Site icon MANATELANGANAA

ఆర్మీ అధికారి కండకావరం – స్పైస్‌జెట్ సిబ్బందిపై దాడి శ్రీనగర్‌ విమానాశ్రయంలో ఘటన

army officer attack

జూలై 26న శ్రీనగర్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఢిల్లీకి బయలుదేరాల్సిన సీనియర్ ఆర్మీ అధికారి, స్పైస్‌జెట్ విమాన సిబ్బందిపై దాడి చేసి నలుగురిని తీవ్ర గాయపరిచారు. ఇందులో ఒకరికి వెన్నెముక విరిగి తీవ్రంగా గాయపడ్డాడు.

ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యి, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీడియోలో ఆ అధికారి సిబ్బందిని తోసిపారేయడం, పంచ్‌లు, కిక్‌లు ఇవ్వడం, క్యూలైన్ స్టాండ్‌తో కొట్టడం వంటి దృశ్యాలు రికార్డు అయ్యాయి.

స్పైస్‌జెట్ ప్రకటన ప్రకారం, “శ్రీనగర్ నుంచి ఢిల్లీకి బయలుదేరే ఎస్‌జీ-386 విమానంలో బోర్డింగ్ గేట్ వద్ద ఆ అధికారి మా నలుగురు ఉద్యోగులపై దాడి చేశారు. ఒకరికి వెన్నెముక విరిగింది. మరొకరికి దవడ బొక్క విరిగింది. ఒక సిబ్బంది స్పృహ తప్పి పడిపోయినా వదలకుండా ఆయనపై దాడి కొనసాగించారు” అని పేర్కొన్నారు.

మరొక సిబ్బంది సహాయం చేయడానికి వంగినపుడు, ఆ అధికారి ఆయన దవడపై బలమైన కిక్ ఇవ్వడంతో ముక్కు, నోటి నుండి తీవ్ర రక్తస్రావం జరిగింది.

ఆ అధికారి చేతి సామాను 16 కిలోల బరువు ఉండగా, అనుమతించబడిన 7 కిలోల పరిమితిని మించి ఉంది. అదనపు ఛార్జీలు చెల్లించాల్సిందిగా మర్యాదపూర్వకంగా సిబ్బంది చెప్పారు. ఆయన ఒప్బోపుకోకుండా బోర్డింగ్ ప్రక్రియ పూర్తి చేయకుండా దురుసుగా ఏరోబ్రిడ్జ్‌లోకి వెళ్లాడు. ఈ సమయంలో CISF సిబ్బంది ఆయనను తిరిగి గేట్ వద్దకు తీసుకువచ్చారు.

ఘటన అనంతరం ఆ అధికారిని విమానాశ్రయంలోనే నిర్బంధించారు. అయితే, స్పైస్‌జెట్ ఈ విషయాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లి, తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకునిదర్యాప్తు చేస్తున్నారు.

విమానయాన భద్రత ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పైస్‌జెట్ స్పష్టం చేసింది.

ఇక ఇదే సమయంలో, మరో సంఘటనలో, ముంబై-కొలకతా ఇండిగో విమానంలో సహప్రయాణికుడికి చెంపదెబ్బ కొట్టిన వ్యక్తిపై ఆ విమానయాన సంస్థ ప్రయాణ నిషేధం విధించినట్లు శనివారం ప్రకటించింది.

Share this post
Exit mobile version