ్లారు
బదాయూ, దిల్లీ: హాథ్రస్ హత్యాచారకాండను మరవకముందే ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో అత్యంత అమానుష ఘటన చోటుచేసుకుంది. గుడికెళ్లిన 50 ఏళ్ల మహిళపై ముగ్గురు కిరాతకులు అకృత్యానికి ఒడిగట్టారు. పశువాంఛతో సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు తీవ్రంగా దాడి చేశారు. కాలు, పక్కటెముకలు విరగ్గొట్టి, మర్మాంగాల్లో గాయాలు చేసి అత్యంత దారుణంగా చంపేశారు. ఈ అనాగరిక చర్యకు ఒడిగట్టినవారిలో గుడి అర్చకుడు కూడా ఉన్నాడు. మానవత్వానికే మచ్చలాంటి ఈ ఉదంతం ఎనిమిదేళ్ల క్రితం జరిగిన నిర్భయ ఘటనను గుర్తుకు తెస్తోంది. బదాయూ జిల్లాలో ఆదివారం రాత్రి జరిగిన ఈ అకృత్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంగన్‌వాడీ సహాయకురాలిగా పనిచేస్తున్న బాధితురాలు ఆదివారం సాయంత్రం పూజ కోసం గుడికి వెళ్లారు. రాత్రి 11 గంటల సమయంలో అర్చకుడు, తన ఇద్దరు అనుచరులతో కలసి బాధితురాలి మృతదేహాన్ని ఆమె ఇంటికి తీసుకొచ్చారు. ఆమె గుడి పరిసరాల్లో ఉన్న నీళ్లులేని బావిలో పడిపోయి మరణించారని ఆమె కుమారుడితో చెప్పి వెళ్లిపోయారు. సోమవారం పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి పోస్ట్‌మార్టం చేయగా బాధితురాలిపై జరిగిన అకృత్యం వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసి అర్చకుడి ఇద్దరు అనుచరులను మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. అర్చకుడు పరారీలో ఉన్నాడు. కాగా ఈ ఘటనపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఉఘయిటి పోలీస్ స్టేషన్ అధికారిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ అమానుష ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోలీసులను ఆదేశించినట్లు సీఎం కార్యాలయం ప్రకటించింది. ఈ హత్యాచార ఘటన తమను తీవ్రంగా కలచివేసిందని జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. ఈ ఉదంతంపై దర్యాప్తు చేసేందుకు కమిషన్ తరఫున ఓ బృందాన్ని పంపుతామని తెలిపింది. ఈ దారుణ ఉదంతంపై యూపీలోని విపక్షాలు భగ్గుమన్నాయి. మహిళల భద్రతకు సంబంధించి యూపీ ప్రభుత్వ ఉద్దేశంలోనే ఏదో దోషముందని రాష్ట్ర కాంగ్రెస్ బాధ్యురాలు ప్రియాంకా గాంధీ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా స్పందిస్తూ ‘‘ఇంకెంత మంది నిర్భయలు బలవ్వాలి? యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇంకెప్పుడు మేల్కొంటుంది?’’ అని ప్రశ్నించారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box