కదంబ అడవుల్లో జరిగింది భూటకపు ఎన్ కౌంటరేనా ?

 భాస్కర్ సురక్షితంగానే ఉన్నాడని తెలియ చేసేందుకు ఆయన పేరిట విడుదల అయిన ప్రెస్ నోట్




ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిది కదంబ అడవుల్లో  అసలు ఏం జరిగింది...నిజంగా మావోయిస్ట్ ఆగ్ర నేత దళంలో ఉన్నాడా..ఉంటే తప్పించుకున్నాడా...ఇద్దరు నక్సలైట్లు ఎదురు కాల్పుల్లో చనిపోయారని భాస్కర్ తప్పించుకున్నాడని భాస్కర్ ఇక తప్పించు కోలేడని 400 మంది పోలీసుల వలయం అతన్ని చుట్టుముట్టిందని పోలీసు అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు  టీవి చానెళ్ళు  బ్రేకింగ్ స్క్రోలింగ్ లు ఇచ్చాయి. 

మావోయిస్టు నేత భాస్కర్‌ తృటిలో తప్పించుకున్నాడని, అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని ఇన్‌ఛార్జ్‌ ఎస్పీ సత్యనారాయణ తెలిపారు. మావోయిస్టులు ఉనికి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని, నూతన రిక్రూట్‌మెంట్లతో బలపడాలని చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల నుంచి మావోయిస్టులకు సహకారం లభించడం లేదని, అందుకే వారి లక్ష్యం నెరవేరడం లేదని   ఎస్పి సత్యనారాయణ   చెప్పాడు. 


పోలీసులు చుట్టుముట్టినట్లు చెప్పిన మావోయిస్టు అగ్ర నేత భాస్కర్ పేరిట విడుదల చేసిన ప్రెస్ నోట్ లో అసలు అవి ఎదురు కాల్పులు కావని  ఏక పక్ష కాల్పులని పట్టుకుని కాల్చి చంపారని ఆరోపించాడు.

‘నిన్న రాత్రి చుక్కాలు, బాజీరావులను పోలీసులు పట్టుకుని చంపారు. తెలంగాణ ప్రభుత్వ పాశవిక అణచివేతకు ఈ ఎన్‌కౌంటర్ ఉదాహరణ. అరెస్టు చేయాల్సిన పోలీసులకు కాల్చి చంపే అధికారం లేదు. టీఆర్ఎస్, బీజేపీ నాయకులకు ప్రజల చేతిలో శిక్ష తప్పదు. కార్డెన్ సెర్చ్ పేరుతో ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తున్నారు’ అని కేబీఎం కార్యదర్శి, మావోల కీలకనేత భాస్కర్ విడుదల చేసిన ప్రెస్  నోట్‌లో పేర్కొన్నాడు.


గత కొద్దిరోజులుగా ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఉన్నాయని పోలీసులు విస్తృతంగా గాలింపు జరుపుతున్నారు. మావోయిస్టు నేత భాస్కర్ లొంగి పోనున్నాడని కూడ ప్రచారం జరిగింది.డిజిపి మహేందర్ రెడ్డి స్వయంగా ఆసిఫాబాద్ లో కాంపు వేసి పరిస్థితులు స్వయంగా పర్య వేక్షించాడంటే ఏం జరుగ బోతోందని అంతా ఉత్కంఠతో ఎదురు చూశారు. 

రెండు చోట్ల ఎదురు కాల్పులు జరిగి భాస్కర్ తప్పించు కున్నాడని కూడ వార్తలు వచ్చాయి. పోలీసులు గాలింపు జరుపుతున్న క్రమంలోనే  చుక్కాలు, బాజీ రావులు పోలీసులకు చిక్కి ఉండవచ్చనే అనుమానాలు మావోయిస్టు నేత భాస్కర్ విడుదల చేసిన ప్రెస్ నోట్  స్పష్టం చేస్తోంది. రెండు ఆయుధాలతో పాటు  వారి వద్ద సానుభూతి పరుల జాబితా లభించిందని వారంతా పోలీసుల అదుపులో ఉన్నారని వార్తలు వచ్చాయి.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు