రెండు కోట్ల సహాయానికి ధన్యవాదాలు..కోవిడ్ వారియర్స్ గా జర్నలిస్టులను గుర్తించి 20 లక్షల బీమా వర్తింపజేయండి
అల్లం నారాయణ అధ్వర్యంలోని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కార్యవర్గంలో ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం
తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ బారిన పడ్డ దాదాపు వెయ్యిమంది జర్నలిస్టులను ఆదుకునేందుకు ఇప్పటికే దాదాపు రెండు కోట్లు ఖర్చు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీ ఆర్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ లకు కృతజ్ఞతలు తెలుపుతూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానించింది. అయితే జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గుర్తించి 20 లక్షల భీమా సౌకర్యాన్ని కల్పించాలని, తక్షణ సహాయం కింద న్యాయవాదులకు కేటాయించినట్లే 25 కోట్ల రూపాయల నిధులను తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి తక్షణం కేటాయించాలని సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. ఆదివారం టీ యూ డబ్లూ జే రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆ సంఘ అధ్యక్షులు అల్లం నారాయణ అధ్యక్షతను జూమ్ యాప్ ద్వారా జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి జర్నలిస్ట్ సంఘం నాయకులు పాల్గొని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. కోవిడ్ నేపథ్యంలో ఫ్రంట్ వారియర్స్ గా ఉన్న జర్నలిస్టు లు ఇప్పటికే పెద్ద సంఖ్యలో దాదాపు వెయ్యి మంది వ్యాధి బారిన పడి అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆర్థికంగా చితికిపోయిన అలాంటి వారికి కొంత సహాయకారిగా మీడియా అకాడమీ 20,000 రూపాయలు అందిస్తున్నందుకు ఈ సమావేశం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ లకు కృతజ్ఞతలు తెలిపింది. అయితే మృత్యువాత పడ్డ జర్నలిస్టులకు 20 లక్షల బీమా సౌకర్యం ఉంటే ఆ కుటుంబాలకు మరింత మేలు జరుగుతుందని రాష్ట్ర నాయకులు అభిప్రాయపడ్డారు. న్యాయవాదులకు కేటాయించినట్టు గానే 25 కోట్ల రూపాయల సంక్షేమ నిధిని జర్నలిస్టుల కేటాయించి ముఖ్యమంత్రి కేసీఆర్ జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కొత్త రెవెన్యూ చట్టం తెచ్చిన ముఖ్యమంత్రి జర్నలిస్టు సమాజానికి ఇచ్చిన సొంత ఇంటి కల హామీని నెరవేర్చాలని తీర్మానించారు. కోవిడ్.19 ను ఆరోగ్య శ్రీ లో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్న ప్రభుత్వం జర్నలిస్ట్ హెల్త్ కార్డులను ( జే హెచ్ ఎస్) కూడా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చెల్లుబాటయ్యే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు. కరోనా తీవ్రత తగ్గిన అనంతరం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అసంపూర్తిగా ఉన్న కమిటీలను నూతనంగా నిర్మించుకోవాలని ఈ సందర్భంగా తీర్మానించారు. ఈ మధ్యకాలంలో మృతి చెందిన సీనియర్ జర్నలిస్టు దుబ్బాక శాసన సభ్యులు రామలింగారెడ్డి, తెలంగాణ వీడియో జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు ప్రకాశ్ తో పాటు మృతి చెందిన జర్నలిస్టులకు సంతాప తీర్మానాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్,TEMJU రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి రమణ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ హాజారి, బిఆర్ లెనిన్, జమాల్ పూర్ గణేష్, బిజిగిరి శ్రీనివాస్, చిన్న పత్రికల సంఘం అధ్యక్షులు యూసుఫ్ బాబు, హైదరాబాద్ అధ్యక్షులు యోగానంద్ తో పాటు అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, అనుబంధ సంఘాల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు
Please Do not enter any spam link in the comment box