కరోనాకు బాబారాం దేవ్ మందు..విడుదలకు ముందే ప్రచారం వద్దని కేంద్రం ఆంక్షలు

బాబా రాందేవ్- కరోనా ఔషదం


యోగా గురువు బాబా రాందేవ్ కనుగొన్న కరోనా మందుకు కేంద్ర ప్రభుత్వం బ్రేకులు వేసింది.కోరోనిల్ పేరిట కరోనాను పూర్తిగా నయం చేసే మందును తయారు చేశామని వచ్చే వారం నుండి అన్లైన్ స్టోర్స్ లోను పతంజలి సెంటర్లలోను లభిస్తాయని రాం దేవ్ బాబా ప్రకటన చేసిన కొద్ది గంటలకే కేంద్రం కీలక ప్రకటన జారి చేసింది.కోవిడ్ -19ను నయం చేసే మందుగా ఎలాంటి వ్యాపార ప్రకటనలు జారి చేయవద్దని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలి సంస్థను ఆదేశించింది. అధ్యయనం చేయకుండా కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రమేయం లేకుండా ఎకాఎకిన మందును మార్కెట్లో అమ్మకాలకు పెట్టడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 1954, డ్రగ్స్ నియంత్రణ చట్టం ప్రకారం పతంజలి ఈ మందుకు సంబంధించి ప్రకటనలు జారీ చేయడం అభ్యంతరకరమని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ మందుకు సంభంధించిన అన్ని వివరాలను అంద జేయాలని ఎక్కడ పరిశోధనాత్మక అధ్యయనం చేశారో,ఈ మందు వేటితో తయారైందో, శాంపిల్ పరిమాణంతో సహా అన్ని వివరాలను వెల్లడించాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ పతంజలి సంస్థకు ఆదేశాలు జారీ చేసింది.

 కోరోనిల్ టాబ్లెట్స్ వాడితే 4నుండి 14 రోజుల్లో నూటికి నూరు శాతం కరోనా -కోవిడ్ 19 నయం అవుతుందని హరిద్వార్‌లోని యోగ్‌పీఠ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో  మందు విడుదల సందర్భంగా  రాందేవ్ బాబా తెలిపారు.
‘కరోనా మహమ్మారితో ప్రపంచదేశాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాయి. ఇలాంటి విపత్కర సమయంలో మందు తీసుకురావడం ముఖ్యమైన ప్రక్రియ. ఆయుర్వేదంతో కరోనాను నయం చేయవచ్చు. ఈ మందుతో మూడు రోజుల పరిశీలనలో 69 శాతం మందికి నెగిటివ్‌ రావడం శుభసూచకం. అలాగే 7 రోజుల్లో వంద శాతం మంది కోలుకున్నారు.మందును తీసుకురావడంలో మా శాస్త్రవేత్తలు చేసిన కృషి అభినందనీయం’ అని రాందేవ్‌ పేర్కొన్నారు.

కరోనిల్‌ కిట్‌ ధరను రూ.545గా నిర్ణయించారు. కిట్ లో 30 రోజులకు సరిపడా ఔషధాలు ఉంటాయి. కరోనిల్ టాబ్లెట్స్ తో పాటు శ్వాసరివటి ముక్కులో వేసుకునేందుకు ప్రత్యేకంగా డ్రాప్స్ ఉంటాయి.
మందు మార్కెట్ లో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న సమయంలో కేంద్రం ఆంక్షలు విధించడంతో అసలు మందు మార్కెట్ లోకి విడుదల చేస్తారా లేదా అనే విషయంలో సందిగ్దత నెలకొంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు