మావోయిస్టులకు వరుసగా భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మావోయిస్టు పార్టీకి దశాబ్దాలుగా కీలక నేతగా ఉన్న మల్లోజుల వేణుగోపాల్‌రావు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ముందు లొంగిపోయిన మరుసటి రోజే, మరో 170మంది మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయారు.
ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. ఆయన ‘ఎక్స్’లో చేసిన పోస్టులో, ఛత్తీస్‌గఢ్‌లో 27మంది, మహారాష్ట్రలో 61మంది మావోయిస్టులు లొంగిపోయి ప్రజాస్రవంతిలో చేరారని తెలిపారు. కేవలం రెండు రోజుల్లో మొత్తం 258మంది లొంగిపోయారన్నది, నక్సలిజంపై పోరాటంలో పెద్ద విజయమని ఆయన పేర్కొన్నారు.
హింసను వదిలి, భారత రాజ్యాంగంపై విశ్వాసం ఉంచిన వారికి అభినందనలు తెలిపారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు చేస్తున్న కృషికి ప్రతిఫలమని చెప్పారు.
లొంగిపోయేవారిని స్వాగతిస్తామని, కానీ తుపాకీతో ఉద్యమం కొనసాగించే వారిపై భద్రతా దళాలు కఠిన చర్యలు తీసుకుంటాయని హెచ్చరించారు. నక్సలిజం మార్గంలో ఉన్నవారు ఆయుధాలు వదిలి ప్రజాస్రవంతిలో చేరాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని సమూలంగా అంతం చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌మడ్, ఉత్తర బస్తర్ ప్రాంతాలు ఇప్పుడు విముక్తప్రాంతాలుగా ప్రకటించబడడం సంతోషకరమని తెలిపారు. ప్రస్తుతం దక్షిణ బస్తర్‌లో మాత్రమే కొంతమంది మావోయిస్టులు మిగిలి ఉన్నారని, వారిని కూడా త్వరలో భద్రతాదళాలు నిర్మూలిస్తాయని చెప్పారు.
2024 జనవరి నుండి ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో 2,100మంది మావోయిస్టులు లొంగిపోయి, 1,785మందిని అరెస్టు చేసి, 477మందిని భద్రతాదళాలు నిర్వీర్యం చేశాయని అమిత్ షా వివరించారు.
వాసుదేవరావుపై కోటి రూపాయల రివార్డు!
లొంగిపోయిన వారిలో పలువురు సీనియర్ మావోయిస్టు నాయకులు ఉన్నారు. వారిలో సతీష్ అలియాస్ టి. వాసుదేవరావు (CCM) తలపై ₹1 కోటి రివార్డు ఉందని సమాచారం. అలాగే రాణిత (SZCM & మాడ్ DVC కార్యదర్శి), భాస్కర్ (DVCM, PL-32), నీలా అలియాస్ నందే (DVCM, నెల్నార్ AC కార్యదర్శి), దీపక్ పాలో (DVCM, ఇంద్రావతి AC కార్యదర్శి) వంటి కీలక నేతలు కూడా ఉన్నారు.
వీరిలో SZCM ర్యాంక్ నేతలపై ₹25లక్షలు, DVCMలపై ₹10–15లక్షలు, ACMలపై ₹5లక్షల చొప్పున రివార్డు ఉంది.